Share News

Latest Bracelet Trends for Women: నయా బ్రేస్‌లెట్‌ ట్రెండ్స్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:20 AM

ఆధునిక ఫ్యాషన్‌ దుస్తులకు అనుగుణంగా రకరకాల బ్రేస్‌లెట్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. చేతికి సింగిల్‌ బ్యాంగిల్‌ వేసుకోవడం కంటే చక్కని బ్రేస్‌లెట్‌ పెట్టుకోవడానికే యువతులు...

Latest Bracelet Trends for Women: నయా బ్రేస్‌లెట్‌ ట్రెండ్స్‌

ఆధునిక ఫ్యాషన్‌ దుస్తులకు అనుగుణంగా రకరకాల బ్రేస్‌లెట్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. చేతికి సింగిల్‌ బ్యాంగిల్‌ వేసుకోవడం కంటే చక్కని బ్రేస్‌లెట్‌ పెట్టుకోవడానికే యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సంప్రదాయ దుస్తుల మీద కూడా బ్రేస్‌లెట్స్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. మధ్యవయసు మహిళలు సైతం ఈ నయా ట్రెండ్‌ను అనుసరించడం విశేషం.

నల్ల పూసలతో

కొత్తగా పెళ్లయిన యువతులు మెడలో వేసుకునే నల్లపూసల గొలుసును చేతికి బ్రేస్‌లెట్‌లా కూడా పెట్టుకుంటున్నారు. మహిళల ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైనర్లు మల్టీపర్పస్‌ డిజైన్లను రూపొందిస్తున్నారు. బంగారం లేదా వెండితో తయారుచేసిన నల్ల పూసల బ్రేస్‌లెట్స్‌కు అదృష్ట రత్నం, తమ పేరు లేదా భర్త పేరులోని మొదటి అక్షరం, చిన్న చిన్న బుట్టలు, మువ్వలు, లవ్‌ సింబల్‌, నచ్చిన బొమ్మలను జతచేయించుకుని మురిసిపోతున్నారు అమ్మాయిలు. నల్లపూసలు కూర్చి రెండు, మూడు వరుసలతో తీర్చిదిద్దిన స్టయిలిష్‌ బ్రేస్‌లెట్స్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

సంప్రదాయికంగా

అన్ని ఆభరణాల్లాగే బ్రేస్‌లెట్‌కూ ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు నేటి మహిళలు. మెడలో ధరించిన హారం లేదా నెక్లెస్‌, చెవులకు పెట్టుకున్న జుంకాలు, వేళ్ల ఉంగరాలతో మ్యాచ్‌ అయ్యే డిజైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు, బీడ్స్‌, క్రిస్టల్స్‌తో రూపొందించిన బ్రేస్‌లెట్స్‌ను యువతులు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. చిన్న ముత్యాలతో రూపొందించిన మల్టీ లేయర్‌ బ్రేస్‌లెట్స్‌కు ప్రస్తుతం డిమాండ్‌ అధికంగా ఉంది.

ఆధునికంగా

జీన్స్‌, టీ షర్ట్‌లు, స్కర్టుల మీద సూటయ్యేలా ఊలు దారాలతో తయారుచేసిన డిజైన్లకు కూడా అధికంగా ఆదరణ లభిస్తోంది. నాలుగైదు వరుసల్లో చేతికి నిండుదనాన్నిచ్చే సరికొత్త బ్రేస్‌లెట్స్‌... అన్ని వర్గాలవారినీ ఆకర్షిస్తున్నాయి. డ్రస్‌ స్టయిల్‌కు తగ్గట్టు.. దారాల అల్లికల మధ్య గవ్వలు, రంగురంగుల పూసలు, ఒకప్పటి నాణేలు, మెరిసే రాళ్లు కూర్చిన బ్రేస్‌లెట్స్‌ను ధరించడం ఫ్యాషన్‌గా మారింది. చిన్న పార్టీలు, వేడుకల్లో పూల డిజైన్లతో కూడిన కఫ్‌ బ్రేస్‌లెట్స్‌ ధరించి యువతులు, మధ్య వయసు మహిళలు సందడి చేస్తున్నారు.


ఆరోగ్యానికి కూడా

చేతి మణికట్టుకు పెట్టుకునే బ్రేస్‌లెట్‌ అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాగి తీగలతో తయారుచేసిన బ్రేస్‌లెట్‌ పెట్టుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ తీరు మెరుగుపడుతుంది. వెండి బ్రేస్‌లెట్‌ పెట్టుకుంటే మానసిక ఆందోళన తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బంగారు బ్రేస్‌లెట్‌ పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. చేతికి ఎలాంటి బ్రేస్‌లెట్‌ పెట్టుకున్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆక్యుప్రెషర్‌ పాయింట్లు ఉత్తేజితమై గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2025 | 05:20 AM