Share News

How to Claim Unclaimed Insurance Amounts: అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:14 AM

బీమా పాలసీ తీసుకోవడం ఒక ఎత్తు. అవసరమైనప్పుడు దాన్ని క్లెయిమ్‌ చేసుకోవడం మరో ఎత్తు. పాలసీ గడువు ముగిసినా పాలసీదారులు మర్చిపోవడం లేదా వారి వారసులు లేదా నామినీలకు తమ వారి పేరున ఒక బీమా...

How to Claim Unclaimed Insurance Amounts: అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

బీమా పాలసీ తీసుకోవడం ఒక ఎత్తు. అవసరమైనప్పుడు దాన్ని క్లెయిమ్‌ చేసుకోవడం మరో ఎత్తు. పాలసీ గడువు ముగిసినా పాలసీదారులు మర్చిపోవడం లేదా వారి వారసులు లేదా నామినీలకు తమ వారి పేరున ఒక బీమా పాలసీ ఉందనే విషయమే తెలియక పోవడం ఇందుకు ప్రధాన కారణాలు. అయినా కొద్దిపాటి ప్రయత్నంతో పాలసీదారులు లేదా వారి వారసులు, నామినీలు క్లెయిమ్‌ చేయని ఈ మొత్తాలను క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

మన దేశంలో బీమా రక్షణ ఉండేది కొద్ది మందికి మాత్రమే. వారిలోనూ చాలా మందికి ముఖ్యంగా పాలసీదారులకు లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు పాలసీ మొత్తాన్ని ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో తెలియదు. దీంతో ప్రస్తుతం దేశంలోని వివిధ బీమా కంపెనీల వద్ద క్లెయిమ్‌ చేయని మొత్తాలు రూ.65,000 కోట్లకు చేరాయి. పాలసీదారులు లేదా వారి నామినీలు కొద్దిపాటి ప్రయత్నంతో ఈ మొత్తాలను క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

అన్‌క్లెయిమ్డ్‌ మొత్తం అంటే?

ఏదైనా ఒక పాలసీ గడువు ముగిసి 12 నెలలైనా, ఆ పాలసీ మొత్తాన్ని పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకోకపోతే దాన్ని అన్‌క్లెయిమ్డ్‌ మొత్తం అంటారు. పాలసీదారుడి మరణం, హెల్త్‌ బెనిఫిట్‌ క్లెయిమ్‌, మెచ్యూరిటీ క్లెయిమ్‌, సర్వైవల్‌ బెనిఫిట్‌, పాలసీ సరెండర్‌/ఫోర్‌క్లోజర్‌, అధికంగా చెల్లించిన ప్రీమియాన్ని రిఫండ్‌ చేయకపోవడం, డిపాజిట్‌ చేసిన ప్రీమియం సరిగా సర్దుబాటు కాకపోవడం వంటి రూపాల్లో ఈ అన్‌క్లెయిమ్డ్‌ మొత్తాలు బీమా కంపెనీల వద్దే ఉండి పోతాయి.

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) నిర్వచనం ప్రకారం సాధారణ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఏకీకృత ఆరోగ్య బీమా కంపెనీలకు పాలసీల ప్రీమియం కింద ముందుగా చెల్లించే ప్రీమియం, డిపాజిట్లు.. పాలసీ కాలపరిమితిలో కేటాయింపులు జరపని ప్రీమియం.. క్లెయిమ్‌ చేయని మొత్తాల పరిధిలోకి రావు. అయితే ఈ మొత్తాల్ని పాలసీ కాలపరిమితిలోగా ప్రీమియం కింద సర్దుబాటు చేయక పోయినా ఆ మొత్తాన్ని రిఫండ్‌ చేయకపోయినా అది క్లెయిమ్‌ చేయని మొత్తమే అవుతుంది.


10 ఏళ్ల గడువు

దాటితే?

ఏదైనా ఒక బీమా పాలసీ గడువు ముగిసి పదేళ్లయినా ఎవరూ క్లెయిమ్‌ చేయకపోతే.. బీమా కంపెనీ ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు బదిలీ చేస్తుంది.

ఇబ్బందులెదురైతే..

క్లెయుమ్‌ చేయని బీమా పాలసీ మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే ముందుగా సంబంధిత బీమా కంపెనీ గ్రీవెన్సెస్‌ రిడ్రెసల్‌ అధికారి (జీఆర్‌ఓ)ని సంప్రదించాలి. ఆయా బీమా కంపెనీల వెబ్‌సైట్లు లేదా ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్‌ లేదా బీమాభరోసా వెబ్‌సైట్ల ద్వారా వీరి వివరాలు తెలుసుకోవచ్చు. వీటికి తోడు ఐఆర్‌డీఏఐ కాల్‌సెంటర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు 155255/1800 4254 732 ద్వారానూ తెలుసుకోవచ్చు.

చెక్‌ చేయడం ఎలా?

ఆయా బీమా కంపెనీల వెబ్‌సైట్లు లేదా ఐఆర్‌డీఏఐ నిర్వహణలోని బీమాభరోసా పోర్టల్‌ ద్వారా ఈ క్లెయిమ్‌ చేయని పాలసీల వివరాలను పాలసీదారులు, వారి నామినీలు లేదా వారి చట్టబద్ద వారసులు తేలిగ్గా కనుక్కోవచ్చు. ఇందుకు ఆయా వెబ్‌సైట్లను ఓపెన్‌ చేసి పుట్టిన తేదీ, పాన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, పాలసీ నంబర్‌, పాలసీదారుడి పేరు వంటి వివరాలు సమర్పిస్తే క్లెయిమ్‌ చేయని పాలసీల వివరాలు తెలిసిపోతాయి. అప్పుడు కేవైసీ వివరాలు పూర్తి చేసి మీ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇస్తే క్లెయిమ్‌ చేయని మొత్తం ఆయా వ్యక్తుల ఖాతాల్లో వడ్డీతో సహా జమవుతాయి.


అవసరమయ్యే పత్రాలు

  • పాలసీ వివరాలు/పత్రాలు

  • బ్యాంకు ఖాతా వివరాలు

  • క్లెయుమ్‌ చేసే వారి ఫొటో

  • ఖాతాదారుడి పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌ ఉన్న క్యాన్సిల్‌ చేసిన చెక్‌ లేదా బ్యాంకు పాస్‌బుక్‌/స్టేట్‌మెంట్‌ జిరాక్స్‌ కాపీతో కూడిన క్యాన్సిల్‌ చేసిన చెక్‌

  • గుర్తింపు నిర్దారణ కోసం కేవైసీ వివరాలు

  • చనిపోయిన వ్యక్తుల పాలసీ కోసమైతే అతడితో ఉన్న బంధుత్వాన్ని రుజువు చేసే పత్రాలు, క్లెయిమ్‌ చేసే వ్యక్తికి సంబంధించిన చిరునామా ధ్రువీకరణ పత్రాలు

  • నిర్ణీత పద్దతిలో పూర్తి చేసిన క్లెయిమ్‌ ఫారం

  • చట్టబద్ద వారసులైతే వారసత్వ సర్టిఫికెట్‌

  • పాలసీదారుడు చనిపోయి ఉంటే. అతని డెత్‌ సర్టిఫికెట్‌

  • హాస్పిటల్‌ రికార్డులు

  • పోలీసు రిపోర్టులు/ఫిర్యాదు పత్రాలు

  • ఎఫ్‌ఐఆర్‌ రిపోర్టులు

ఈ పత్రాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత బీమా కంపెనీలు క్లెయుమ్‌ చేయని మొత్తాలను ఆయా పాలసీదారులు లేదా వారి నామినీలు లేదా వారసులకు బ్యాంకు ఖాతా ద్వారా జమ చేస్తాయి. చనిపోయిన వ్యక్తుల క్లెయిమ్‌ చేయని మొత్తాలు జమ చేసేందుకు మాత్రం కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది.

ఇండెమ్నిటీ బాండ్‌

ఒకవేళ ఒరిజినల్‌ పాలసీ సర్టిఫికెట్‌ పోతే, బీమా కంపెనీ క్లెయిమ్‌ చేసే వారి నుంచి ఇండెమ్నిటీ బాండ్‌ కోరవచ్చు. అయితే ఇది ఆయా బీమా కంపెనీల అంతర్గత విధానాలపై ఆధారపడి ఉంటుంది.

ఎన్‌ఆర్‌ఐల కోసం కూడా

సాధారణ పౌరుల్లా ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) కూడా బీమాభరోసా, ఆయా బీమా కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా మర్చిపోయిన తమ పాలసీల మొత్తాలను, లేదా చనిపోయిన తమ వారి పాలసీ మొత్తాలను వెతికి పట్టుకుని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఇందుకు ఈ కింది వివరాలు పూర్తి చేయాలి.

  • కేవైసీ కోసం సెల్ఫ్‌ అటెస్టేషన్‌తో తమ పాస్‌పోర్టు, వీసా, విదేశాల్లోని చిరునామాను నిర్ధారించే పత్రాలు

  • విదేశాల్లోని తమ బ్యాంకు ఖాతా వివరాలు లేదా స్వదేశానికి డబ్బులు పంపేందుకు వినియోగించే ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల వివరాలు.

ఎన్‌ఆర్‌ఐలు ఈ పత్రాలను విదేశాల నుంచే డిజిటల్‌ రూపంలో బీమా కంపెనీలకు సమర్పించవచ్చు.


ముందు జాగ్రత్తలు

  • పాలసీ తీసుకున్నప్పటి నుంచే పాలసీదారుడు తమ చిరునామా, అవసరమైతే సంపద్రించడానికి అవసరమైన ఫోన్‌ నంబర్లు, నామినీల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌ టు డేట్‌గా బీమా కంపెనీకి తెలియజేయాలి

  • పాలసీలను వారి వారి ఆధార్‌, పాన్‌ నంబర్‌తో అనుసంధానం చేయాలి. దీనివల్ల అవసరమైనప్పుడు మీ పాలసీని గుర్తించడం బీమా కంపెనీకి తేలికవుతుంది

  • పాలసీల పునరుద్ధరణ, క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ సందేశాల కోసం బీమా కంపెనీలకు తమ ఈ-మెయిల్‌ అడ్రస్‌, ఎస్‌ఎంఎస్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్లు ఇస్తే మరీ మంచిది.

  • అన్ని బీమా పాలసీల వివరాలను డిజిటల్‌ రూపంలో డిజిలాకర్‌ లేదా ఈ-ఇన్సూరెన్స్‌ ఖాతాలో లేదా డాక్యుమెంట్స్‌ రూపంలో ఒక ఫ్యామిలీ ఫైల్‌గా భద్ర పరుచుకుంటే పాలసీల క్లెయిమ్‌ మరింత సులవవుతుంది.

ఇవి కూడా చదవండి

ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Nov 23 , 2025 | 06:15 AM