Priyanka Ingle: ప్రియమైన విజయం
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:15 AM
అనుభవం... నైపుణ్యం... పటిష్టమైన వ్యూహాలతో భారత మహిళా జట్టుకు అపురూప విజయాన్ని అందించిన ఆమె... ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లను అధిగమించింది.
ప్రియాంక ఇంగ్లే... నిన్నటివరకు ఈ పేరు పెద్దగా తెలియదు. కానీ మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన జట్టు సారథిగా ఇప్పుడామె దేశమంతటికీ సుపరిచితురాలు. అనుభవం... నైపుణ్యం... పటిష్టమైన వ్యూహాలతో భారత మహిళా జట్టుకు అపురూప విజయాన్ని అందించిన ఆమె... ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లను అధిగమించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా... అహర్నిశలూ శ్రమించి తన కలను నిజం చేసుకున్న 24 ఏళ్ల ప్రియాంక కథ ఇది.
‘ఎంతో గర్వంగా అనిపిస్తోంది’... భారత మహిళల జట్టు మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన తరువాత ప్రియాంక ఇంగ్లే ఉద్వేగంగా చెప్పిన మాటలివి. వాస్తవానికి దానికి మించిన ఆనందం ఆమెకు మరొకటి ఉంది. అదే ఖోఖోకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం... తనలాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అంతర్జాతీయ వేదిక ఒకటి అవతరించడం. గత నెల ఢిల్లీలో జరిగిన ఈ మెగా టోర్నీలో పాతిక దేశాలు తలపడ్డాయి. ప్రియాంక నేతృత్వంలోని భారత జట్టు... మ్యాచ్ మ్యాచ్‌కూ పరిణతి కనబరుస్తూ... వరుసు విజయాలతో దూసుకుపోయింది. ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ‘ఇంతకుముందు చాలామందికి ఈ ఆట గురించి తెలియదు. ఖోఖో అనగానే అదేదో పాఠశాల స్థాయి క్రీడగా భావించేవారు. ఇప్పుడు దీనికి మంచి వేదిక దొరికింది. ముఖ్యంగా మన ఆటకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. అందుకే నా దృష్టిలో ఇది ఒక చారిత్రక విజయం. ఇది గ్రామీణ క్రీడాకారుల్లో ఎనలేని స్ఫూర్తి నింపుతుంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది ప్రియాంక.

రైతు బిడ్డ...
మహారాష్ట్రలోని కరువు ప్రాంతమైన బీడ్ జిల్లాకు చెందిన ప్రియాంక కుటుంబం... తరువాత పూణె శివారు దిఘికి వలస వెళ్లింది. ఆమె తల్లితండ్రులు హనుమంత్, సవిత చిన్నకారు రైతులు. సొంత ఊళ్లో సాగు లేకపోవడంతో దిఘికి వచ్చి చిన్న పనుల్లో చేరారు. వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. ఒకేఒక్క ఇరుకు గదిలో కుటుంబమంతా తల దాచుకునేది. కానీ ఇవేవీ ప్రియాంక ఆకాంక్షకు అవరోధం కాలేదు. తనకు ఇష్టమైన ఖోఖోలో అత్యున్నత స్థాయికి చేరాలని కలలు కన్నది. ఐదో తరగతిలోనే ఆట మొదలుపెట్టింది. క్రమంగా అదే తన లోకం అయింది. ‘చిన్నప్పుడు స్కూల్లో ఆడుతుంటే చూశాను. అప్పటి నుంచీ ఖోఖో తప్ప ఇక నాకు ఏ ఆటా నచ్చలేదు. మొదట్లో మా స్కూలు జట్టుకు ఆడాలని తపించేదాన్ని. అక్కడ మెరుగ్గా రాణించాను. ఆటపై పట్టు దొరికింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అది నా ఆలోచనల్ని మార్చేసింది. జాతీయ స్థాయిలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కష్టపడ్డాను. ఆ కల నిజమైంది. భారత జట్టుకు ఎంపికయ్యాను. నేడు ప్రపంచ కప్ గెలవడం నా జీవితంలోనే అత్యంత విలువైన, ప్రత్యేకమైన సందర్భం’ అంటుంది ఆమె.
చదువులోనూ ముందే...
‘శ్రీ సయాజీనాథ్ మహారాజ్ విద్యాలయ’లో ఐదో తరగతి చదువుతుంగా ఖోఖో మొదలుపెట్టిన ప్రియాంక... స్కూల్ జట్టులో చేరాలనుకుంది. కానీ అందుకు ఆమె తల్లితండ్రులు ఒప్పుకోలేదు. ‘ఆటవల్ల నా చదువు దెబ్బతింటుందని అమ్మానాన్న భావించారు. మా బంధువుల్లో ఒకరు డాక్టర్. తనలా నన్ను కూడా ఎంబీబీఎస్ చదివించాలని అనుకున్నారు. అయితే ఆటలో నేను బాగా రాణిస్తుండడంతో మనసు మార్చు కున్నారు. నన్ను ప్రోత్సహించారు. మా నాన్న కోరుకున్నట్టు డాక్టర్‌ను కాలేదు కానీ... చదువులో కూడా నేను ముందు న్నాను. ఎనభై శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాను. పన్నెండో తరగతిలో, ఆ తరువాత డిగ్రీలో కూడా మంచి మార్కులే తెచ్చుకున్నాను’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ప్రియాంక ఎంకాం పూర్తి చేసింది.
పదిహేనేళ్లుగా...
ఈ ప్రయాణంలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోలేదు ప్రియాంక. కుటుంబ పరిస్థితులు, చదువు పేరు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయలేదు. పట్టుదలగా ప్రయత్నించి పదిహేనేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ప్రొఫెషనల్ క్రీడాకారి ణిగా అదరగొడుతోంది. పన్నెండేళ్లకే రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆమె పేరు... జాతీయ సబ్‌జూనియర్ ఖోఖో టోర్నమెంట్‌తో వెలుగులోకి వచ్చింది. ఆ టోర్నీలో అత్యుత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంది. 2016 ఆసియా ఖోఖో చాంపియన్‌షిప్ ప్రియాంక కెరీర్‌లోనే పెద్ద మలుపు. అందులో భారత జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. తరువాతి ఎడిషన్‌లో రజతం సాధించింది. ఇప్పటివరకు 23 జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొంది. ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతోంది.
ఆటలో తిరుగులేదు...
అపార అనుభవంతో పాటు మెరుపు వేగం, నైపుణ్యం, ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలు రచించడంలో ప్రియాంక దిట్ట. ఇవే ఆమెను తిరుగులేని క్రీడాకారిణిగా నిలిపాయి. ప్రపంచ కప్‌లో భారత జట్టును నడిపించే బాధ్యతను అప్పజెప్పాయి. ‘మొదటి ప్రపంచ కప్. అందులో పాల్గొనే మన దేశ జట్టు నాయకత్వ బాధ్యతలు నాకు అప్పగించడం... నిజంగా ఇది అద్భుతమైన అనుభూతి’ అంటూ టోర్నీకి ముందు ప్రియాంక భావోద్వేగానికి లోనైంది. భారత్‌లో ఖోఖో భవిష్యత్తుకు ఈ టోర్నీ బంగారు బాట వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
విజయాలకు గురు ్తగా...
ఖోఖోనే తన ప్రపంచంగా సాగిపోతున్న ప్రియాంక... ఎన్నో అపురూప విజయాలను తన ఖాతాలో వేసుకుంది. వీటికి గుర్తుగా రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం ‘రాణి లక్ష్మీబాయి అవార్డు’తో పాటు ‘శివ్ ఛత్రపతి స్టేట్ స్పోర్ట్స్ అవార్డు’నిచ్చి గౌరవించింది. అంతకముందు సబ్‌జూనియర్ జాతీయ ఖోఖో టోర్నీలో కనబరిచిన ప్రతిభకు గానూ... ఉత్తమ క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. ఇవికాకుండా స్థానికంగా ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంది. ప్రపంచ కప్ గెలిచాక ప్రియాంకతో పాటు జట్టు సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ ప్రకటించారు.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి