Share News

Kushboo Jain Student Empowerment: ఒకటే లక్ష్యం మార్పు కోసం

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:35 AM

ఒకప్పుడు భయంతో తరగతి గది దాటని అమ్మాయి... ఇప్పుడు వేదికలెక్కి ప్రసంగిస్తోంది. అంతర్జాలాన్నే అభ్యాస కేంద్రంగా మలుచుకొని... ఆ విజ్ఞానాన్ని తోటి విద్యార్థులకు పంచుతోంది. కేవలం పాఠ్యాంశాలకే...

Kushboo Jain Student Empowerment: ఒకటే లక్ష్యం మార్పు కోసం

ఒకప్పుడు భయంతో తరగతి గది దాటని అమ్మాయి... ఇప్పుడు వేదికలెక్కి ప్రసంగిస్తోంది. అంతర్జాలాన్నే అభ్యాస కేంద్రంగా మలుచుకొని... ఆ విజ్ఞానాన్ని తోటి విద్యార్థులకు పంచుతోంది. కేవలం పాఠ్యాంశాలకే పరిమితమైపోకుండా... అధునాతన సాంకేతికతపై అవగాహన కల్పిస్తోంది. సమష్టి స్ఫూర్తి నింపి... సృజనకు పదును పెట్టి... ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ‘లీడ్‌’ కార్యక్రమాల స్ఫూర్తితో అందుకోసం ‘ఏక్‌ లక్ష్యా’ పేరున సొంతంగా ఒక వేదిక సైతం రూపొందించిన పదో తరగతి విద్యార్థిని కుష్బూ జైన్‌... ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘‘రోజూ బడికి వెళతాం. పాఠాలు వింటాం. మంచి మార్కులూ తెచ్చుకొంటాం. కానీ అంతటితో ఆగిపోతే జెట్‌ వేగంతో దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో వెనకబడిపోతాం. సృజనాత్మకంగా ఆలోచించాలి. ఎవరికివారుగా కాకుండా జట్టుగా కలిసి పని చేయడం అలవర్చుకోవాలి. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలి. ఎందుకంటే బాల్యంలో బలమైన పునాది పడితేనే భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయగలుగుతాం. అనుకున్నది సాధించగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే ‘ఏక్‌ లక్ష్యా’ అనే లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చాను. ఇది ఒక వెబ్‌సైట్‌. దీనిద్వారా విద్యార్థుల్లో ఉన్న భయాన్ని, బెరుకును పోగొట్టి, ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ ఆలోచన రావడానికి కారణం... మా పాఠశాలలో ‘లీడ్‌ స్కూల్‌’ నిర్వహించిన కార్యక్రమాలు. ప్రస్తుతం నేను కడప ‘నాగార్జున మోడల్‌ స్కూల్‌’లో పదో తరగతి చదువుతున్నా. మాది రాజస్థాన్‌ అయినా నలభై ఏళ్ల కిందట మా తాతగారు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మా నాన్నకు కడపలో ఎలక్ట్రికల్‌ షాపు ఉంది. అమ్మ గృహిణి. తనే నాకు మార్గదర్శి. స్ఫూర్తి.


మూస పద్ధతి నుంచి...

మొదట్లో నేను కూడా చాలా బిడియస్తురాలిని. తరగతి గదిలో సందేహాలు అడగాలన్నా, నలుగురిలో మాట్లాడాలన్నా, వేదికపైకి వెళ్లాలన్నా భయపడేదాన్ని. అయితే కరోనా తరువాత నా జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. నేను ఆరో తరగతిలో ఉండగా మా పాఠశాలకు ‘లీడ్‌ స్కూల్‌’వారు వచ్చారు. వేదికపైకి పిలిచి నచ్చిన అంశంపై అందరి ముందూ మాట్లాడించారు. బృంద చర్చలు పెట్టారు. కలిసికట్టుగా ప్రాజెక్టులు చేయడం నేర్పించారు. మాలో ఆలోచనాశక్తి పెంచేలా ప్రయోగాలు చేయించారు. అప్పటివరకు మేం బోర్డు మీద చూసి నేర్చుకొనేవాళ్లం. కానీ ‘లీడ్‌’ తరువాత మా స్కూల్లో మూస పద్ధతి పోయింది. తొలిసారి విజువల్‌ లెర్నింగ్‌ ప్రారంభమైంది. నాలో బెరుకు పోయింది. నిర్భయంగా ఎక్కడైనా, ఎంత పెద్ద వేదిక మీద నుంచైనా మాట్లాడటం అలవాటైంది. పాఠాలే కాకుండా చుట్టూవున్న వాటి గురించి కూడా ఆలోచించడం మొదలైంది.

55-navya.jpg

వారిని చూసి...

నేనే కాదు... నా స్నేహితులు చాలామందిలో కూడా ఇలాంటి మార్పే గమనించాను. అదేసమయంలో నాకు నీతి ఆయోగ్‌ ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌’ నిర్వహించే ‘టింకర్‌ప్రెన్యూర్‌’ గురించి తెలిసింది. ఇది విద్యార్థులకు ఇరవై ఒకటో శతాబ్దపు డిజిటల్‌ స్కిల్స్‌ నేర్పించి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహించే జాతీయ స్థాయి కార్యక్రమం. అందులో భాగంగా మనం ఒక ప్రాజెక్ట్‌ రూపొందించాలి. ఆ ప్రాజెక్ట్‌ వినూత్నంగా ఉండాలి. సమాజంపై సానుకూల ప్రభావం చూపాలి. నాకు ఎంతో ఆసక్తిగా అనిపించి, రిజిస్టర్‌ చేసుకున్నా. అప్పటివరకు మొబైల్‌ ఆపరేటింగ్‌ కూడా సరిగ్గా తెలియని నేను... ఇంటర్నెట్‌లో శోధించడం మొదలుపెట్టాను. ఏఐ, చాట్‌ జీపీటీల సాయంతో డిజిటల్‌ స్కిల్స్‌ నేర్చుకున్నా. అలాగని చదువును అశ్రద్ధ చేయలేదు. ఎప్పుడూ నేను టాప్‌లోనే ఉంటాను.

తొలి ప్రయత్నం విఫలమైనా...

‘టింకర్‌ప్రెన్యూర్‌’ కార్యక్రమంలో పాల్గొన్న వారు రూపొందించిన ప్రాజెక్టుల నుంచి జాతీయ స్థాయిలో టాప్‌ 100 ఎంపిక చేస్తారు. దానికోసం 2022లో ‘డిస్క్యూ’ అనే ప్రొడక్ట్‌ ఒకటి తయారు చేశాను.

కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో వేరేవారికి వైరస్‌ సోకకుండా ఎలా చూసుకోవాలి? అందుబాటులో ఉన్న ఇంటి చిట్కాలు ఏమిటి? తదితర సమాచారంతో దాన్ని రూపొందించాను. అయితే నా ప్రాజెక్ట్‌కు టాప్‌100లో చోటు దక్కలేదు. నిరాశచెందలేదు. ఎంపికైనవాటిని పరిశీలించి, ఇంకా ఏఏ అంశాల్లో మెరుగు అవ్వాలో తెలుసుకున్నా.


అనుకున్నది నెరవేరింది...

తొలి ప్రయత్నం విఫలవడంతో మరింత పట్టుదలతో మరుసటి ఏడాది ‘టింకర్‌ప్రెన్యూర్‌’కు సన్నద్ధమయ్యా. కిరణ్‌కుమార్‌ సర్‌ మార్గదర్శకత్వంలో ‘ఏక్‌ లక్ష్యా’ పేరుతో ఒక ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ రూపొందించాను. ఆ పేరు మా అమ్మ పెట్టింది. ‘ఏక లక్ష్యా’ అంటే హిందీలో ‘ఒకటే లక్ష్యం’ అని. ఇది ఒక ఆన్‌లైన్‌ స్టోర్‌. మొదట పది ఇ-బుక్స్‌ పెట్టాను. తోటి విద్యార్థుల్లో ఆధునిక సాంకేతికత నైపుణ్యాన్ని పెంచడం, కొత్తగా ఆలోచించి, కలిసికట్టుగా పని చేసేలా ప్రోత్సహించడం, తద్వారా సమాజంలో మార్పు తేవడం ఈ వేదిక లక్ష్యం. ఈసారి ‘టింకర్‌ప్రెన్యూర్‌’ జాతీయ స్థాయి టాప్‌100లో నా ప్రొడక్ట్‌ చోటు దక్కించుకుంది. టాప్‌7గా నిలిచింది. ఇది నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆత్మస్థైర్యాన్ని పెంచింది. ఈ స్ఫూర్తితో ‘ఏక్‌ లక్ష్యా’ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని అనుకున్నాను. ఇంకా ఏమేం ఉంటే బాగుంటుందనే దానిపై స్నేహితులు, మెంటార్స్‌తో చర్చిస్తున్నాను. పదో తరగతి పరీక్షలు అవ్వగానే ఆ పనిలోనే ఉంటాను.’’

హనుమా

ఇంకా ఎన్నో...

ఒకప్పుడు భయంతో వెనకడుగు వేసిన నేను ఇప్పుడు బడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో ముందుంటున్నాను. మా స్కూల్‌ వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ చేస్తున్నా. మంత్లీ న్యూస్‌లెటర్స్‌ సిద్ధం చేస్తున్నా. నేను రాసిన కొన్ని పుస్తకాలు ‘అటల్‌ ఇన్నోవేషన్‌’లో భాగంగా ‘టింకర్‌చాంప్స్‌’ కార్యక్రమం ద్వారా తోటి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నా. ‘సీఎ్‌సఐఆర్‌-ఎన్‌ఏఎల్‌’ బెంగళూరులో నిర్వహించిన ఏరోఫె్‌స్టలో మా టీమ్‌ రూపొందించిన ప్రాజెక్ట్‌కు మొదటి బహుమతి వచ్చింది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఫెస్ట్‌లో మేం ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌పై పేపర్స్‌ సమర్పించాం. అలాగే 2023లో ‘లీడ్‌ గ్రూప్‌’ నిర్వహించిన ‘యంగ్‌ లీడర్స్‌ ప్రోగ్రామ్‌’లో సోషల్‌మీడియా ట్రెండ్స్‌పై అధ్యయనం చేసే అవకాశం లభించింది. నా లక్ష్యం ఒక్కటే... పారిశ్రామికవేత్తగా ఎదగాలని. అప్పుడైతేనే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతాం.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 24 , 2025 | 05:35 AM