Kalamkari Fashion: కలంకారీకి కొత్త హంగులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 08:30 AM
మాది నూజివీడు. చిన్నప్పుడే మచిలీపట్నం వలసొచ్చేశాం. నాన్న ఆరోగ్యం దెబ్బ తినడంతో కుటుంబ పోషణ భారం నా మీద పడింది. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రభలో టైపిస్ట్‌గా పని చేశాను. ఆ సమయంలో దుస్తులు కుట్టించుకోవడం కోసం పెడన వెళ్లి నచ్చిన కలంకారీ వస్త్రాలను తెచ్చుకునేదాన్ని.
కలంకారీ తయారీ ప్రక్రియ తెలిసిన కళాకారులకు వ్యాపారాలు, విక్రయాలు తెలియవు. విక్రయిస్తూ వ్యాపారం చేసేవారికి కలంకారీ తయారీ ప్రక్రియ తెలియదు. ఈ రెండూ తెలిసిన అరుదైన మహిళే, మచిలీపట్నానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మీ మనోజ్ఞ (Laxmi Manojna). కలంకారీ కళకు (Kalamkari Fashion) కొత్త హంగులు జోడిస్తూ లెగ్గింగ్స్, బ్లౌజులతో (Ethnic wear) వినూత్న ఆదరణ పొందుతున్న మనోజ్ఞతో నవ్య మాటా మంతీ...
మాది నూజివీడు. చిన్నప్పుడే మచిలీపట్నం వలసొచ్చేశాం. నాన్న ఆరోగ్యం దెబ్బ తినడంతో కుటుంబ పోషణ భారం నా మీద పడింది. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రభలో టైపిస్ట్‌గా పని చేశాను. ఆ సమయంలో దుస్తులు కుట్టించుకోవడం కోసం పెడన వెళ్లి నచ్చిన కలంకారీ వస్త్రాలను తెచ్చుకునేదాన్ని. ఆ వస్త్రాల్లో ఉండే సౌకర్యం, తయారీ ప్రక్రియలు నాకెంతో బాగా నచ్చేశాయి. నాక్కూడా ఆ వస్త్రాలతో ప్రయోగాలు చేయాలనే కోరిక బలంగా ఉండేది. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించలేదు.
2009లో పెళ్లయింది. మా దంపతులిద్దరి లక్ష్యాలు ఒకటే కావడంతో, మా ఆలోచనలు కూడా కలిశాయి. అప్పటికే ఆయన కూడా వ్యాపారంలో నష్టపోయి ఉన్నారు. టైపిస్ట్ ఉద్యోగంతో, అదనపు పనివేళలతో నేను కూడా విసిగిపోయి ఉన్నాను. దాంతో ఇద్దరం కొత్త వ్యాపార మార్గంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాం. అప్పట్లో కలంకారీ (Kalamkari) కర్చీఫ్స్ తయారవుతూ ఉండేవి. కాబట్టి వాటిని కొనుక్కొచ్చి, ప్లెయిన్ చీరల మీద కర్చీఫ్ డిజైన్లు కట్ చేసి అప్లిక్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. బొటిక్స్‌కు సప్లై చేసినా ఆదరణ అంతంత మాత్రంగానే ఉండడంతో, పెడనలో ఎవరి దగ్గరైతే ప్రింటింగ్ వేయించుకున్నామో, వాళ్లకే రెడీమేడ్ ప్యాక్స్‌ను అందజేశాం! ఆ ప్యాచ్‌వర్క్స్ రెండేళ్ల పాటు చాలా బాగా అమ్ముడైపోయాయి. ఆ తర్వాత వాళ్లు మాకు ముడిసరుకు ఇవ్వడం మానేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అలా మొదటిసారిగా ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టవలసిన పరిస్థితి తలెత్తింది.
క్రెడిట్ అంతా మా వారిదే!
ఇద్దరు మాస్టర్లను తీసుకొచ్చి, జాగా వెతుక్కుని ఉత్పత్తి మొదలుపెట్టాం. కానీ ఆ మాస్టర్లు మెలకువలను వివరించేవారు కాదు. అనుభవం లేని వాళ్లు ప్రింట్లు తప్పుగా గుద్దేసేవారు. అలాంటి వాటితో సంచులు కుట్టించి, అప్లిక్స్ అంటించి లేపాక్షిలో విక్రయించడం మొదలుపెట్టాను. పెడన నుంచి కూడా కొనుగోళ్లు జరిగాయి. అలా మాస్టర్లతో పలు విధాలుగా ముప్పుతిప్పలు పడిన తర్వాత, దంపతులిద్దరం, కలంకారీ లోతుపాతులను నిశితంగా పరిశీలించి, ప్రయోగపూర్వకంగా నేర్చుకున్నాం. నిజానికి ఈ క్రెడిట్ మొత్తం మా వారు సబ్బిశెట్టి నవీన్ కుమార్‌కే దక్కాలి. క్లిష్టమైన పరిస్థితి తలెత్తిన ప్రతిసారీ, కొత్తగా ఏం చేయొచ్చని మాత్రమే నేను ఆలోచించేదాన్ని. ఆ కొత్త ఆలోచనకు కార్యరూపమిచ్చి, ఉత్పత్తిని మార్కెట్‌కు చేరువ చేయడంలో మా వారి కృషి ఎంతో ఉంది.
అలా అసలైన కలంకారీ ఉత్పత్తిలో అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత మరొక పెద్ద సమస్య తలెత్తింది. నాణ్యతలో రాజీ పడకుండా తయారుచేసినా, పెడనతో పోల్చి మమ్మల్ని నీరుగార్చేవాళ్లు పెరిగిపోయారు. చివరకు దంపతులిద్దరం హైదరాబాద్‌లో షోరూమ్ పెట్టాలని నిర్ణయించుకున్నాం! అలా 2019లో ఇద్దరు పిల్లలతో సహా హైదరాబాద్ వచ్చేశాం! షోరూమ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం. అదే సమయంలో కొవిడ్ మొదలై, రెండోసారి మా వ్యాపారానికి గండి పడింది. దాంతో మచిలీపట్నం తిరుగుముఖం పట్టి, అక్కడి సొంత ఇంట్లోనే పనులు మొదలుపెట్టేశాం. కానీ పాత ప్రదేశంలో తిరిగి పాత సమస్యే ఎదురైంది. అక్కడి ధరలతో సమానంగా అమ్మలేం! ధరలు పెంచి అమ్మే పరిస్థితి కూడా లేదు. దాంతో ఎప్పటి నుంచో ఉన్న నా పాత ఆలోచనను మళ్లీ మా వారి ముందు ఉంచాను. అలా పుట్టుకొచ్చినవే... లైక్రా లెగ్గింగ్స్, బ్లౌజెస్.
లైక్రా బ్లౌజులు భేష్
సాధారణంగా వేసవిలో చీరకట్టుతో ఏదైనా వేడుకకు వెళ్తే, ఇంటికొచ్చి బ్లౌజ్ విప్పే వరకూ ఎంతో చికాకుగా ఉంటుంది. ఈ ఇబ్బంది లైక్రా బ్లౌజులతో ఉండదనిపించింది. కరక్కాయ, పాల మిశ్రమంలో ముంచి తయారుచేస్తున్న లెగ్గింగ్స్ ఎంత మృదువుగా, సుతిమెత్తగా, సౌకర్యంగా ఉన్నాయో బ్లౌజులు కూడా అలాగే ఉండాలని ఆలోచించాను. అలాగే మిగతా బ్లౌజుల్లాగే ఒంటికి హత్తుకుపోయి, ముడతలు లేకుండా ఉండడం కోసం ఎంతో కష్టపడ్డాను. లైక్రా కలంకారీ లెగ్గింగ్స్‌తో పాటు బ్లౌజులు సూపర్‌హిట్ అవడంతో, 2023లో మళ్లీ హైదరాబాద్ వచ్చేసి, కూకట్‌పల్లిలో స్టోర్ తెరిచాను. నేను తయారుచేసిన బ్లౌజులకు గిరాకీ పెరగడానికి పలు కారణాలున్నాయి. స్థూలకాయులు, బ్లౌజులు వేసుకునే అలవాటు లేనివాళ్లు సాధారణ బ్లౌజ్‌లు ధరించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే గుండె జబ్బులున్న వాళ్లు కూడా బిగదీసినట్టుండే సాధారణ బ్లౌజులతో అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. వీళ్లందరికీ నా బ్లౌజులు ఒక వరంలా పని చేశాయి.
నాణ్యతే ప్రధానంగా...
ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు విజయవాడలో ‘మానవ్’ కలంకారీ షోరూమ్స్ ఉన్నాయి. త్వరలో విశాఖపట్నంలో కూడా షోరూమ్ రాబోతోంది. బెంగుళూరు, చెన్నైల్లో కూడా షోరూమ్స్ ప్రారంభించాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం నా దగ్గర 200 మంది కళాకారులు పని చేస్తున్నారు. అద్దకం పని పూర్తిగా మహిళలదే! ప్రస్తుతం నా దగ్గర కలంకారీ టాప్స్, కాడ్ సెట్స్, లైక్రా లెగ్గింగ్స్, బ్లౌజెస్, టీషర్ట్స్, ఫ్రాక్స్, చీరలు తయారవుతున్నాయి. నైట్‌వేర్ తయారుచేయాలనే ఆలోచన కూడా ఉంది. స్ర్కీన్ ప్రింట్లకు గిరాకీ పెరుగుతోంది కాబట్టి మేం కూడా ఈ ప్రింట్స్ వేస్తున్నాం. కానీ నాణ్యత కోసం కరక్కాయ పొడి, పాలు ఉపయోగించడంతో పాటు తప్పనిసరిగా రెండు సహజసిద్ధ రంగులను కూడా ఉపయోగిస్తున్నాం. కృత్రిమ రంగు వేసినా, రసాయనాల ప్రభావంతో చర్మం దెబ్బతినకుండా ఉండడం కోసం రంగు వేసిన వస్త్రాన్ని బాయిల్ చేసిన తర్వాతే మార్కెట్‌లో ప్రవేశపెడుతూ ఉంటాం.
అసలైన కలంకారీ అదే!
రామాయణ, భాగవతాలను కలంతో బొమ్మలుగా గీసుకుని, సహజసిద్ధ రంగులు అద్దే పనితనమే కలంకారీ. కానీ ఇలాంటి అసలైన కలంకారీ కళ క్రమేపీ అంతరించిపోతోంది. ప్రస్తుతం స్ర్కీన్ మీద ఔట్‌లైన్ గీసుకుని, చీర మీద ప్రింట్ తీసుకుని, చేత్తో రంగులు అద్దే ప్రక్రియ పెరుగుతోంది. అలాగని స్వచ్ఛమైన కలంకారీ కళ పూర్తిగా అంతరించిపోలేదు. గిట్టుబాటు ధర చేతికందే సందర్భంలో, ప్రత్యేకించి కంచిపట్టు చీరల కోసం అసలైన కలంకారీకి పూనుకునే కళాకారులు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నారు. ఇది శ్రీకాళహస్తి పరిస్థితి.
కలంకారీకి పేరు పొందిన పెడనలో పరిస్థితి కాస్త భిన్నం. ఉడ్ బ్లాక్ మీద డిజైన్ చెక్కి, ఐదారు సహజసిద్ధ రంగుల్లో అద్ది అద్దకం వేసే కలంకారీ ప్రక్రియ ఇది. తుప్పు పట్టిన ఇనుప రేకు, బెల్లం, ఉప్పులను కలిపి ఊరబెడితే నలుపు రంగు తయారవుతుంది. అలాగే అడవుల నుంచి కొన్ని సహజరంగులు సేకరిస్తారు. జాజి ఆకు, మోదుగ పువ్వు, తుమ్మ జిగురు.. ఇలా కావలసిన రంగు కోసం పలు రకాల ప్రకృసిద్ధ ముడిపదార్థాలను ఉపయోగిస్తారు. ఇలా ముడిపదార్థాలన్నీ ఉపయోగించి ఒక చీర తయారుచేయడానికి 40 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. ఇందుకు వాతావరణం కూడా అనుకూలించాలి.
ఒక్క చీర తయారీకి 45 రోజులు
మొదట్లో లుంగీలు, తలుపు కర్టెన్లు, కర్చీఫ్స్ తయారయ్యేవి. తర్వాత దుప్పట్లు, చీరలు అందుబాటులోకొచ్చాయి. ఆ తర్వాత స్ర్కీన్ ప్రింటింగ్ చీరలు వాడుకలోకొచ్చాయి. ఇప్పటికీ వాటినే అసలైన కలంకారీ చీరలుగా నమ్ముతున్నవాళ్లున్నారు. నిజానికి కలంకారీ చీర అసలు ప్రక్రియ గురించి అందరికీ తెలియదు. రన్నింగ్ మెటీరియల్ లేదా చీర.. ఇలా కావలసిన ముడిసరుకు తెచ్చుకుని అవసరమైనంత పొడవు కత్తిరించుకుని, మూటల్లా కట్టి, 24 గంటలపాటు చెరువుల్లో చలవ చేస్తారు.
తర్వాత బిరుసు తొలిగిపోయేలా ఉతికి, ఆరబెట్టి, కరక్కాయ పొడి, పాలు కలిపి ఆ మిశ్రమంలో వస్త్రాన్ని నానబెట్టుకుంటారు. తర్వాత ఇదే వస్త్రం ప్రింట్లు పూర్తి చేసుకుని, వాషింగ్‌కు వెళ్లేవరకూ దీని మీద నీటి చుక్క పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే వస్త్రం మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలా ఆరబెట్టి సిద్ధం చేసుకున్న వస్త్రం మీద సహజసిద్ధ రంగులను అద్దుకుంటారు. తర్వాత చివర్లో అదనపు రంగులను వదిలించడం కోసం పారే నీళ్లలో మునిగేలా మోకుకు కట్టి ఉంచుతారు. ఇలా అంతిమంగా అసలు రంగులు తేలిన తర్వాత ఆరబెట్టి, దినుసులు కలిపిన నీళ్లలో మరిగించి, సెకండ్ ప్రింట్ వేసుకుని, రెండోసారి వాష్ చేసి, చివర్లో పటికలో పెడతారు. ఈ ప్రక్రియ మొత్తానికీ 45 రోజుల సమయం పడుతుంది.
-గోగుమళ్ల కవిత