Sanskrit literature: జ్ఞానసేతువు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:13 AM
అందుబాటులో రాజ్యాధికారం, చతురంగబలాలు అపారమైన సంపద, గుణ రూపలావణ్యవతులైన భార్యలు, ఎంతో ప్రేమగా చూసుకొనే తల్లిదండ్రులు... వీటన్నిటినీ విడిచిపెట్టి...
విశేషం
అందుబాటులో రాజ్యాధికారం, చతురంగబలాలు అపారమైన సంపద, గుణ రూపలావణ్యవతులైన భార్యలు, ఎంతో ప్రేమగా చూసుకొనే తల్లిదండ్రులు... వీటన్నిటినీ విడిచిపెట్టి, యవ్వనంలోనే సన్న్యాస దీక్ష తీసుకొని, అపూర్వమైన గ్రంథ నిధిని మధ్వ సిద్ధాంత వాఙ్మయానికి అందించిన వారు శ్రీజయతీర్థులు.
‘మధ్వాఖ్యరాజు’గా ప్రసిద్ధి పొందిన ఆయన మధ్వ సంప్రదాయంలో ఎందరో మహనీయులకు మార్గదర్శిగా నిలిచారు.
సాధినాడు సంస్థానానికి చెందిన యువరాజు సాధి దొండు రఘునాథరాయలు. ఒకసారి అతను వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయిన అతను భరించలేని దాహార్తితో... భీమా నదిని చేరుకున్నాడు. కిందికి దిగకుండా... గుర్రం మీద నుంచి వంగి, నదిలోని నీటిని నేరుగా నోటితో తాగుతున్నాడు. మధ్వాచార్యుల శిష్యులైన అక్షోభతీర్థులు నదికి అవతలివైపు నుంచి దీన్ని గమనించారు. ‘‘కిం పశుః పూర్వ దేహే?’’ (నువ్వు గత జన్మలో పశువువా?) అని ప్రశ్నించారు. ఆ నాలుగు పదాల ప్రశ్నతో... తను గత జన్మలో ఒక ఎద్దుగా జన్మించి, శ్రీమధ్వాచార్యుల గ్రంథాలను మోసి, ఆయన తన శిష్యులకు శాస్త్రజ్ఞానం బోధిస్తూ ఉండగా విన్న అనుభవాలు రఘునాథరాయలుకు తక్షణమే జ్ఞాపకం వచ్చాయి. అక్షోభతీర్థుల వద్దకు పరుగుపరుగున వచ్చాడు. తన తలను ఆయన పాదాలకు భక్తితో తాకించి ‘‘నన్ను తమరి శిష్యులుగా స్వీకరించాలని, శ్రీమధ్వశాస్త్రాన్ని ఉపదేశించి నన్ను పునీతుణ్ణి చేయాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఆర్తితో వేడుకున్నాడు. అక్షోభతీర్థులు అతణ్ణి సంతోషంగా పైకి లేపి ‘‘నీకు శ్రీమధ్వశాస్త్రాన్ని బోధించడం కాదు... నిన్ను శ్రీమధ్వాచార్యుల వేదాంత సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. సన్న్యాసి కావడానికి సిద్ధపడు’’ అని చెప్పారు.
అప్పుడు రఘునాథరాయలు ‘‘నాకు శాస్త్రజ్ఞానం ఉంటే చాలు. అంతటి ఉన్నత స్థానానికి అర్హుణ్ణి కాదు’’ అన్నాడు. ‘‘ఇది దైవసంకల్పం. దీన్ని నీవు స్వీకరించాలి’’ అన్నారు అక్షోభతీర్థులు.
గురు ఆదేశంలో గ్రంథ రచన
ఆ రాత్రి రఘునాథరాయలు కలలో శ్రీవాయుదేవులు కనిపించి ‘‘నీవు సన్న్యాసం స్వీకరించు. శ్రీరాముణ్ణి పూజించు. విద్వదగ్రగణ్యుడివి అవుతావు, సర్వజ్ఞానులకు ఆశ్రయం అవుతావు’’ అని ఆశీర్వదించారు. ఆ మరుసటిరోజే రఘునాథరాయలు సన్న్యాసదీక్ష స్వీకరించి, ‘జయతీర్థులు’గా వినుతికెక్కారు. ‘‘భాష్యం లేనిదే సూత్రాలు అర్థం కావు. టీకా లేనిదే భాష్యార్థం తెలుసుకోలేరు. అటువంటి టీకాలను రచించే బాధ్యత భగవంతుడు నీపైన ఉంచాడు’’ అంటూ తన శిష్యుణ్ణి గ్రంథరచన చేయాల్సిందిగా అక్షోభతీర్థులు ఆదేశించారు. ఆ మాటలు వినగానే ‘‘నా భాష్యాలకు వ్యాఖ్యానం రాసేది ఈ ఎద్దే’’ అని శ్రీమధ్వాచార్యులు (జయతీర్థుల పూర్వజన్మలో) అన్న మాటలు శ్రీజయతీర్థుల చెవిలో మారుమోగాయి. జీవితంలో... మొదటి ఇరవై ఏళ్ళపాటు వ్యాకరణ శబ్దాల జోలికే పోని వ్యక్తి... సన్న్యాసదీక్ష తీసుకున్న తరువాత ఇరవై ఏళ్ళలోనే మధ్వ సిద్ధాంతానికి టీకా, వ్యాఖ్యానాలు రాసి... విద్వాంసులందరినీ మెప్పించడం అనేది ఊహాతీతం. ‘న్యాయసుధ’ (శ్రీమధ్వాచార్యుల అణువ్యాఖ్యానానికి టీకా), ‘తత్త్వ ప్రకాశిక’ (సూత్రభాష్యానికి టీకా), ‘న్యాయవివరణ’ టీకా, ‘సంబంధ దీపిక’ (‘ఋగ్భాష్యా’నికి టీకా), ‘ప్రమేయ దీపిక’ (గీతాభాష్యానికి టీకా)... ఇలా అనేక అసాధారణమైన గ్రంథాలను ఆయన రచించారు. వేద, ఉపనిషత్, పురాణ వాక్యాలు ఎన్నిటినో తన రచనలలో ఆయన అడుగడుగునా పొందుపరిచారు. తనపై ఉన్నది మహత్తరమైన బాధ్యత అనీ, దాన్ని తన బుద్ధిద్వారానో, పాండిత్య ప్రతిభతోనో నిర్వర్తించలేనని, భగవంతుడు, వేదవ్యాసుడు, శ్రీవాయుదేవుడు, సరస్వతీదేవి, దుర్గాదేవిల అనుగ్రహం వల్లనే అది సాధ్యమని శ్రీజయతీర్థులకు తెలుసు. అందుకే దుర్గాబెట్ట అనే ప్రదేశాన్ని తన తపోభూమిగా ఎంచుకున్నారు. కొన్నాళ్ళు పచ్చగడ్డి, ఆకులు, ఆ తరువాత ఎండుగడ్డి, రాలిన ఆకులను మితంగా స్వీకరిస్తూ తపస్సు చేశారు. ఆయన తపస్సు ఫలించి సరస్వతీదేవి, దుర్గాదేవి ప్రత్యక్షమయ్యారు. గ్రంథ రచనకు కావాల్సిన జ్ఞానాన్ని, సాధన సంపత్తిని అనుగ్రహించారు. ఆయన తపోనిరతులై ఉన్నప్పుడు ఆదిశేషుడు వచ్చి... తన పడగను ఆయన నాలుకపై ఆడించాడు. ఇది కూడా ఆయన విశేష జ్ఞానసిద్ధికి కారణమయింది.
టీకారాయలు
వైష్ణవ వేదాంత సంప్రదాయంలో శ్రీమధ్యాచార్యుల తరువాత... తన అసాధారణ వాఙ్మయ తపస్సుతో మాన్యుడైన శ్రీజయతీర్థులదే అగ్రస్థానం. ‘టీకారాయలు’గా ఆయన ప్రసిద్ధి చెందారు. ‘‘వ్యాససూత్రాలు అనే మందర పర్వతాన్ని... శ్రీమధ్వుల భాష్యాలనే తాడుతో చుట్టి... ఆ వేదరాశిని చిలకడం ద్వారా ఉద్భవించినదే శ్రీజయతీర్థుల న్యాయసుధ’’ అని శ్రీవ్యాసరాయలు ప్రశంసించారు. శ్రీవ్యాసరాయలు, శ్రీవాదిరాజులు, శ్రీరఘోత్తములు, శ్రీరాఘవేంద్రస్వామి... ఇలా అనేకమంది మహనీయులు ఆయన గ్రంథాల్లోని ఆశయాలను వ్యక్తీకరించడమే తమ జీవన సిద్ధిగా భావించి రచనలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే భాష్యకారుల సంప్రదాయానికి ఆయన జ్ఞానసేతువు అయ్యారు. తత్త్వజ్ఞాన దుందుభిని మోగించి... ‘మద్వాఖ్యరాజు’అని కీర్తి పొందారు. మలఖేడ్ రాజ్యం ఇప్పుడు లేదు. కానీ ఆ ప్రదేశం ఇప్పుడు పుణ్యక్షేత్రం అయింది. శ్రీజయతీర్థులు స్థిరపరచిన మధ్వ సిద్ధాంతం అక్కడ శోభాయమానంగా వెలుగొందుతోంది.
(ఈనెల 14 నుంచి 16 వరకు
శ్రీజయతీర్థుల ఆరాధన మహోత్సవాలు)
శ్రీమధ్వ ప్రచార పరిషత్
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి