Share News

ఈ ఆశ్రయం మెరుగైన ప్రపంచం కోసం

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:40 AM

వైకల్యం ఉందని కుంగిపోలేదు. సవాళ్ళు ఎదురైనా భయపడలేదు. నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతటి శ్రమనైనా లెక్క చేయలేదు. మూడేళ్ళకే పోలియో బారిన పడిన డాక్టర్‌ ఐశ్వర్యారావు విధిని ఎదిరించి...

ఈ ఆశ్రయం మెరుగైన ప్రపంచం కోసం

వైకల్యం ఉందని కుంగిపోలేదు. సవాళ్ళు ఎదురైనా భయపడలేదు. నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతటి శ్రమనైనా లెక్క చేయలేదు. మూడేళ్ళకే పోలియో బారిన పడిన డాక్టర్‌ ఐశ్వర్యారావు విధిని ఎదిరించి గెలిచారు. వైద్యురాలిగా సేవలందిస్తూనే... నిలువనీడలేని వికలాంగ మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ మధ్యే వారి కోసం ప్రత్యేకంగా ఒక జిమ్‌ కూడా ఏర్పాటు చేసి, పారా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. చెన్నైకి చెందిన 52 ఏళ్ళ ఐశ్వర్య స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

‘‘మాది విద్యావంతుల కుటుంబం. మా నాన్న ఐఎఎస్‌ అధికారి. నన్ను బాగా చదివించాలనేది ఆయన కోరిక. కానీ తొమ్మిదేళ్ళు వచ్చేదాకా నేను బడికే వెళ్ళలేదు. కారణం... నాకు మూడేళ్ళ వయసులో పోలియో సోకింది. నా కండరాలన్నీ బలహీనమైపోయాయి. కాళ్ళను స్వతంత్రంగా కదపలేకపోయేదాన్ని. నా తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు, ఎందరో వైద్యులను కలిశారు. కానీ పెద్దగా ప్రయోజనం కలగలేదు. అలా ఆరేళ్ళపాటు ఇంటికే పరిమితమైపోయాను. ఇంట్లోనే అమ్మ దగ్గర రాయడం, చదవడం నేర్చుకున్నాను. నన్ను బడికి పంపడానికి మొదట్లో సంకోచించినా... నా ఉత్సాహం చూసి నాన్న ఒప్పుకున్నారు. అదృష్టవశాత్తూ ఒక స్కూల్‌లో నన్ను చేర్చుకోవడానికి ప్రిన్సిపాల్‌ అంగీకరించారు. కొన్ని పరీక్షలు పెట్టి... మూడో తరగతిలో అడ్మిషన్‌ ఇచ్చారు. అప్పుడు నాకు తొమ్మిదేళ్ళు.


కొత్త ప్రపంచంలో...

స్కూల్‌ అనేది అప్పటికి నాకు పూర్తిగా కొత్త ప్రపంచం. ‘అక్కడ ఎలా నెగ్గుకొస్తానా?’ అనే అనుమానాలతోనే తరగతి గదిలోకి అడుగుపెట్టాను. అయితే తోటి విద్యార్థులు స్నేహపూర్వకంగా ఆహ్వానించారు. దాంతో నాకున్న సంకోచాలన్నీ మాయమయ్యాయి. అందరిలాగే నేను కూడా ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది. చదువులో ఒక్కొక్క మెట్టూ ఎక్కాను. ఇంటర్‌ తరువాత... నాకు ఆరు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో, ఒక మెడికల్‌ వైద్య విశ్వవిద్యాలయంలో సీట్లు వచ్చాయి. తీవ్రంగా ఆలోచించిన తరువాత... వైద్య విద్యవైపే మొగ్గు చూపాను. 1996లో ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక, శిశు వైద్యంలో డిప్లమా చేశాను. పేదలకు, వైకల్యాలు ఉన్నవారికి ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకే విద్య, ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలు తదితర అంశాల్లో ఆ సంస్థ సేవలు అందించే ‘వరల్డ్‌ విజన్‌ అనే స్వచ్ఛంద సంస్థలో చేరాను. కొన్నేళ్ళ తరువాత... హెచ్‌ఐవి చికిత్సలోనూ నైపుణ్యం సంపాదించాను. ప్రభుత్వం చేపట్టిన ఎయిడ్స్‌ నిరోధక కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యాను. మరోవైపు ‘భారత వైద్య పరిశోధన మండలి’ (ఐసిఎంఆర్‌)లో పరిశోధకురాలుగా పని చేశాను. కానీ వాటన్నిటినీ వదిలేయాల్సిన పరిస్థితి ఎదురయింది.


11-navya.jpg

కన్నీళ్ళు ఆగలేదు...

ఒక రోజు ఇంట్లో జారి పడిపోవడంతో నా తుంటి ఎముక విరిగిపోయింది. శస్త్రచికిత్స చేయించుకున్నాక... కొన్నాళ్ళపాటు కదలకుండా మంచం మీదే ఉండాల్సి వచ్చింది. దాంతో నా ఉద్యోగాన్ని, ఇతర కార్యకలాపాల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాను. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు... వైకల్యాలున్న మహిళలు ఎందరో కనిపించేవారు. వారి కష్టాలు, సామాజికంగా వారు ఎదుర్కొంటున్న వివక్షలు, అవమానాలు, ఎగతాళి వ్యాఖ్యల గురించి తెలుసుకున్నాక నాకు కన్నీళ్ళు ఆగలేదు. కుటుంబ సభ్యులు పట్టించుకోని, నిలువనీడలేని మహిళల కోసం సురక్షితమైన ఒక ఆశ్రయాన్ని కల్పించాలనీ, వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి... గౌరవంతో జీవించే దారి చూపించాలనీ అనుకున్నాను. చెన్నైలోని నూగంబాక్కంలో ‘బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌’ పేరిట వైకల్యాలు ఉన్న మహిళల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాను. గతంలో ప్రభుత్వ సంస్థలతో పని చెయ్యడం వల్ల అధికారులతో నాకు ఉన్న పరిచయాలు ఉపయోగపడ్డాయి. చెన్నై కార్పొరేషన్‌, తమిళనాడు ప్రభుత్వం మా కేంద్రానికి నిధులు కేటాయించాయి. అయితే అవి చాలకపోవడంతో నా సొంత డబ్బు ఖర్చు పెట్టడం, నగలు తాకట్టు పెట్టడం తరచుగా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మా కేంద్రంలో దాదాపు 75 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి విద్యతోపాటు కుట్టుపని, ఆభరణాల తయారీ, ఎంబ్రాయిడరీ, పారా క్రీడలు తదితర అంశాల్లో నిపుణుల ద్వారా శిక్షణ ఇస్తున్నాం.అలాగే ఉద్యోగాల కోసం, స్వయంఉపాధి కోసం, వివాహాల కోసం అవసరమైన సాయం అందిస్తున్నాం.


అన్నీ ఉచితంగానే...

కొన్నేళ్ళుగా పారా క్రీడలకు ఆదరణ పెరగడం, వాటిలో పాల్గొనాలనే ఆసక్తి చాలామందిలో ఉండడం గమనించాను. మా కేంద్రంలో ఉంటూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే వారు అభ్యాసం చెయ్యడానికి తగిన సౌకర్యాలు సాధారణ వ్యాయామశాలల్లో ఉండవు. అంతేకాదు, దానికి అయ్యే ఖర్చు ఎక్కువ. సామాజికమైన ఇబ్బందులూ ఉంటూనే ఉంటాయి. ఈ విషయంపై రాష్ట్ర క్రీడామంత్రికి ఒక లేఖ రాశాను. దానికి సానుకూలమైన స్పందన లభించడంతో... ఈ ఏడాది మార్చిలో... ప్రభుత్వ సాయంతో ఒక జిమ్‌ను ఏర్పాటు చేశాను. దీనికోసం మా ‘బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌’ను కొత్త భవనంలోకి మార్చాం. అత్యాధునికమైన, వైకల్యాలు ఉన్నవారికి అనువైన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. పలువురు మా కేంద్రంలోనే ఆశ్రయం పొందుతూ సాధన చేస్తున్నారు. వారికి అన్నీ ఉచితంగానే సమకూరుస్తున్నాం. ఈ పారా-అథ్లెట్లలో 38 ఏళ్ళ నదియా ఒకరు. ఆమె ఇప్పటికే దాదాపు నలభై వరకూ జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు. అలాగే 41 ఏళ్ళ ఏళ్ళ మేరీ, 38 ఏళ్ళ బెనీతా, 50 ఏళ్ళ మెటిల్డా... వీరందరూ వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్లు. జిమ్‌కు వచ్చే యువతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మా కేంద్రానికి సమీపంలో ఉన్నవారు తమ ఇళ్ళ నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఇప్పటివరకూ కొన్ని వందలమంది మహిళలకు మా కేంద్రం అండగా నిలిచింది. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ వైకల్యమూ ఆపలేదు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదిరించి... జీవితంలో నిలదొక్కుకోవాలనుకొనేవారికి చేయూతనివ్వడం నాకు సంతోషాన్నీ, సంతృప్తినీ కలిగిస్తోంది. ‘మెరుగైన ప్రపంచానికి దోహదం చేసే ఆశ్రయం’గా మా కేంద్రం గుర్తుండిపోవాలన్నదే నా ఆశయం.’’

ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 05:41 AM