Share News

సంప్రదాయ అభి రుచి

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:02 AM

ప్రసిద్ద పర్యాటక ప్రాంతమైన తమ ఊర్లో ప్రతిచోటా పాశ్చాత్య ఆహారమే కనిపించడం 28 ఏళ్ళ మనీషా ఠాకూర్‌ను ఆలోచింపజేసింది. స్థానిక సంప్రదాయ వంటకాల ప్రత్యేకతను...

సంప్రదాయ అభి రుచి

ప్రసిద్ద పర్యాటక ప్రాంతమైన తమ ఊర్లో ప్రతిచోటా పాశ్చాత్య ఆహారమే కనిపించడం 28 ఏళ్ళ మనీషా ఠాకూర్‌ను ఆలోచింపజేసింది. స్థానిక సంప్రదాయ వంటకాల ప్రత్యేకతను చాటి చెప్పాలనే ఆమె తపన కొత్త ప్రయత్నానికి నాంది పలికింది.హిమాచల్‌ప్రదేశ్‌లోని సల్బక్‌ గ్రామంలో మనీషా ఏర్పాటు చేసిన కేఫ్‌ ఇప్పుడు ఒక పర్యాటక ఆకర్షణగా మారింది.

‘‘కొన్నాళ్ళ క్రితం ఢిల్లీ నుంచి నా స్నేహితులు కొందరు మా ఊరు వచ్చారు. వీధులన్నీ తిరిగి వచ్చాక... ‘‘మీ ప్రాంతం, నీ ఆతిథ్యం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీధుల్లోకి వెళ్ళి ఏదైనా తినాలనుకుంటే... నూడుల్స్‌, మంచూరియా లాంటివే తప్ప మరేం దొరకడం లేదేమిటి? ఇవి ఎక్కడైనా ఉండేవేగా! ఇక్కడి స్పెషల్స్‌ ఏమిటి’’ అని అడిగారు. ఆ మాట నిజమే. ‘ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్తాం. స్థానిక రుచుల్ని అస్వాదించాలనుకుంటాం. కానీ అక్కడ కూడా పాశ్చాత్య రుచులు లేదా పట్టణ ప్రాంతాల్లో కనిపించే పదార్థాలే కనిపిస్తే? మన ప్రత్యేకతను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం?...’ ఈ ప్రశ్న నన్ను ఎంతోకాలం వేధించింది.


అన్నీ ఒకే రకంగా...

మాది హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బిర్‌ బిల్లింగ్‌ అనే చిన్న గ్రామం. అది సుప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం. ప్రతి సంవత్సరం ఎంతోమంది టూరిస్టులు మా ఊరును సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడి మార్కెట్‌లో నడుస్తూ ఉంటే ప్రతి చోటా ఒకే రకం ఆహారాన్ని అమ్మే దుకాణాలు కనిపిస్తాయి. కరోనా తరువాత నగరాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన స్థానిక యువకులు ఏర్పాటు చేసినవి కూడా ఎక్కువే ఉన్నాయి. స్థానికులు కూడా కొన్నేళ్ళుగా వీటి మీద మోజు పెంచుకుంటూ... తమ సంప్రదాయ వంటల్ని క్రమంగా విస్మరిస్తున్నారు. ఇదే కొనసాగితే ఆ వంటల్లో చాలావరకూ మరుగునపడే ప్రమాదం ఉంది. అందుకే మా ప్రాంత సంప్రదాయిక వంటలను మళ్ళీ అందరికీ రుచి చూపించాలని, ప్రోత్సహించాలని అనుకున్నాను. మాకు సమీపంలో ఉన్న సల్బక్‌ గ్రామంలో ‘హర్‌ కేఫ్‌’ పేరిట ఒక రెస్టారెంట్‌ ఏర్పాటు చేశాను.

స్థానిక మహిళలతో...

మా జిల్లా పేరు కంగ్రా. ఈ ప్రాంతంలో జరిగే ఉత్సవాలు, వివాహాలు, ఇతర వేడుకల్లో మధ్యాహ్న సమయంలో ఇచ్చే విందును ‘కంగ్రీధమ్‌’ అంటారు. దీనిలో భాగంగా చేసే వంటకాలు చాలా వైవిధ్యంగా, ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇప్పుడు వాటి స్థానంలో వేరే ప్రాంతాల వంటకాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని పరిరక్షించడం కోసం మా రెస్టారెంట్‌లో కంగ్రీధమ్‌ వంటకాలతో పాటు ఇదివరకు ఇళ్ళలో సాధారణంగా చేసుకున్న చిరుతిండ్లు, ఉపాహారాలను కూడా మెనూలో ఉంచాం. దాదాపు అన్నీ కట్టెల పొయ్యి మీదే వండుతున్నాం. వంటలు, ఇతర పనులు పూర్తిగా స్థానిక మహిళలే చేస్తారు. వారు తయారు చేసే పచ్చళ్ళు, పొడులను కూడా విక్రయిస్తున్నాం. ఇది వారికి ఉపాధి మాత్రమే కాదు, సాధికారతవైపు వేసే ఒక చిన్న అడుగు కూడా. ఇప్పుడు మా ఊరు వచ్చిన పర్యాటకులకు మా రెస్టారెంట్‌ ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రతి వంటకం గురించి వారు ఆసక్తిగా అడుగుతూ ఉంటారు.


వారిలో మహిళలను మా కిచెన్‌లోకి ఆహ్వానించి... వంటకాల తయారీ పద్ధతుల గురించి చెబుతున్నాం. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండే రెస్టారెంట్‌ అలంకరణను కూడా వారు మెచ్చుకుంటున్నారు. అలాగే స్థానికులు కూడా తరచుగా ‘హర్‌ కేఫ్‌’కు వస్తున్నారు. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినవారు... మా ఊరు వచ్చినప్పుడు స్థానిక రుచుల్ని మా రెస్టారెంట్‌లో ఆరగిస్తున్నారు. వాటి రెసిపీల గురించి ఆరా తీస్తున్నారు. ఇంతకన్నా సంతోషం కలిగించే విషయం ఇంకేముంటుంది?’’.

మా జిల్లా పేరు కంగ్రా. ఈ ప్రాంతంలో జరిగే ఉత్సవాలు, వివాహాలు, ఇతర వేడుకల్లో మధ్యాహ్న సమయంలో ఇచ్చే విందును ‘కంగ్రీధమ్‌’ అంటారు. దీనిలో భాగంగా చేసే వంటకాలు చాలా వైవిధ్యంగా, ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇప్పుడు వాటి స్థానంలో వేరే ప్రాంతాల వంటకాలు చోటు చేసుకుంటున్నాయి.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:02 AM