Fire Safety: పొగతోనే ప్రమాదం
ABN , Publish Date - May 20 , 2025 | 04:33 AM
హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం వంటి ఘటనల్లో, కాలిన గాయాలకంటే పొగ పీల్చడం వల్ల మరణాలు ఎక్కువగా జరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించుకోవడానికి పొగల వల్ల కలిగే ప్రమాదాలను అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ చార్మినార్ చేరువలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఏకంగా 17 మంది దుర్మరణం పాలైన విషయం మనందరికీ తెలిసిందే! సాధారణంగా ఇలాంటి అగ్నిప్రమాదాల్లో కాలిన గాయాలకు మించి, అగ్నికీలల నుంచి వెలువడే పొగను పీల్చుకోవడం వల్లే
మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎలా నడుచుకోవాలో, విషపూరిత పొగల నుంచి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వైద్యులు వివరిస్తున్నారు
సాధారణంగా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు భయంతో, మంటలకు దూరంగా పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ దట్టంగా పరుచుకున్న పొగల నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయాలి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెలువడే పొగలను పీల్చుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందని పరిస్థితి తలెత్తుతుంది. దీనికి తోడు పొగలోని కార్బన్ మోనాక్సైడ్ అనే విషపూరిత వాయువు ఊపిరితిత్తులను దెబ్బ తీస్తుంది. ఆ ప్రదేశంలోని వేడి, సెగ, మంటల వల్ల ముక్కు నుంచి గొంతు వరకూ శ్వాసకోశాల్లో వాపు ఏర్పడుతుంది. అలాగే మంటల మూలంగా ఊపిరితిత్తుల గొట్టాలకు గాయాలవుతాయి. కాబట్టి అగ్నిప్రమాదానికి గురైనప్పుడు ఆ తీవ్రత నుంచి తప్పించుకునే మార్గాలను అనుసరించాలి. అందుకోసం...
తేలికగా ఉండే పొగలు గదిలో పైకి చేరుకుంటాయి. కాబట్టి నేల మీదకు వంగి అక్కడి నుంచి తప్పించుకోవాలి
వస్త్రాన్ని ముక్కుకు అడ్డుపెట్టుకోవడం వల్ల కొంత మేరకు ప్రయోజనం ఉంటుంది
శరీరం కాలకుండా తడిపిన వస్త్రాన్ని చుట్టుకోవచ్చు
మంటల్లో కాలిన వారిని రక్షించాలనే తొందర్లో చేతులతో చుట్టేస్తే గాయాల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ల ఒంటికి వస్త్రం చుట్టి, ఆ తర్వాతే తరలించాలి
లేదంటే కాలిన గాయాలైన వారికి వస్త్రం చుట్టి నేల మీద దొర్లిస్తూ తరలించాలి
నియంత్రణ ఇలా...
మంట, పొగలను పసిగట్టే ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్ లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి
ఇంట్లో తేలికగా తగలబడే వీలున్న వస్తువులను పరిమితం చేసుకోవాలి
ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండేలా చూసుకోవాలి
మంటలను ఆర్పే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి
ప్రథమ చికిత్స
అగ్నిప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించేలోగా...
నూరు శాతం ఆక్సిజన్‌ను అందించే ‘నాన్ రీబ్రీతర్ మాస్క్’ను ఉపయోగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందేలా చేయాలి
కుంచించుకుపోయిన శ్వాసనాళాలను విప్పార్చే ఇన్‌హేలర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు
దీర్ఘకాలంలో...
అగ్నిప్రమాదం బారిన పడిన వారు దీర్ఘకాలంలో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సిఒపిడి)కు గురయ్యే అవకాశాలుంటాయి. అగ్నిప్రమాద సమయంలో పొగలను పీల్చుకోవడం వల్ల, ఆ ప్రభావంతో ఊపిరితిత్తుల్లోని గాలిగదులు దెబ్బతినే పరిస్థితి ఇది. అలాగే విపరీతమైన మంటలు, పొగలకు బహిర్గతమైన వారి ఊపిరితిత్తులు గట్టిపడిపోతాయి. గాలిగొట్టాలు కూడా కుంచించుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే పొగలోని కార్బన్‌మోనాక్సైడ్ వాయువును ఎక్కువగా పీల్చుకోవడం వల్ల, ఆ క్రమంలో మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక, తర్వాతి కాలంలో కొన్ని మెదడు సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇంకొందరు ఆస్తమాను పోలిన పిల్లకూతలు, ఆయాసంతో బాధపడే పరిస్థితి తలెత్తవచ్చు. కాబట్టి అగ్నిప్రమాదం బారిన పడినవారు ఎటువంటి చికిత్సతో పనిలేకుండా పూర్తిగా కోలుకున్నప్పటికీ, దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల అస్వస్థలకు గురికాకుండా ఉండడం కోసం, ఊపిరితిత్తుల పనితీరునూ, సామర్థ్యాన్నీ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం ప్రమాదం జరిగిన ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి పల్మొనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి.
డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల
సీనియర్ ఇంటర్వెన్షనల్
పల్మనాలజిస్ట్, యశోద
హాస్పిటల్స్, సికింద్రాబాద్.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి