ఇది ఒక జీవితానుభవం
ABN , Publish Date - May 15 , 2025 | 05:50 AM
‘ప్రపంచ సుందరి పోటీలంటే అందమే కాదు... సామాజిక కోణం కూడా ఉంటుంది’ అంటున్న ప్రిన్సెస్ ఇస్సీ... గడచిన ఐదేళ్లుగా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు...
మిస్ వరల్డ్
‘ప్రపంచ సుందరి పోటీలంటే అందమే కాదు... సామాజిక కోణం కూడా ఉంటుంది’ అంటున్న ప్రిన్సెస్ ఇస్సీ... గడచిన ఐదేళ్లుగా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘మిస్ వరల్డ్’ మెగా ఈవెంట్‌లో కామెరూన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె... ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘‘మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్ మాది. ‘మిస్ వరల్డ్’ పోటీలు నాకు ఒక జీవిత అనుభవం. కేవలం కిరీటం దక్కించుకొనే ఉద్దేశంతోనే ఇక్కడకు రాలేదు. అందంతో పాటు ప్రతిభను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కని వేదిక. అంతేకాదు... ఇందులో సామాజిక కోణం ఉంటుంది. ప్రస్తుత పోటీల ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ చాలెంజ్‌లో భాగంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, అవసరంలో ఉన్నవారికి, చిన్నారుల విద్యకు సాయం అందించడం లాంటి అంశాలు ఉంటాయి. అంటే పోటీలో పాల్గొనే యువతుల్లోని సామాజిక కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇది. ఐదేళ్లుగా నేను ఇదే మార్గంలో పయనిస్తున్నా. రొమ్మ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. దీనికి ప్రధాన కారణం... ఈ మహమ్మారి నా ప్రాణ స్నేహితురాలిని బలిగొంది. అప్పటినుంచి ఏ స్త్రీ కూడా దీని బారిన పడకూడదనే సంకల్పంతో పని చేస్తున్నాను. ఈ వేదిక ద్వారా నా గళాన్ని ప్రపంచానికి వినిపించే అవకాశం లభించింది. అంతేకాదు... మహిళలకు ఆర్థికంగా సహాయం చేయడానికి కృషి చేస్తున్నాను. వారిలో మానసిక ఆందోళనలు, ఒత్తిడులను దూరం చేసేందుకు నా వంతు ప్రయత్నం సాగిస్తున్నాను. గత ఏడాది వంద మందికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధిత మహిళల పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించాను. నా సామాజిక సేవ ప్రయాణంలో మరింత అవగాహన పెంచుకోవడానికి ‘మిస్ వరల్డ్’ దోహదపడుతుంది.
మహిళకకు చదువే అందం...
ఈ వేదికను నేను శారీరక సౌందర్యం ప్రదర్శించడానికే కాదు... మహిళా సాధికారతకు లభించిన ఒక చక్కని అవకాశంగా కూడా భావిస్తున్నాను. మహిళా సాధికారత అంటే పురుషులను విమర్శించడం కాదని స్త్రీలు అర్థం చేసుకోవాలి. ప్రతిభాపాటవాలను ప్రదర్శించడం ద్వారా మహిళలు సాధికారత సాధించాలి. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించగల శక్తిసామర్థ్యాలు తమలో ఉన్నాయని గుర్తించాలి. సమాజంలో మనల్ని మనం ఉన్నతంగా నిలుపుకోవాలి. అది జరగాలంటే ప్రతి అమ్మాయీ విద్యావంతురాలు అవ్వాలి. చదువుకున్న మహిళ మరింత అందంగా ఉంటుందనేది నా నమ్మకం. అందుకే నేను మహిళలను విద్యావంతులను చేయడానికి కృషి చేస్తున్నాను. స్త్రీకి చదువు చెప్పడమంటే... ప్రపంచ మానవాళిని విద్యావంతులను చేయడమే.
సమస్యలను అధిగమించాలంటే...
జీవితం అన్నాక ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలంటే ముఖ్యంగా కావల్సింది మనపై మనకు నమ్మకం. ఆత్మవిశ్వాసమే విజయ తీరాలకు నడిపించే సాధనం. కెరీర్ ప్రారంభంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ఎంతో కష్టంగా అనిపించింది. కానీ ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ అధిగమించాను. ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. వాటికి భయపడి వెనకడుగు వేయకూడదు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, ఇబ్బందులను దాటి అనుకున్న రంగంలో రాణించడానికి కొంత సమయం పడుతుంది.
ఇదే మొదటిసారి...
నేను భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ‘మిస్ వరల్డ్’ ఇక్కడ జరుగుతాయని తెలిసినప్పుడు ఎంతో ఆనందపడ్డాను. వచ్చేముందు కామెరూన్‌లోని భారత కాన్సులేట్‌కు వెళ్లి, భారత రాయబారితో మాట్లాడాను. నేను పోటీలకు వస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఒక క్యాన్స ర్ సెంటర్ గురించి తెలుసుకున్నాను. ఆ కేంద్రాన్ని సందర్శించాలని, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వినియోగించే రేడియో థెరపీ, కీమోథెరపీలో కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని అనుకొంటున్నాను.
మా వీధులు ఎంతో శుభ్రం...
జీవితమనే పరుగులో మనం ఎంత బిజీగా ఉన్నా... పర్యావరణం, పరిసరాల గురించి కూడా ప్రతిఒక్కరూ పట్టించుకోవాలి. ముఖ్యంగా పర్యావరణం గురించి మనం నిత్యం ఏదో ఒక వేదికపై మాట్లాడుతూనే ఉంటాం. కానీ అదొక్కటే సరిపోదు. పర్యావరణ పరిరక్షణకు ఏంచేయాలనేది ప్రజలకు నేర్పించాలి. మన వాతావరణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో అవగాహన కల్పించాలి. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలి. పరిశుభ్రమైన వాతావరణం ఉంటే ఎన్నో వ్యాధులను నివారించవచ్చు. నేను నివసించే పెసో నగరంలో వీధులన్నీ ఎంతో శుభ్రంగా ఉంటాయి.
నన్ను నేను మెరుగుపరుచుకొని...
మొదటిసారి 2017లో ‘మిస్ వరల్డ్’ పోటీల్లో పాల్గొన్నాను. అప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. మాట్లాడటం, నడవటం, నిలబడటంతో పాటు బయటకు వెళ్లినప్పడు ఎలా ఉండాలి, దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎలా వ్యవహరించాలి... ఇలా అన్ని విషయాల్లో నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. తర్వాత 2020లో ‘మిస్ కామెరూన్’ పోటీల్లో విజయం సాధించాను. అదే నా మొదటి కిరీటం. మిస్ వరల్డ్ అనేది అందం, తెలివితేటల సమ్మేళనం. నా ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులు, కోచ్ ఎంతో సహకరించారు. నా విజయాలను చూసి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు.’’
దండా రామకృష్ణ
భారతీయత నచ్చింది...
అద్భుత చారిత్రక నగరం హైదరాబాద్. దీంతోపాటు తెలంగాణ, భారత్‌లోని ఇతర నగరాలు, అక్కడి సంప్రదాయాల గురించి మరింతగా తె లుసుకోవాలని అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి టెలివిజన్‌లో భారతీయ చిత్రాలు, డ్యాన్సులను చూసేవాళ్లం. ఇక్కడి మహిళలు పెట్టుకునే బొట్టు నాకు బాగా నచ్చింది. అది అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంది. విమానాశ్రయంలో దిగగానే బొట్టు పెట్టి స్వాగతం పలికారు. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది. అలాగే ఇక్కడి ఆలయాలు కూడా సందర్శించాలనేది నా కోరిక. దేవాలయాలు పవిత్ర ప్రదే శాలు. అక్కడ మన మన సులో ఏదున్నా భగవంతుడితో చెప్పుకోవచ్చు. ప్రతిచోటా దేవుడు ఉంటాడు. అయితే దేశం, ప్రాంతం, తెగను బట్టి ప్రార్థించే విధానం మాత్రమే మారుతుందనేది నా నమ్మకం.
ఒక్కొక్కటీ ఆస్వాదిస్తున్నా...
ఇక్కడ హోటల్‌లో దిగినప్పటి నుంచీ అందరూ ఒకటే చెబుతున్నారు... హైదరాబాద్ బిర్యానీ గురించి. త్వరలోనే తింటా. ప్రస్తుతానికి రోజుకో వంటకాన్ని రుచి చూస్తున్నా. వంటలు చాలా కారంగా ఉన్నాయి. అయినా బాగున్నాయి. చీజ్‌తో వండిన వంటలు నాకు చాలా ఇష్టం.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News