Share News

Biram Janakidevi: పల్లె వెలుగు

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:20 AM

అందుబాటులో ఉన్న వనరులన్నిటినీ సద్వినియోగం చేసుకున్నారు. అన్ని పనుల్లో స్వయంగా శ్రమిస్తూ, గ్రామాన్ని ప్రగతి పథంలో నిలిపారు. తన కృషికి గుర్తింపుగా ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ నుంచి పురస్కారం అందుకున్న గుంటూరు జిల్లా గొడవర్రు గ్రామ సర్పంచ్‌ బీరం జానకీదేవితో ‘నవ్య’ సంభాషణ.

Biram Janakidevi: పల్లె వెలుగు

అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు. ఒత్తిడులను, వేధింపులను తట్టుకొని నిలబడ్డారు. నిధులకోసం కోర్టు మెట్లు సైతం ఎక్కారు.అందుబాటులో ఉన్న వనరులన్నిటినీ సద్వినియోగం చేసుకున్నారు. అన్ని పనుల్లో స్వయంగా శ్రమిస్తూ, గ్రామాన్ని ప్రగతి పథంలో నిలిపారు. తన కృషికి గుర్తింపుగా ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ నుంచి పురస్కారం అందుకున్న గుంటూరు జిల్లా గొడవర్రు గ్రామ సర్పంచ్‌ బీరం జానకీదేవితో ‘నవ్య’ సంభాషణ.

‘‘సర్పంచ్‌గా గెలవగానే అభినందనలతోపాటు అవహేళనలు కూడా నాకు తీవ్రంగానే ఎదురయ్యాయి. ‘‘చదివింది ఇంటర్‌. పరిపాలన ఏం చెయ్యగలవు?’’ అని కొందరు, ‘‘మహిళవు. ఊరికోసం చొరవ తీసుకొని కష్టపడలేవు’’ అని ఇంకొందరు... ఇలా ఎంతోమంది నిరుత్సాహపరిచారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే... ‘‘ప్రతి వివరం మీతో చెప్పలేం కదా! అయినా కార్యాలయాల చుట్టూ మీరెక్కడ తిరుగుతారు? ఎవరినైనా పంపవచ్చు కదా’’ అనే సలహాలు వినిపించేవి. ఈ మాటలన్నీ నాలో పట్టుదల పెంచాయి. సాధారణంగా మహిళలు పదవుల్లో ఉంటే... పెత్తనం, పాలన పురుషులు చేస్తూ ఉంటారు. ఈ సంస్కృతికి నేను వ్యతిరేకం. ఇల్లు చక్కదిద్దగలిగే మహిళలకు ఊరు బాగు చేయడం కూడా తెలుసని నిరూపించాలని నిశ్చయించుకున్నాను.

కత్తిమీద సాము...

మాది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని గొడవర్రు గ్రామం. మా నాన్న ఇక్కుర్తి శివనాగేశ్వరరావు, తల్లి ఉమామహేశ్వరి. వ్యవసాయమే జీవనాధారమైన మధ్యతరగతి కుటుంబం. నన్ను ఇంటర్‌ వరకూ చదివించాక... పెళ్లి చేశారు. నా భర్త వెంకటేశ్వరరావు కూడా రైతే. మాకున్న ఎకరా పొలంతోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకున్నాం. ఇంటి పనులు, పొలం పనులతో కాలం గడిచేది. కాగా... మా మామగారు 1995లో... గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి మా కుటుంబం రాజకీయాలకూ దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ మా కుటుంబంలో ఎవరో ఒకరు సర్పంచ్‌ కావాలనేది ఆయన బలమైన కోరిక. కిందటి ఎన్నికలలో ఆ అవకాశం నాకు అనూహ్యంగా, నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మొదట వద్దనుకున్నాను. కానీ కుటుంబం, సన్నిహితులు ప్రోత్సహించడంతో పోటీ చేశాను. ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలవారు ఓటు వేసి గెలిపించారు. పదవి అంటే అలంకారప్రాయం కాదనీ, ఎన్నో రాజకీయాలను, కుట్రలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, జనం మెప్పు పొందడం కత్తిమీద సాము అని తక్కువ కాలంలోనే తెలుసుకున్నాను.

jhl,.jpg


కూలీగా వెళ్లాను...

మాది మూడువేల మంది జనాభా ఉన్న గ్రామం. అయితే ఏ పని చెయ్యాలన్నా గత ప్రభుత్వ కాలంలో నిధులు లేని పరిస్థితి. దీంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పఽథకం, స్వచ్ఛ భారత్‌ సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. అయితే వాటిని కూడా సరిగ్గా అందనివ్వలేదు. దానికోసం పోరాడాను. అధికారులను నిలదీశాను. చివరకు ఒక దశలో... పంచాయతీలకు దామాషా ప్రకారం అందాల్సిన నిధుల కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. న్యాయపరంగా పోరాడి నిధులు సాధించుకోగలిగాం. మరోవైపు గ్రామాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాను. గ్రామానికి వస్తున్న నీరు ఆకుపచ్చగా, దుర్గంఽధభరితంగా ఉండడంతో... వాటిని తాగినవారు రోగాల బారిన పడేవారు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. సురక్షిత జలాల సరఫరా కోసం జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు రూ .4.8 లక్షలతో 980 మీటర్ల పొడవున కొత్త పైప్‌లైన్లు, కొత్త కొళాయిలు వేయించాం. చెరువులో నీటిని శుద్ధి చేసి పంపడానికి కావలసిన ఫిల్టర్‌ బెడ్స్‌ దెబ్బతిన్నాయి. వాటిని బాగుచేయించడానికి నిధులు అడిగితే పట్టించుకున్నవారు లేరు. ఆఖరుకు దాతల సహకారంతో తాత్కాలిక మరమ్మతులు చేయించి, సురక్షిత నీటిని అందించగలిగాం.

జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి సాధించిన సర్పంచ్‌లుగా... ఆంధ్రప్రదేశ్‌ నుంచి అయిదుగురు ఎంపికైతే... వారిలో నేనూ ఉన్నాను. ఇక, ఉపాధిహామీ నిధులతో చెరువును బాగుచేయాలనుకున్నప్పుడు మరో సమస్య ఎదురయింది. కూలీల హాజర్లు పడుతున్నాయి, పనులు మాత్రం జరగడం లేదు. అలా వదిలేస్తే లాభం లేదని... నేను కూడా ఒక కూలీగా వెళ్లి, వారితో కలిసి పని చేశాను. పూడిక తీత, చెరువు కట్టలను పటిష్టం చేయడం లాంటి పనులల్ని వారి వెంటే ఉండి చేయించాను. ఈ పథకంతో ఒక క్లినిక్‌ కూడా నిర్మించుకోగలిగాం. ఉపాధి హామీ నిఽధులతో సాధించిన అభివృద్ధిలో... రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచాం. గ్రామంలో... రూ. 50 లక్షలతో మొత్తం సిమెంట్‌ రోడ్లను దాదాపు పూర్తి చేశాం. కాలువల అంచులపై గడ్డి మొలవకుండా... నేనూ వెళ్లి మందులను పిచికారీ చేస్తాను. అవసరమైతే నీరు కూడా మోసుకొస్తాను. ఏదీ నామోషీగా భావించను.


ఎన్నారైల చొరవతో...

మా గ్రామం చిన్నది కావటంతో జనాభా ప్రాతిపదికన వచ్చే నిధులు చాలక దాతల సహకారం తప్పనిసరి అయింది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన మా గ్రామస్తులు, ముఖ్యంగా ఎన్నారైలు ఎప్పుడు ఊరికి వచ్చినా... గ్రామాభివృద్ధి కోసం సాయం చేయమని నిర్మొహమాటంగా అడుగుతాను. ఇటీవలే ఎన్నారై మద్దినేని శ్రీనివాస్‌ గ్రామంలో తాగునీటి ఇబ్బందులు గుర్తించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ. 10 లక్షలు సాయం చేయటానికి ముందుకు వచ్చారు. నా సోదరుడు, మరికొందరు కలసి గ్రామంలో ఎల్‌.ఇ.డి లైట్లన్లు రూ. 3 లక్షలతో వేయించారు. మైకులు పెట్టించి వాటిద్వారా జనానికి సమాచారం ఇవ్వటం, ప్రభుత్వ పఽథకాలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు తెలియచెయ్యటం లాంటివి చేస్తున్నాం. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుగారిని, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌గారిని కలిశాం. గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కోరాం. వారినుంచి సానుకూల స్పందనే వచ్చింది. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ గణతంత్ర దినోత్సవం రోజున... దేశంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు పురస్కారాలు అందించింది. స్వచ్ఛ భారత్‌, జాతీయ ఉపాధి హామీ పథకం, జల్‌జీవన్‌ మిషన్‌ లాంటి వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని ఉన్నత స్థానంలో నిలిపినందుకు వీటిని ఇచ్చారు. మిగిలిన సర్పంచ్‌లంతా స్వచ్ఛ పురస్కారాలను అందుకుంటే, నాకు అదనంగా కేంద్ర జలవనరుల శాఖ నుంచి కూడా పురస్కారం దక్కింది. ఈ గౌరవం గ్రామాభివృద్ధికి సహకరించినవారందరికీ చెందుతుంది.’’

తిరుమలశెట్టి శేషగిరిరావు, తెనాలి

ఫొటోలు: ధూళిపాళ్ల శ్రీధర్‌

రాజకీయంగా దెబ్బతియ్యాలని చూశారు..

గత ప్రభుత్వ కాలంలో... రెండున్నరేళ్ల క్రితం ఒక్క రూపాయైునా పంచాయతీ దగ్గర లేకపోవడంతో... మాకు రావలసిన నిధుల కోసం పోరాడాను. అప్పుడు కొందరు కక్షగట్ట్టి, రాజకీయంగా దెబ్బతియ్యాలని చూశారు. నా చెక్‌ పవర్‌ రద్దు చేయించటానికి ప్రయత్నించారు. సర్పంచ్‌గా గెలిచినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుగారిని కలిశాం. సర్పంచ్‌లందరం టీడీపీ కండువాలు వేసుకుని వెళితే... ఆయన కండువాలు తీయించేశారు. ‘‘మీరు సర్పంచ్‌లు. ఊరికోసం పాటుపడండి. రాజకీయాలు పక్కనపెట్టండి’’ అన్నారు. ఆ స్పూర్తితో... నన్ను శత్రువుగా భావించినవారినికూడా సొంతవారిగా మార్చుకోగలిగాను. ‘వైఎ్‌సఆర్‌ ఆసరా’ అందాల్సిన అర్హులను తొలగించినప్పుడు, సచివాలయాన్ని ఆలయ భూముల్లో ఊరికి దూరంగా నిర్మించేందుకు ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించాను. తమకు అనుకూలంగా తీర్మానం చెయ్యాలని అనేక విధాలుగా ఒత్తిడి తెచ్చారు. బెదిరించారు. భయపడలేదు. కోర్టుకు వెళ్లి ‘ఆసరా’ను మంజూరు చేయించగలిగాను. ఇవన్నీ చూశాక నాపై గ్రామస్తులకు చాలా నమ్మకం కలిగింది. ఒకానొక సమయంలో ఊరికోసం వ్యతిరేకంగా పనిచేసేవారిని ఒప్పించడం కోసం... వారి కాళ్లు పట్టుకోటానికి కూడా వెనకాడలేదు. ’


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:20 AM