Jeremiah The Prophet: విలాప ప్రవక్త
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:12 AM
దేవుడు కంటికి కనిపించకపోవచ్చు. ప్రత్యక్షంగా కాకపోయినా ఏదో ఒక రూపంలో చేయాల్సిన సాయం చేస్తాడు. దారి తప్పిన ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి కొందరు వ్యక్తులను ఆయన ఎంచుకుంటాడు. వారిని ప్రజల మధ్యకు..
దైవమార్గం
దేవుడు కంటికి కనిపించకపోవచ్చు. ప్రత్యక్షంగా కాకపోయినా ఏదో ఒక రూపంలో చేయాల్సిన సాయం చేస్తాడు. దారి తప్పిన ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి కొందరు వ్యక్తులను ఆయన ఎంచుకుంటాడు. వారిని ప్రజల మధ్యకు పంపుతాడు. వారే ప్రవక్తలు. అటువంటి ప్రవక్తలలో యిర్మియా ఒకరు.
‘నేను ఎందుకూ పనికిరాను’ అనే భావనలో ఉన్న యిర్మియాను దేవుడు తన పరిచర్యకు ఎంపిక చేసుకున్నాడు. ‘‘నీవు నావాడవు. నీకు భయం లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను పేరు పెట్టి పిలువగలిగిన వాడిని. నీ దేవుణ్ణి’’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుని సేవకే అంకితమైన కుటుంబానికి చెందినవాడు యిర్మియా. ఆయనది బన్యామీను దేశం. అప్పటికే ఇజ్రాయిల్ దేశాన్ని బాబిలోనియన్లు ఆక్రమించేశారు. ‘‘మీ దేశం మీకు తిరిగి వచ్చేలా చేస్తాను’’ అని ఇజ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట నెరవేరడం కోసం... అక్కడి ప్రజలు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనేలా చేయాలని అనుకున్నాడు. అందుకు మధ్యవర్తిగా యిర్మియాను వారి దగ్గరకు పంపించాడు. ఇది క్రీస్తుపూర్వం 700 నాటి సంగతి.
దైవాదేశాన్ని అందుకున్న యిర్మియా... ఇజ్రాయేలీయులను కలుసుకున్నాడు. దుష్కార్యాలను, విగ్రహారాధనను మానుకోవాలని హితవు చెప్పాడు. రాబోయే విపత్తుల గురించి సూచించి హెచ్చరించాడు. కానీ ఇజ్రాయేలీయులు ఆయన మాటలు పట్టించుకోలేదు. విగ్రహాలను ఆరాధించడానికే ఇష్టపడ్డారు. వ్యక్తుల చెడు నడతను బట్టి వారిని యెహోవా శిక్షిస్తాడని యిర్మియా చెప్పినప్పుడు... వారు నవ్వి, ఆయనపై రాళ్ళు రువ్వారు. హింసించారు. ‘యిర్మియా మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి అతణ్ణి చంపాలి’ అని నిర్ణయించుకున్నారు. కానీ యిర్మియా ఎలాంటి జంకూ లేకుండా... దేవుని ఆదేశాన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోయాడు. ఇజ్రాయేలీయులు తమ చెడు మార్గాలను మార్చుకోకపోవడంతో... దుర్దశవైపు వెళ్తున్న ఆ ప్రజల కోసం ఆయన విలపించాడు. అందుకే ఆయనను ‘విలాప ప్రవక్త’ అని పిలుస్తారు. పెద్దల మాటను అనుసరించి, వారు అందించిన నైతిక విలువలను పాటించకపోతే వినాశనం తథ్యం. యిర్మియా చెప్పిన మంచిని తిరస్కరించిన ఆ ప్రజలు... పర రాజ పాలనకు దాసులై, వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఇవి కూడా చదవండి
ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..
రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..