Share News

Jesus Miracles: ప్రభువు పాదాలపై శతాధిపతి

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:54 AM

ఏసు ప్రభువు ఒక ఊరిలో ప్రజలకు బోధ చేస్తున్నాడు. ఆయనను కనులారా చూసేందుకు జన సందోహం ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో చేరుకుంది. ఆయన చెబుతున్న మాటలను అందరూ ఆసక్తిగా...

Jesus Miracles: ప్రభువు పాదాలపై శతాధిపతి

దైవమార్గం

ఏసు ప్రభువు ఒక ఊరిలో ప్రజలకు బోధ చేస్తున్నాడు. ఆయనను కనులారా చూసేందుకు జన సందోహం ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో చేరుకుంది. ఆయన చెబుతున్న మాటలను అందరూ ఆసక్తిగా వింటున్నారు. కాసేపటికి ఒక శతాధిపతి అక్కడికి వచ్చాడు. రోమన్‌ సామ్రాజ్యంలో సైనికాధికారులకు అపరిమితమైన అధికారాలు ఉండేవి. ఆ సామ్రాజ్యానికి, దాని అధినేతకు రక్షణ అందించే బాధ్యతలను ఆ శతాధిపతి నిర్వహిస్తున్నాడు. ‘ఇతను ఇక్కడికెందుకు వచ్చాడు?’ అని జనం గుసగుసలాడుకుంటున్నారు, భయపడుతున్నారు కూడా. కానీ ఆ శతాధిపతి నేరుగా ఏసు క్రీస్తు కాళ్ళముందు శిరసు వంచి మోకరిల్లడంతో వారు విస్మయం చెందారు. ‘ఇతను అహాన్ని విడిచి ఇలా చేస్తున్నాడంటే... ఈ వినయ విధేయతల వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. క్రీస్తుతో ఏ పని ఉండి వచ్చాడో?’ అనుకున్నారు.

ఇంతలో ఆ శతాధిపతి ‘‘ప్రభూ! నా కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. అతణ్ణి బతికించు. నీ దర్శన భాగ్యానికి నా ఇల్లు నోచుకోలేదేమో. నీవు అక్కడికి రానక్కరలేదు. ఒక మాట పలికితే చాలు... నా కుమారుడు స్వస్థత పొందుతాడు’’ అని వేడుకున్నాడు.

అప్పుడు ఏసు ‘‘నీ విశ్వాసమే నిన్ను కాపాడుగాక. నీ కుమారుడు బతికే ఉన్నాడు, వెళ్ళు’’ అన్నాడు.


ఆ రోమన్‌ సైన్య శతాధిపతి కళ్ళు చెమర్చాయి. అంతకుపూర్వమే క్రీస్తు చేస్తున్న అద్భుతాలను అతను విన్నాడు. ఆయన కృపతో తన కుమారుడికి నయం కాగలదనే నమ్మకంతో క్రీస్తు దగ్గరకు వచ్చాడు. క్రీస్తు మాటలు వినగానే... ప్రభువు తనను అనుగ్రహించాడని, ఆయన వాక్కు వ్యర్థం కాదని నమ్మి, వెనుతిరిగాడు.

అతను ఊహించినదే జరిగింది. ప్రభువు వాక్కు ఫలించింది. అతని ఇంటి నుంచి బయలుదేరిన సైనికులు మార్గమధ్యంలోనే అతణ్ణి కలిశారు. ‘‘మీ అబ్బాయి స్వస్థత పొందాడు. లేచి కూర్చున్నాడు’’ అంటూ శుభవార్త అందించారు. కోరుకున్న ఫలితం దక్కడంతో అతను సంతృప్తిగా వెనుతిరిగాడు.

విశ్వాసంతో ప్రార్థిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుందనీ, దానికి తరతమ భేదాలు ఉండవనీ స్పష్టం చేసే ఉదాహరణగా ఈ కథను పేర్కొంటారు. ‘నీవు పలికితే చాలు, నా కుమారుడు బతికిపోతాడు’ అనే మాట చిన్నది కాదు. చాలా ముఖ్యమైన మాట. విశ్వాసానికి పరాకాష్ట అయిన మాట. అందుకే రోమన్‌ క్యాథలిక్‌లు తమ దైనందిన ఆరాధనలో ఈ వాక్యాన్ని కూడా పఠిస్తారు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 04:55 AM