Share News

ఆ దేశానికి వీసా లేకుండానే...

ABN , Publish Date - Jul 06 , 2025 | 08:49 AM

కొన్నిసార్లు దేశంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చే విమాన ఖర్చులతో మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వెళ్లొచ్చు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ‘వీసా’... అదే ‘వీసా ఫ్రీ’ ఉంటే పర్యాటకుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.

 ఆ దేశానికి వీసా లేకుండానే...

కొన్నిసార్లు దేశంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చే విమాన ఖర్చులతో మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వెళ్లొచ్చు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ‘వీసా’... అదే ‘వీసా ఫ్రీ’ ఉంటే పర్యాటకుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాలు భారతీయులకు ఈ సౌలభ్యాన్ని కలిగిస్తుంటే... తాజాగా వాటి సరసన ‘ఫిలిప్పీన్స్‌’ కూడా చేరింది. దీంతో భారతీయులకు మరో పర్యాటక ప్రాంతం స్వాగతం పలికినట్టయ్యింది...

- ఇటీవల ఫిలిప్పీన్స్‌ దేశం భారతీయులకు 14 రోజుల వీసా ఫ్రీ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనతో గత ఏడాది ఆ దేశాన్ని 80 వేల మంది చుట్టొచ్చారు. అంటే వీసా పేపర్‌ వర్క్‌ లేకుంటే పర్యాటకులు ఆయా దేశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారని అర్థం అవుతోంది.


book3.2.jpg

- వీసా ఫ్రీ, వీసా ఆన్‌ అరైవల్‌ (వీఓఏ) దేశాల పట్ల భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రసిద్ధ పర్యాటక సంస్థల నివేదిక 2025 ప్రకారం 44 శాతం మంది ప్రయాణీకులు వాటిపట్ల మొగ్గు చూపుతున్నారు.

- భారతీయ పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి ‘వీసా ఆన్‌ అరైవల్‌’ ప్రకటించిన దేశాల్లో మాల్దీవులు, కాంబోడియా, ఇండోనేషియా, వియత్నాం, జోర్డాన్‌ మొదలైనవి ఉన్నాయి. ఇక పరిమిత రోజులకు వీసా ఫ్రీ అంటున్న దేశాల్లో మారిషస్‌, నేపాల్‌, హాంకాంగ్‌, ఫిజీ తాజాగా ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి.

- 2025 తొలి త్రైమాసికంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన దేశాల్లో మలేషియా ముందు వరుసలో ఉంది. మలేషియా టూరిజం డేటా ప్రకారం ఆ దేశాన్ని సుమారు కోటి మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. తర్వాతి స్థానాల్లో థాయిలాండ్‌, వియత్నాం, సింగపూర్‌ ఉన్నాయి.


- వీసా రిలాక్సేషన్‌ తర్వాత ఫిలిప్పీన్స్‌ గురించి ఇంటర్‌నెట్‌లో వెదుకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక వారంలోనే మనదేశం నుంచి 25 శాతం పెరిగింది. సౌత్‌ఈస్ట్‌ ఆసియాలో థాయిలాండ్‌, ఇండోనేషియా తర్వాత ఫిలిప్పీన్స్‌ ఉంది.

- మనదేశం (ఢిల్లీ, మనాలీ) నుంచి ఫిలిప్పీన్స్‌కు డైరెక్ట్‌ ఫ్లయిట్స్‌ నడిపేందుకు ఎయిరిండియా ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇవి ప్రారంభం అవుతాయంటున్నారు.

- ద్వీపాలు, జలపాతాలు, బీచ్‌లు ఇష్టపడేవారికి ఫిలిప్పీన్స్‌లోని బొరాకే (తెల్లటి ఇసుక బీచ్‌లు), పలవాన్‌ (పర్వతారోహణ), బొహోల్‌ (అందాల దీవి), సియర్గావ్‌ (సర్ఫింగ్‌), బనావ్‌ రైస్‌ టెర్రస్‌ (యునెస్కో వారసత్వ సంపద), చెబూ (జలపాతాలు) కనువిందు చేస్తాయి. సో... వీసా లేకుండానే మనకు సమీపాన ఉన్న మరో దేశాన్ని చుట్టి వచ్చేందుకు ఎంచక్కా సిద్ధం కావొచ్చు.

Updated Date - Jul 06 , 2025 | 08:49 AM