Share News

Female driver: టీచర్‌ కావాలనుకుని.. స్టీరింగ్‌ పట్టుకున్నా

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:32 PM

మగవారితో ధీటుగా మగువలు పోటీ పడుతున్న కాలమిది. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు దూసుకెళుతున్నారు. ఆ కోవలోనే కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన కనిమొళి రాష్ట్రంలోనే మొదటి ఆమ్నీ బస్‌ మహిళా డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంది.

Female driver: టీచర్‌ కావాలనుకుని.. స్టీరింగ్‌ పట్టుకున్నా

- తొలి ఆమ్నీ బస్‌ మహిళా డ్రైవర్‌ కనిమొళి

మగవారితో ధీటుగా మగువలు పోటీ పడుతున్న కాలమిది. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు దూసుకెళుతున్నారు. ఆ కోవలోనే కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన కనిమొళి రాష్ట్రంలోనే మొదటి ఆమ్నీ బస్‌ మహిళా డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంది. ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించాల్సిన సమయంలో ఊహించని విధంగా స్టీరింగ్‌ పట్టుకుంది. అదే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. భర్త సహకారంతో ఆమె నడుపుతున్న ఆమ్నీ బస్సు రాకెట్‌లా దూసుకుపోతోంది. ఈ దంపతులు ‘అళగన్‌ బస్‌’ పేరుతో కంపెనీ నడుపుతున్నారు. పొల్లాచ్చి - చెన్నై రూట్‌లో అదీ రాత్రిపూట బస్సును వేగంగా, చాకచక్యంగా నడుపుతూ ప్రయాణికుల ప్రశంసలందుకుంటోంది. వాహన చోదకురాలు కనిమొళి జీవన ప్రయాణ సమాహారమే నేటి తరుణి ప్రత్యేకం!

(చెన్నై, ఆంధ్రజ్యోతి)

ఆమ్నీ బస్సును నడపాలనే ఆలోచన ఎలా వచ్చింది.

- నేనూ, నా భర్త ట్రావెల్స్‌ కంపెనీ నడపాలని అనుకున్నప్పుడు, బిజినె్‌సలో లోటుపాట్లపై అవగాహన ఉండాలని భావించాం. ట్రావెల్స్‌ సంస్థకు డ్రైవర్ల ద్వారానే మంచి పేరు వస్తుందని తెలుసుకున్నాం.


ఏ కారణం చేతనైనా డ్రైవర్‌ డ్యూటీకి రాకపోతే బస్సు ప్రయాణం ఆగిపోకూడదనుకున్నాం. అదే ఆలోచనతో డ్రైవింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కారు డ్రైవింగ్‌ నాకెంతో ఇష్టం. అదీ రాత్రిపూట మైళ్లతరబడి సాఫీగా కారు నడిపేదాన్ని. ఈ విషయాన్ని గమనించే నా భర్త డ్రైవింగ్‌లో హెవీ లైసెన్స్‌ కోసం అప్లికేషన్‌ పెడుతున్నప్పుడు నన్ను కూడా భారీ వాహనాల డ్రైవింగ్‌ నేర్చుకోమని సలహా ఇచ్చాను. ఆ తర్వాత భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ కూడా పొందాను. ప్రస్తుతం మా సొంత బస్సులోనే డ్రైవర్‌గా పనిచేస్తున్నాను.


ఆమ్నీ బస్సు నడిపేందుకు ఇబ్బంది పడ్డారా

- సాధారణంగా కారు నడపటానికి, బస్సు నడపటానికి చాలా వ్యత్యాసాలున్నాయి. బస్సు పొడవు, వెడల్పుపై అవగాహన చాలా అవసరం. రహదారిలోని స్పీడ్‌ బ్రేకర్లను, ఎత్తుపల్లాలను గమనించి బస్సు నడపాలి. తొలిసారిగా కరూరు నుండి ఒట్టన్‌సత్రం వరకు 50 కి.మీ. దూరం బస్సు నడిపి, చాలా థ్రిల్లింగ్‌ ఫీలయ్యాను.


nani4.2.jpg

సాధారణంగా బస్‌ డ్రైవర్‌గా మారేందుకు మహిళలు ఇష్టపడరు. మీరెలా ఇంత వేగంగా బస్సును నడుపగలుగుతున్నారు.

- సాధారణంగా ఎవరైనా ఓ విషయం అసాధ్యమని చెబితే దానిని సాధ్యం చేసి చూద్దాం అనే ఆలోచన నాలో కలుగుతుంది. ఈ విషయంలో భర్త పూర్తిగా సహకరించినా మొదట కొద్దిగా భయమేసింది. ఆ తర్వాత క్రమంగా నాలో ధైర్యం చోటచేసుకుంది. ఆమ్నీ బస్సులో డ్రైవర్‌ సీటులో కూర్చునేటప్పుడు కలిగే ఫీలింగ్‌ మాటల్లో వర్ణించలేను.


వృత్తిలో బిజీగా ఉండి కుటుంబ సభ్యులు, పిల్లలకు దూరమవుతున్నామనే ఫీలింగ్‌ రాలేదా

- ఆ బాధ తప్పకుండా ఉంటుంది. నా కుమారుడికి ఏడేళ్లు. కుమార్తెకు మూడేళ్లు. కుమార్తె బామ్మ సంరక్షణలో పెరుగుతుండటం వల దిగులుపడను. అయితే కుమారుడు మొదటి నుంచి నా పెంపకంలోనే పెరిగాడు అందుకే అతడి గురించే బాధపడుతుంటాను. దూరంగా డ్యూటీ చేస్తున్నప్పుడు ఫోన్‌ చేసి ‘అమ్మా మిమ్మల్ని చూడాలని ఉంది. వెంటనే వచ్చేయ్‌’ అని ఏడుస్తున్నప్పుడు చాలా బాధపడుతుంటాను. సగం దూరంలో ఉన్నాను. డ్యూటీ అయిన వెంటనే నీ దగ్గరకే వస్తాను అని బాబును బుజ్జగిస్తాను.


మహిళలకు మీరిచ్చే సలహా

- ఆడపిల్లగా పుడితే చాలు. ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు విధిస్తుంటారు. వాటన్నింటిని అధిగమించి సొంతకాళ్లపై నిలబడి సంపాదించాలి. ఎంచుకున్న మార్గం సక్రమంగా ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 21 యేళ్ల వయస్సులో థర్డ్‌ ఇయర్‌ డిగ్రీ చదువుతున్నప్పుడు పెళ్ళయ్యింది. బీఇడి చదువుతున్నప్పుడు గర్భందాల్చాను. ఉదయం సీమంతం జరుపుకుని, పరీక్షలకు హాజరయ్యాను. అబ్బాయిపుట్టగానే ఎంఏలో చేరాను. అబ్బాయిని ఇంటిలో ఒంటరిగా వదలిపెట్టే పరీక్షలు రాశాను. ఏంఏ పాసయ్యాక అమ్మాయి పుట్టింది. ఇలా వ్యక్తిగత జీవితం సాగుతుండగానే మరో వైపు ఆమ్నీ బస్‌డ్రైవర్‌గా జీవనయానం కొనసాగింది. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చాను.


విశ్రాంతి సమయాల్లో ఏం చేస్తుంటారు

- రెస్టు లేని జీవితం నాది. నాలుగు రోజులు సెలవుపెట్టి ఫ్యామిలీతో కలిసి టూర్‌ వెళదామనుకుంటే డ్రైవర్లు డ్యూటీకి వచ్చారా.. బస్సును శుభ్రంగా క్లీన్‌ చేశారా.. ప్రయాణికులతో ఏవైనా గొడవలు పడుతున్నారా.. అనే ఆలోచనలే వస్తాయి. ప్రయాణికులకు సంతృప్తిని కలిగించడమే మా ధ్యేయం కనుక వృత్తి, వ్యాపారంపైనే దృష్టిసారిస్తున్నాం. రోజుకు రెండు గంటలపాటు నిద్రపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సరే జీవితంలో కొన్నింటిని త్యాగం చేసినప్పుడే సాధించగలం. ఆ త్యాగాలు అర్థవంతంగా ఉండాలి. అందరూ ఆనందించే విధంగా ఉండాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుందని కనిమొళి తన అభిప్రాయాలను వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...

Read Latest Telangana News and National News

Updated Date - Jul 05 , 2025 | 12:32 PM