Mahalaya Paksha: కృతజ్ఞతా పక్షం మహాలయం
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:58 AM
బిడ్డలు పుట్టాలని తల్లితండ్రులు గుళ్ళూ, గోపురాలు తిరుగుతారు, ఎత్తైన కొండలు ఎక్కి దేవతలకు మొక్కుకుంటారు. వారి ఋణం తీర్చుకోవడం మన ధర్మం. అలాగే మనం, మన కుటుంబం అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు...
విశేషం
బిడ్డలు పుట్టాలని తల్లితండ్రులు గుళ్ళూ, గోపురాలు తిరుగుతారు, ఎత్తైన కొండలు ఎక్కి దేవతలకు మొక్కుకుంటారు. వారి ఋణం తీర్చుకోవడం మన ధర్మం. అలాగే మనం, మన కుటుంబం అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాన్ని అందించి, ఒక స్థాయికి చేరుకోవడానికి దోహదం చేసినవారికి, తిట్టి, అవసరమైతే కొట్టి.. నాలుగు అక్షరాలు మనకు ఒంటపట్టేలా చేసి, నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి మార్గం వేసిన దైవసమానులైన గురువులకు, మన బంధువులకు... ఇలా ఏదో విధంగా మనకు సాయం చేసినవారందరికీ కృతజ్ఞతలు సమర్పించుకోవాల్సిందే. అలా చేయని పక్షంలో మనం కృతఘ్నులం. మనం ధర్మాన్ని నిర్వర్తించుకోవడానికే పెద్దలు ఏడాదిలో అయిదుసార్లు వారిని స్మరించుకొనే ఏర్పాటు చేశారు.
అయిదు విధానాలు
వ్యక్తి మరణించిన ప్రతి ‘అబ్ద’ కాలానికి (సంవత్సర కాలానికి, అలా ప్రతి సంవత్సరం) వారికి కృతజ్ఞతలు ప్రకటించుకొనే విధానాన్ని ‘ప్రత్యాబ్దికం’ (ప్రతి+ఆబ్దికం) అన్నారు. ఇక జీవనది ప్రవహిస్తూ ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు... మన పెద్దలను గుర్తు చేసుకుంటూ ఆచరించే ఇదే విధానాన్ని ‘తీర్థ శ్రార్ధం’ అంటారు. గయ లాంటి తీర్థ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చేసేది అదే. వీటితోపాటు మకర సంక్రమణం (ఉత్తరాయణం... జనవరి పధ్నాలుగు/పదిహేను), కర్కాటక సంక్రమణం (దక్షిణాయనం... జూలై పదహారు/పదిహేడు) రాగానే... ఆ రోజుల్లో నిర్వహించుకొనే ఇదే కృతజ్ఞతా సమర్పణ కార్యక్రమాన్ని ‘సంక్రమణ శ్రాద్ధం’ అంటారు. అందుకే సంక్రాంతి మరుసటి రోజైన కనుము (కనుమ అనకూడదు) నాడు ‘పెద్దలకు పెట్టుబడులు’ అనే కార్యక్రమాన్ని నిర్దేశించారు. అందుకే ‘కనుము రోజున కాకైనా కదలదు’ అంటూ ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు. ఇక ఆశ్వయుజ మాసంలో లక్ష్మీదేవి పుట్టిన అమావాస్య నాడు పెద్దల కోసం శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించుకొనే విధానం కూడా ఉంది. ఇది తెలియని వారికి, మరచిపోయినవారికి ‘లక్ష్మీ పూజనాడు తద్దినమా?’ అనిపిస్తుంది. వీటికి అదనంగా భాద్రపద మాసంలో పౌర్ణమికి మరుసటి రోజు నుంచి 15 పాటు కూడా పెద్దలకు కృతజ్ఞతలను సమర్పించుకోవడం అనే గొప్ప పద్ధతిమనకు ఉంది. దాన్ని ‘మహాలయ పక్షం’ అంటారు. ఆ కాలంలో ఆచరించేది మహాలయ శ్రాద్ధం.
దీనివల్ల ఏం లాభం?
‘ఇలా చేయడం వల్ల లాభం ఏమిటి?’ అని కొందరు అనుకుంటారు. ‘పితృశాపాలు’ అనే మాట మనం వింటూ ఉంటాం. గతించి, పైలోకాలకు వెళ్ళిన వారు అక్కడినుంచి మన మీద కసి, పగ, ద్వేషం లాంటివి చూపించరు. కాబట్టి ‘పితృశాపం’ అంటే పితృదేవతలు పెట్టే శాపం కాదు. మన తాతో, ముత్తాతో ఎవరికో ఘోరమైన అపచారం చేసినా, ఎవరి దగ్గరైనా ఋణాన్ని తీసుకొని దాన్ని తిరిగి ఇవ్వకపోయినా... అది వారితో చెల్లిపోదట. ఆ వంశంలో అందరికీ... వారి ఆస్తి సంక్రమించినట్టు... ఇది కూడా సంక్రమిస్తూనే ఉంటుందట. అందుకే అన్నీ ఉండి సంతానం లేకపోవడం, ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో ఉండడం, ఏదీ కలిసిరాకపోవడం, బుద్ధిహీనత, జడత్వం, మూర్ఛ లాంటి వాటితో బాధపడుతూ... ఆనందానికి దూరమవుతారు. దానికి సరైన పరిష్కారం మహాలయ శ్రాద్ధాన్ని పెట్టడమేనని పెద్దలు చెప్పారు. తమ వారసులకు ఏయే కోరికలు అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని తీర్చి వెళ్ళాలనే ఉద్దేశంతో... పితృదేవతల ఆత్మ సూక్ష్మ శరీరంతో ఈ పదిహేను రోజులపాటు భూలోకానికి ప్రత్యేకంగా వస్తారు. కనిపించని ఆ ఆత్మ శరీరాలకు మనం కనిపిస్తాం. వారు చేసిన సహాయాలను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటూ... ఒక్క రోజు వారికి కేటాయించగలిగితే వాళ్ళు పరమానందాన్ని పొందుతారు. మన కడగండ్లను తీర్చి మరీ పై లోకానికి తిరిగి వెళతారు. కాబట్టి ఈ పదిహేను రోజుల కాలం ఎంతో శ్రేష్టం, మరెంతో ముఖ్యం.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు

ఎలా చేయాలి?
ఆదౌ పితా తథా మాతా సాపత్నీ జననీ తథా.... తండ్రి, తాత, ముత్తాత, తల్లి, ఆమె అత్త, ఆమెకు అత్తా... ఇలా బంధుగణంలో మరణించినవారు ఎవరెవరు ఉన్నారో వారి పేర్లను ఉచ్చరిస్తూ, వారు మనకు చేసిన సహాయాలను గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క పిండాన్ని సమర్పించాలి. వారితోపాటు మనకు చేయూత అందించినవారికి, గురువులకు, చివరిగా భీష్మ పితామహులకు, ఈ వ్యవస్థను మనకోసం ఏర్పాటు చేసిన ఆదిశంకరులకు కూడా పిండ నివేదన చేయాలి. శరీర ఆరోగ్యం లేని వారు స్వయంపాకాన్ని ఇవ్వవచ్చు. రెండోది... బియ్యపు పిండితో పిండాలను చేసి సమర్పించవచ్చు. మూడోది శాస్త్రోక్తంగా... అన్నశ్రాద్ధాన్ని ఆచరించాలి. ఆబ్దికం నాడు చేసే వంటకాలతో ఆ కార్యక్రమాన్ని చేయించిన వారికి భోజనం పెట్టాలి. అలాగే ఏవో పనులు ఉన్నాయని ఈ కార్యక్రమాన్ని పొద్దున్నే ముగించేయకూడదు. పితృదేవతలది ‘అపర-అహ్ణ’ (అపరహ్ణ) కాలం (రోజులో రెండవ సగం... అంటే మధ్యాహ్నం పన్నెండు దాటాక). కాబట్టి అప్పుడే పెట్టాలి. ‘‘మహాలయాన్ని ఆచరించడం మాకు కష్టం’’ అనుకోవద్దు. మీకు జ్వరమో, ఆపదో వచ్చినప్పుడు మీ తల్లితండ్రులు మాకు కుదరదని అనుకోలేదు కదా? అలాగే... ‘మనం ఇక్కడ ఉండి చేసినవి మన పితృదేవతలకు చేరుతాయా?’ అనే సందేహం కూడా వద్దు. ‘‘విదేశాల్లో ఉన్నవారికి భారతీయ రూపాయల్లో పంపుతాం. వారికి అది రూపాయిల్లో చేరదు... ఆ దేశపు కరెన్సీలో చేరుతుంది. ఇదీ అంతే!’’ అని కంచి పరమాచార్యులవారు ఒక సందర్భంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం