Share News

Cervical Cancer: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ప్రాణాంతకమా

ABN , Publish Date - Jul 10 , 2025 | 02:29 AM

డాక్టర్‌ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ గురించి ఎన్నో ఉదంతాలు వింటున్నాం. ఈ క్యాన్సర్‌ను ముందుగానే ఎలా పసిగట్టాలి? ఈ వ్యాధి సోకకుండా ఏదైనా వ్యాక్సీన్‌ ఉందా?...

Cervical Cancer: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ప్రాణాంతకమా

కౌన్సెలింగ్‌

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ప్రాణాంతకమా?

డాక్టర్‌ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ గురించి ఎన్నో ఉదంతాలు వింటున్నాం. ఈ క్యాన్సర్‌ను ముందుగానే ఎలా పసిగట్టాలి?

ఈ వ్యాధి సోకకుండా ఏదైనా వ్యాక్సీన్‌ ఉందా?

ఓ సోదరి, హైదరాబాద్‌

క్యాన్సర్‌ అనగానే ఇక చావు దగ్గర పడిందనే నిర్థారణకొస్తాం. కానీ నిజానికి మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్‌తో పోలిస్తే, సర్వైకల్‌ క్యాన్సర్‌ను కనిపెట్టడం, చికిత్స చేయడం తేలిక. రొమ్ము క్యాన్సర్‌ పక్కదారి పట్టిస్తుంది. ఆలస్యంగా, చివరి దశలో కనిపెట్టినప్పుడు చికిత్స క్లిష్టమై ప్రాణాంతకంగా మారుతూ ఉంటుంది. కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పూర్తి భిన్నం.

లక్షణాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తొలి దశలో లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. తర్వాతి దశల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే....

  • నెలసరి మధ్యలో, నెలసరి తర్వాత, శారీరక కలయిక సందర్భంలో యోని నుంచి రక్తస్రావం కనిపిస్తుంది.

  • నీరు, రక్తంతో కూడిన స్రావాలు కనిపిస్తాయి. ఎక్కువగా విడుదలయ్యే ఆ స్రావాల నుంచి దుర్వాసన వెలువడుతుంది.

  • నడుము నొప్పి, అసౌకర్యం ఉంటుంది.


కారణాలు

గతంతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందుకు పర్యావరణ మార్పులు, ఆహార, జీవనశైలి మార్పులు ప్రధాన కారణాలు. అయితే ఈ రకమైన క్యాన్సర్‌ సోకడానికి కచ్చితమైన కారణాన్ని కనిపెట్టలేకపోయినా, ఈ క్యాన్సర్‌ వృద్ధిలో హెచ్‌పివి (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) పాత్ర ప్రధానంగా ఉంటున్నట్టు నిర్థారణ అయింది. అయితే ఈ వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరూ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు గురి కాకపోయినా, కొందర్లో ఆ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సర్వైకల్‌ క్యాన్సర్‌గా వృద్ధి చెందుతోంది. ఇందుకు కారణం పర్యావరణ, జీవనశైలి, ఆహారశైలిల్లో చోటు చేసుకున్న మార్పులు అందుకు తోడవడమే! ఈ కారణాలతో పాటు సర్వైకల్‌ క్యాన్సర్‌కు మరికొన్ని కారణాలు దోహదపడతాయి. అవేంటంటే...

  • ఒకటికి మించి లైంగిక సంబంధాలు: ఎన్ని ఎక్కువ లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

  • లైంగిక వ్యాధులు: క్లమీడియా, గనేరియా, సిఫిలిస్‌, హెఐవి ఇన్‌ఫెక్షన్‌ హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలను పెంచుతాయి.

పరీక్షలు కీలకం

  • పాప్‌స్మియర్‌ టెస్ట్‌: ఈ పరీక్షతో సర్విక్స్‌లోని కణాలు, వాటిలో చోటు చేసుకుంటున్న మార్పులు, సర్వైకల్‌ క్యాన్సర్‌ దారితీసే అవకాశాలను కనిపెట్టవచ్చు. లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి మహిళా ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. వరుసగా మూడేళ్ల పాటు పరీక్ష ఫలితం నెగటివ్‌ వస్తే, అప్పటి నుంచి ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది.

  • హెచ్‌పివి డిఎన్‌ఎ టెస్ట్‌: లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి మహిళా ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. ఫలితం నెగటివ్‌ వస్తే, అప్పటి నుంచి ఐదేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది.

హెచ్‌పివి వ్యాక్సిన్‌

సర్వైకల్‌ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హెచ్‌పివి వైర్‌సకు అడ్డుకట్ట వేసే వ్యాక్సీన్‌ ఇది. 9 ఏళ్లు మొదలు 45 ఏళ్ల లోపు మహిళలు ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

డాక్టర్‌ సచిన్‌ మర్ద

ఆంకాలజిస్ట్‌, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 02:29 AM