Kailash Kher: సిద్ధి లేకుండా ప్రసిద్ధి చెందలేం
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:08 AM
‘భంభం భోలే...’ అంటూ ఖంగుమని మోగే కంచుకంఠం కైలాష్ ఖేర్‌ది! ‘జేజమ్మ...’, ‘వచ్చాడయ్యా సామి...’, ‘కథానాయక...’ లాంటి పాటలతో తెలుగువారికి దగ్గరయిన కైలేష్ ఖేర్ 19 భాషల్లో తన గానాన్ని వినిపిస్తున్నారు. ఆయన ఆత్మకథ ‘తేరీ దివానీ’ ఇటీవల విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూ... చాలా మంది జీవితంలో చివరి దశలోనే ఆత్మకథలు రాస్తారు... మీరు ఇప్పుడే రాయటానికి కారణాలేమిటి?

నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తి జీవితం ఒక అందమైన కథ. దీనిలో అనేక పార్శ్వాలు ఉంటాయి. ఇవి కూడా మనల్ని అభిమానించేవారికి తెలియాలి. అయితే ఈ పార్శ్వాలను ఎంత జాగ్రత్తగా, ఎంత నిబద్ధతతో వారి దగ్గరకు తీసుకువెళ్తున్నామనేది ముఖ్యం. దీనికి మాధ్యమంగా నేను పుస్తకాన్ని ఎంచుకున్నాను. ఇక నా జీవితం సంగీతంతో ముడిపడి ఉంది. అందరికీ నేను ఒక గాయకుడిగా మాత్రమే తెలుసు. చాలాకాలంగా నా అభిమానులు నా దగ్గరకు వచ్చి ‘‘మీ పాటలు మా హృదయాన్ని తాకుతాయి. మీరు మనసు పెట్టి పాడతారు. అలా పాడటానికి వెనుక ఉన్న కారణాలేమిటి?’’ అని అడుగుతూ ఉంటారు. వారి కోసమే ‘తేరీ దివానీ’ అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను. ఒక సామాన్యుడు అసామాన్య కళాకారుడిగా ఎలా రూపుదిద్దుకున్నాడన్నదే ఈ పుస్తక కఽథ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ పుస్తక ప్రచురణకర్తల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే - మంచి పుస్తకాలు అందరి దగ్గరకు వెళ్లాలనేదే నా కోరిక. అందుకే ‘కైలాస ఎడ్వర్‌టైజింగ్’ అనే సంస్థను ఏర్పాటు చేసి ‘పెంగ్విన్’ సంస్థతో కలిపి ఈ పుస్తకాన్ని ప్రచురించాం.
పుస్తక రచన సమయంలో మీ అనుభవాలేమిటి?
మనం ప్రపంచాన్ని ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఒక ఏనుగును నలుగురు అంధులు వేరు వేరుగా చూస్తారు. వారి వారి అనుభవాలు వారికి ఉంటాయి. మనం కూడా అంతే. మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటాం. కానీ ఈ పుస్తకం రాసేటప్పుడు నాకు అనేక అనుభవాలు కలిగాయి. ఆ సమయంలో కైలాష్ కేర్ పైకి కనిపిస్తాడు. కానీ వాడి చేత రాయించేవాడు ఈశుడే! ఈ విషయం నాకు పుస్తకం రాసే సమయంలో అర్థమయింది. ఆ సమయంలో నాకు ఒక మిత్రుడు సహకరిస్తున్నాడు. ఒక రోజు మేమిద్దరం కలుసుకోవాల్సి ఉంది. కానీ తను నాకు ఫోన్ చేసి- ‘‘నేను రాలేను’’ అని చెప్పాడు.
ఎందుకో అప్పుడు నాకు - ‘క్యా సజనా... బిన్ సజనా..’ అనే రెండు మాటలు అప్రయత్నంగా వచ్చాయి. ఆ మాటల నుంచి అప్రయత్నంగా పాట పుట్టుకువచ్చింది. ఆ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఇలాంటి అనుభవాలెన్నో.
మీ ఆలోచనలు సంగీతంలో ఉంటాయా?
మాటల్లో ఉంటాయా?
నేను దేన్నీ ఆలోచించను. మనసులో వచ్చిన ఆలోచనలను ఎప్పటికప్పుడు మాటల రూపంలో పెడతానంతే! మాట్లాడినప్పుడు కూడా అంతే! అందుకే నా మాటల్లో స్పష్టత ఉంటుంది. మాటలు నది మాదిరిగా ప్రవహిస్తూ ఉంటాయి.
మన దేశంలో సినిమా సంగీతానికి ఉన్న ప్రాధాన్యత దేశీయ సంగీతానికి ఉందని మీరు అనుకుంటున్నారా?
మన దేశంలో సినిమా పాటలకు ఆదరణ ఎక్కువ. కానీ దేశీ సంగీతానికి కూడా స్థానికంగా చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన దేశంలో ప్రతి ప్రాంతానికి ఒకో ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్న సంగీతం ఇతరులు కూడా విన్నప్పుడు దానిలో ఉన్న గొప్పదనం అర్థమవుతుంది. నేను గత పదేళ్లుగా ‘భారత్‌కా అమృత్ కలశ్’ అనే రియాలిటీ షో నిర్వహిస్తున్నాను. దీనిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి వారి వేష భాషల్లో వచ్చి పాటలు పాడతారు. ఛానల్స్‌లో కూడా ఇలాంటి షోలు రావాలి. లేకపోతే వాళ్ల రియాలిటీ షోలకు ‘ఫిల్మి రియాలిటీ షో’ అని పేరు పెట్టుకోవాలి.
కైలాష్ ఖేర్ ఎప్పుడూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ కనిపిస్తారు. శుద్ధమైన హిందీలో మాట్లాడతారు. అందుకు కారణమేదైనా ఉందా?
గత కొద్దికాలంగా నేను మాట్లాడే భాషలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు నేను మామూలుగా మాట్లాడేవాడిని. ఇప్పుడు శుద్ధంగా మాట్లాడటం నేను నేర్చుకున్నాను. నేను పాటలు పాడటం మొదలుపెట్టినప్పుడు నాకు ఏమీ తెలీదు. సినిమా పాటలు, ‘చిత్రహార్’ లాంటివి తెలీదు. టీవీలో షోలు కూడాఎప్పుడూ చూడలేదు. అలాంటి నేను ఇప్పుడు 19 భాషల్లో పాడుతున్నానంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా! ఆ కారణం ఆధ్యాత్మికత. నా ఉద్దేశంలో ఆధ్యాత్మికత లేకపోతే భారత దేశం లేదు. ఇంగ్లీషు సంస్కృతి నాలుగైదు వందల సంవత్సరాల క్రితం వచ్చిందే. అంతకుముందు నుంచి ‘బతుకు...బతకనివ్వు’ అనేది మన సంస్కృతి. ‘అందరూ బావుండాలి... అందులో మనం ఉండాలి’ అనేది మన సంస్కృతి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రపంచంలో అందరూ యంత్రాలు తయారుచేస్తున్న సమయంలో మనం మంత్రాలు జపించేవాళ్లం. వాళ్లు యంత్రాలు తయారుచేసి పిచ్చి వాళ్లు అయిపోయారు. ఇప్పుడు వారు మానసిక ప్రశాంతత కోసం మన దగ్గరకు వస్తారు. అంటే మన సంస్కృతి అంత గొప్పది. అలాంటి భావనను నేను ఎప్పుడూ వదలను. కైౖలాష్ కేర్ ఎప్పుడూ మారడు. ఆధ్యాత్మికతను వదలడు.
మీతో కలిసి ఆల్బమ్స్ చేయటానికి చాలామంది ఔత్సాహికులు వస్తూ ఉంటారు.. వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి?
సిద్ధి లేకుండా ప్రసిద్ధి చెందలేం. అంటే చాలా కష్టం తర్వాతే విజయం లభిస్తుంది. దానివల్ల ప్రసిద్ధులమవుతాం. కానీ ఈ మధ్యకాలంలో సులభంగా ప్రసిద్ధి చెందాలనే ఆలోచన చాలామందిలో కనిపిస్తోంది. మనల్ని ఇష్టపడే అభిమానుల సంఖ్య క్రమంగా పెరగాలి. అంతేతప్ప ఒకేసారి లక్షలమంది రావాలనుకోకూడదు. ఒక పాట హిట్ అయిన వెంటనే ప్రపంచాన్ని జయించామని అనుకోకూడదు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.