Share News

మిల్లెట్‌ మిరాకిల్స్‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:54 AM

ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ... భద్రాద్రి మిల్లెట్‌ బిస్కెట్ల గురించి ప్రస్తావించారు. ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వీటి గురించి చర్చ మొదలైంది. భద్రాచలానికి చెందిన నలుగురు....

మిల్లెట్‌ మిరాకిల్స్‌

న్యూస్‌మేకర్‌

ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ... భద్రాద్రి మిల్లెట్‌ బిస్కెట్ల గురించి ప్రస్తావించారు. ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వీటి గురించి చర్చ మొదలైంది. భద్రాచలానికి చెందిన నలుగురు గిరిజన మహిళలు కలిసి ఈ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. తమ ఉత్పత్తులకు ఇంతటి ఖ్యాతి లభిస్తుందని అస్సలు ఊహించలేదని... ప్రధాని అభినందనలు ఎనలేని ప్రోత్సాహాన్ని ఇచ్చాయని ఆ బృంద సభ్యులైన ఊకె వెంకటలక్ష్మి, తాటి లలిత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయాణం ఎక్కడ... ఎలా మొదలైందనే విశేషాలను వారు ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘ఆరేళ్ల నుంచి మేం మిల్లెట్‌ బిస్కెట్లను తయారు చేస్తున్నాం. రుచితోపాటు ఆరోగ్యకరమైనవి కావడంతో వీటికి క్రమంగా డిమాండ్‌ పెరిగింది. ఒకసారి తిన్నవారు బంధుమిత్రుల కోసం తీసుకువెళుతుంటారు. అలా విదేశాలకు కూడా వెళ్లాయి మా బిస్కెట్లు. అక్కడివారు మమ్మల్ని సంప్రతించి బిస్కెట్లు పంపమని అడగడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ మధ్య భద్రాచలం ఐటీడీఏను సందర్శించిన ‘ట్రైబల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (టైఫెడ్‌) అధికారులు... మేము తయారు చేసిన మిల్లెట్‌ బిస్కెట్లను రుచి చూశారు. అద్భుతంగా ఉన్నాయంటూ అభినందించారు. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మా స్టాల్‌ను ఏర్పాటు చేశాం. అక్కడకు వచ్చినవారందరికీ బిస్కెట్లు బాగా నచ్చాయి. అలా మా మిల్లెట్‌ బిస్కెట్ల తయారీ అంశం ప్రధాని నరేంద్ర మోది దృష్టికి వెళ్లింది.


అలా మొదలైంది...

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ చూపుతున్నారు... రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రల అన్నం లాంటివి తింటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మిల్లెట్స్‌ అంటే ఆసక్తి పెరిగింది. వీటితో చిరుతిళ్లు తయారుచేసి అమ్మితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. మొదట రాగులు, జొన్నలతో బిస్కెట్లు తయారు చేశాం. అనుకోని ఇబ్బందులు ఎన్నో ఎదురయ్యాయి. రూ.15 వేల వరకూ నష్టం వచ్చింది. అయినా మా ప్రయత్నాన్ని ఆపలేదు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సహకారంతో రోజుకు మూడు కేజీల బిస్కెట్లను సిద్ధం చేసేవాళ్లం. ప్రస్తుతం జొన్నలు, రాగులు, సామలు, కొర్రలతో 20 కేజీల వరకు తయారు చేసి అమ్ముతున్నాం. ఇందుకోసం అవసరమయ్యే మిల్లెట్స్‌, ఇతర ముడి పదార్దాలను ఏపీలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాక గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అధికారులు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తున్నారు. భద్రాచలం రామాలయం, ఐటీడీఏ గిరిజన మ్యూజియం, కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లతో పాటు హైదరాబాద్‌లోని శిల్పారామం తదితర చోట్ల బిస్కెట్లు విక్రయిస్తున్నాం. భద్రాచలంలో స్థానికంగా రెండు కౌంటర్లను స్వయంగా, మరికొన్నింటిని ఇతరుల సహకారంతో నిర్వహిస్తున్నాం.


3-Navya.jpg

శానిటరీ నేప్‌కిన్స్‌తో...

వాస్తవానికి మేము తయారు చేసే బిస్కెట్లు ప్రధాని ప్రశంసించే స్థాయికి వెళతాయని అస్సలు ఊహించలేదు. నిజంగా ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్రశంసతో మా బాధ్యత పెరిగింది. ఈ విజయం మాకు అంత సులువుగా లభించలేదు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాం. 2019లో ‘శ్రీరామా జాయింట్‌ లయబిలిటీ గ్రూప్‌’ను ఏర్పాటు చేసుకున్నాం. మొదట ‘గిరి శానిటరీ నేప్‌కిన్స్‌’ తయారీ ప్రారంభించాం. ఇవి పాత మోడల్‌లో ఉన్నాయని ఎవరూ కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో 2020 మార్చిలో... ఐటీడీఏ అధికారుల సహకారంతో కొత్త మిషన్‌ను కొనుగోలు చేశాం. యూనిట్‌ కాస్ట్‌ రూ.13.45 లక్షలు కాగా ఇందులో రూ.8 లక్షలు ఐటీడీఏ సబ్సిడీ ఇచ్చింది. బ్యాంకు రుణం కింద రూ.4.35 లక్షలు మంజూరు కాగా మా వాటా కింద రూ.లక్ష చెల్లించాం.

అందరి సహకారంతో...

అయితే ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్‌ కారణంగా నేప్‌కిన్స్‌తయారీ చేపట్టలేకపోయాం. ఆ సమయంలో అధికారుల సహకారంతోనే మాస్క్‌లు తయారు చేశాం. తరవాత నెల రోజులు కష్టపడి 40 వేల నేప్‌కిన్స్‌ తయారు చేసి జీసీసీకి అప్పగించాం. తరవాత మా అందరికీ ఖాళీ సమయం ఉంటుండటంతో మిల్లెట్‌ బిస్కట్లను తయారు చేయాలనుకున్నాం. ఈ విషయాన్ని అప్పటి ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్‌దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించి మాకు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. నాటి నుంచి మా మిల్లెట్‌ బిస్కెట్ల తయారీ కొనసాగుతూనే ఉంది.

శ్రీపాద శ్రీధర్‌, భద్రాచలం


కరక్కాయ టీ పొడి...

రాగి, జొన్న బిస్కెట్‌ ప్యాకెట్లను ఒక్కోటి రూ.130కి సామలు, కొర్రలు బిస్కెట్‌ ప్యాకెట్లను ఒక్కోటి రూ.150కి విక్రయిస్తున్నాం. ఈ మధ్యే కరక్కాయ టీ పౌడర్‌ తయారీ ప్రారంభించాం. దీన్ని రూ.200లకు విక్రయిస్తున్నాం. పెద్ద పెద్ద మాల్స్‌లో సైతం ‘భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌ బిస్కెట్లు’ అందుబాటులో ఉండాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నాం. ప్రస్తుతం మా బృందంలో నలుగురం ఉన్నాం. మరో పదిమందికైనా ఉపాధి కల్పించే స్థాయికి మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని కోరుకొంటున్నాం.

ఇవి కూడా చదవండి:

వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..

సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

For More AP News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 03:55 AM