Janvi Jindals 11 Guinness World Records: యూట్యూబే గురువు 11 గిన్నిస్ రికార్డులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:50 AM
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 11 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది చండీగఢ్‌కు చెందిన జాన్వి జిందాల్. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫ్లీస్టైల్ స్కేటింగ్ మీద పట్టు పెంచుకున్న...
విజేత
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 11 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది చండీగఢ్‌కు చెందిన జాన్వి జిందాల్. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫ్లీస్టైల్ స్కేటింగ్ మీద పట్టు పెంచుకున్న 17 ఏళ్ల జాన్వి గురించిన ఆసక్తికరమైన కథ ఇది.
ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో 19 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న భారతీయుడిగా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ పేరు పొందారు. ఇప్పుడు ఆయన తర్వాతి స్థానాన్ని జాన్వి జిందాల్ దక్కించుకుంది. మునుపు 5 గిన్నిస్ ప్రపంచ రికార్డులను కలిగి ఉన్న జాన్వి, తాజాగా మరో ఆరు కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. 30 సెకన్ల ఇన్‌లైన్ స్కేట్స్‌లో అధిక 360 డిగ్రీల భ్రమణాలు, ఒక నిమిషంలో అత్యధిక 360 డిగ్రీల భ్రమణాలు, 30 సెకన్లలో అత్యధిక వన్ వీల్‌డ్ 360 డిగ్రీల భ్రమణాలు.. ఇలా మొత్తం ఆరు కొత్త రికార్డులతో అతి పిన్న వయసులో, అత్యధిక గిన్నిస్ రికార్డులు దక్కించుకున్న తొలి భారత మహిళగా జాన్వి గుర్తింపు తెచ్చుకుంది. చండీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న జాన్వి, ఆన్‌లైన్ వీడియోల ద్వారా, తండ్రి మార్గదర్శకత్వంలో ఫ్రీస్టైల్ స్కేటింగ్ మీద పట్టు పెంచుకుంది. జాతీయ స్కేటింగ్ పోటీలో ఇప్పటికే మూడు స్వర్ణ, రెండు కాంస్య, రెండు రజత పతకాలు గెలుచుకున్న జాన్వి జాతీయ పోటీల కోసం సన్నద్ధమవుతోంది.
ఆసక్తి మొదలైందిలా...
కుస్తీ పోటీలకు స్వయంగా శిక్షణ ఇచ్చి, అంతర్జాతీయ వేదికల మీద కూతుళ్లను గెలిపించుకున్న తండ్రీకూతుళ్ల కథ... దంగల్ సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పొందిందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇదే సినిమా ఎంతోమందికి క్రీడల పట్ల ఆసక్తిని కూడా పెంచింది. జాన్వి తండ్రిని కూడా ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంది. తాను కూడా కూతుర్ని క్రీడలకు సంసిద్ధం చేయాలని నిర్ణయించుకున్న తండ్రి మునిష్ జిందాల్, జాన్వికి 8 ఏళ్ల వయసు నుంచే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. 8వ ఏట జాన్వి, రివర్ జంపింగ్‌లో భాగంగా 30 అడుగుల ఎత్తు నుంచి ఏకంగా మూడుసార్లు దూకి, తన క్రీడా ప్రతిభను చాటుకుంది. సాటి పిల్లలు వెనకడుగు వేసే ఆ విన్యాసంతో జాన్వి తనలోని ధైర్యాన్నీ, క్రీడాస్ఫూర్తినీ చాటుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఫ్రీస్టైల్ స్కేటింగ్ పట్ల తనకు మక్కువ ఏర్పడినట్టు గ్రహించి, ఎటువంటి అనుభవజ్ఞుల దగ్గర శిక్షణ తీసుకోకుండానే, కేవలం యూట్యూబ్ వీడియోల ద్వారా ఆ క్రీడలో నైపుణ్యం సాధించి, ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. ఆమె అసాధారనమైన క్రీడా ప్రయాణం గురించి తండ్రి, మునిష్ మాట్లాడుతూ... ‘ఎటువంటి శిక్షణ, ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్థోమతా లేకుండానే మా అమ్మాయి క్రీడలో సత్తా చాటుకుని, ఆఽధునిక భారతదేశపు చిహ్నంగా మారింది. మక్కువ ఉన్నవాళ్లెవరికైనా నేడు జ్ఞానసముపార్జనకు సరిహద్దులు ఉండవనడానికి మా అమ్మాయే ఉదాహరణ. జాన్వి ఇంటర్నెట్‌నే వ్యక్తిగత కోచింగ్ అకాడమీగా మలుచుకుంది. దాన్నుంచే మెలకువలు నేర్చుకుని, సాధనతో ఈ స్థాయికి ఎదగగలిగింది’ అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు.
మరిన్ని పతకాలు తెచ్చేస్తా...
జాన్వి, తాను సాధించిన విజయం గురించి మాట్లాడుతూ...‘మరిన్ని రికార్డులు నెలకొల్పి ఎటువంటి వనరులూ, మద్దతూ లేకపోయినా, కలలను నిజం చేసుకోవాలనుకునే యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా మారాలనుకుంటున్నాను. ఇతరులకు ప్రేరణగా మారడం కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని, నా ప్రయాణాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. జాతీయ స్కేటింగ్ పోటీలకు ప్రొఫెషనల్ కోచింగ్, బలమైన మద్దతు వ్యవస్థలు అవసరం. వాటితో నా దేశానికి మరిన్ని పతకాలు తెచ్చిపెట్టగలుగుతాననే నమ్మకం నాకుంది’ అంటోంది జాన్వి జిందాల్. భటిండాలోని రాంపురా ఫూల్ ప్రాంతానికి చెందిన జాన్వి తండ్రి, మునిష్ జిందాల్ మాట్లాడుతూ....‘నాతో పాటు దేశం గర్వించదగిన విజయమిది. 17 ఏళ్ల వయసులోనే మా అమ్మాయి, 11 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించిన ఏకైక యువతిగా చరిత్ర సృష్టించింది. మున్ముందు జాన్వి మరిన్ని రికార్డులు నెలకొల్పగలుగుతుందని భావిస్తున్నా’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ