Share News

Meher Baba 100 Anniversary: ఆయన దీక్షకు నూరేళ్లు

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:20 AM

‘‘ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీ ఎదుటి వ్యక్తిలోని ఆ దేవుణ్ణి దర్శించండి’’ అని ప్రబోధించిన మానవతావాది... ‘‘మానవ జీవిత లక్ష్యం భగవదైక్యం, మోక్షసాధన. నిరంతరం భగవంతుని ధ్యాసలో...

Meher Baba 100 Anniversary: ఆయన దీక్షకు నూరేళ్లు

‘‘ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీ ఎదుటి వ్యక్తిలోని ఆ దేవుణ్ణి దర్శించండి’’ అని ప్రబోధించిన మానవతావాది... ‘‘మానవ జీవిత లక్ష్యం భగవదైక్యం, మోక్షసాధన. నిరంతరం భగవంతుని ధ్యాసలో గడపడం, ప్రేమతో నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా ఆ జీవిత లక్ష్యం నెరవేర్చుకోగలం’’ అని ప్రవచించిన ఆధ్యాత్మికవాది... అవతార్‌ మెహెర్‌బాబా. ఆయన మౌనం చేపట్టి ఈనెల 10వ తేదీకి వందేళ్ళు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ‘మెహెర్‌బాబా శతవర్ష మౌన వార్షికోత్సవాల’ కోసం భక్తులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

‘‘నేను బోధించడానికి రాలేదు. మేలుకొలపడానికి వచ్చాను’’ అని ప్రకటించిన మెహెర్‌బాబా 1894 ఫిబ్రవరి 25న పుణేలో జన్మించారు. తల్లితండ్రులు పెట్టినపేరు మేర్వాన్‌. పుణేలోని దక్కన్‌ కళాశాలలో మేర్వాన్‌ చదువుకొనేవాడు. ఒకరోజు అతను కాలేజీ నుంచి వస్తున్నాడు. అప్పటికే నూరేళ్ళ వయసు పైబడిన హజ్రత్‌ బాబాజాన్‌ అనే మహిళా గురువు ఆయన నుదుటిమీద ముద్దాడింది. వెంటనే మేర్వాన్‌ బాహ్య ప్రపంచ చైతన్యాన్ని కోల్పోయాడు. ఆ తరువాత... మేర్వాన్‌ను భగవంతుని స్వరూపంగా నాటి గురువులైన షిరిడీ సాయిబాబా, ఉపాసినీ మహరాజ్‌, నారాయణ్‌ మహరాజ్‌, తాజుద్దీన్‌ బాబా తదితరులు కీర్తించారు. తదనంతరం మేర్వాన్‌ను ‘మెహెర్‌బాబా... అంటే దయగల తండ్రి’ అని ఆయన శిష్యులు పిలవడం ప్రారంభించారు.


ప్రేమే నా మతం...

మెహెర్‌బాబా 1925 జూలై 10న మౌన దీక్ష చేపట్టారు. దాన్ని 1969 జనవరి 31న శరీరత్యాగం చేసేవరకూ... అంటే 44 ఏళ్ళు విడనాడలేదు. మౌనంగానే వేలాది కిలోమీటర్లు పర్యటించారు. మౌనం చేపట్టిన మొదటి ఏడాదిన్నరకాలం పలక మీద బలపంతో తన మాటలు చెప్పేవారు. ఆ తరువాత నుంచి 1954 అక్టోబర్‌ ఏడోతేదీ వరకు... అక్షరమాల ఉన్న ఒక పలక ద్వారా అనేక విషయాలు సంభాషించేవారు. తరువాత దాన్ని కూడా త్యజించి... కేవలం సంజ్ఞల ద్వారా తన సందేశాలను, ఆదేశాలను తన అనుయాయులకు అందించారు. 1950వ దశకంలో ఆయన ఘోరమైన రెండు కారు ప్రమాదాలకు గురయ్యారు. వాటిలో ఆయన దేహంలోని కుడి, ఎడమ భాగాలు దాదాపు నుజ్జు నుజ్జయ్యాయి. సాధారణ మానవులెవరూ ఈ ప్రమాదాలను తట్టుకొని తిరిగి నడవలేరని ప్రముఖ వైద్యులు ప్రకటించారు. భౌతికంగా ఎన్ని బాధలు ఎదురైనా తన మౌన దీక్షను ఆయన విడిచి పెట్టలేదు. మౌనం ఆయన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఏమాత్రం ఆటంకం కాలేదు. తన మౌనం గురించి వివిధ సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ ‘‘నేను ఎప్పుడూ మౌనంగా లేను. నా ప్రేమికుల హృదయాలతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను’’ అని చెప్పారు. పూర్వం శ్రీరామునిగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధునిగా, ఏసు ప్రభువుగా... ప్రస్తుత కాలంలో మెహెర్‌బాబాగా మానవరూపంలో అవతరించానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి మతం స్థాపించడానికి రాలేదని, అన్ని మతాలు ఒక్కటేనని, ‘‘నా మతం ప్రేమ’’ అని స్పష్టం చేశారు. ‘‘మీరు చూస్తున్న ఈ ప్రపంచం ఒక మిధ్య. ఇది ఒక కలలాంటిది. ఈ నిజాన్ని మీకు తెలియజేయడానికే ఈ అవతార కాలంలో మెహెర్‌బాబాగా మీ ముందుకు వచ్చాను’’ అని చెప్పారు.


నిత్యజీవన ఆధ్యాత్మిక మర్మాల గురించి ఆయన వివరిస్తూ భగవంతుడి సేవలో నిజాయితీగా ఉండండి. నిస్వార్థసేవ, ప్రేమ... ఈ రెండూ దైవీలక్షణాలు. ఇతరుల నుంచి ఏదో బహుమతి అందుకోవాలని ఆశించకండి. వారికి ఏదో రూపంలో సాయం చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. అవమానాలు, అభినందనలు మీపై ఎలాంటి ప్రభావం చూపించకపోతే... మీరు నిరంతరం ఆనందంగా ఉంటారు. విమర్శించడం అనే దురలవాటు ప్రతి ఒక్కరి రక్తంలోనూ ఉంది. ఆ అవలక్షణాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎంత మంచి వ్యక్తి అయినా... కామాన్ని జయించలేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి సాగలేరు’’ అని స్పష్టం చేశారు. ‘‘తల్లి కనిపించకపోతే తల్లడిల్లే పసి పిల్లవాడిలా సాధకుడు దేవునికోసం తపించాలి. మీ బలంతో, మీ బలహీనతలతో దేవునికి పనిలేదు. మిమ్మల్ని గమ్యానికి చేర్చే బాధ్యత ఆయనది. దానికి మీరు చేయాల్సిందల్లా... దేవుని నామాన్ని నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడమే. దీనివల్ల ఆయనతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇందుకోసం మీ భార్యాపిల్లల్ని, సంసారాన్ని వదిలిపెట్టనక్కర్లేదు’’ అని బోధించారు. మెహెర్‌బాబా సందేశాలు సరళంగా ఉంటాయి. వాటిని ఆచరించి, ఆచరింపజేస్తే విశ్వం యావత్తూ ప్రేమమయం అవుతుంది.

డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌

99595 53218

ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:21 AM