మహిళలు ఆధ్యాత్మిక నాయకులు కావాలంటే...
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:14 AM
ఆధ్యాత్మిక మార్గాన్ని మహిళలు ఎందుకు ఎంచుకోవాలి? తనను తాను పూర్తిగా తెలుసుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, స్వీయ నియంత్రణలో ఉండడానికీ....

ఆధ్యాత్మిక మార్గాన్ని మహిళలు ఎందుకు ఎంచుకోవాలి? తనను తాను పూర్తిగా తెలుసుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, స్వీయ నియంత్రణలో ఉండడానికీ అని భావించవచ్చు. తన అస్థిత్వాన్ని గుర్తించడం అనేది ఎవరికైనా ప్రధానం. ఆధిపత్యం, అణచివేతల నుంచి విముక్తి పొందడం, వేరొకరి సంతోషం కోసమో, మెప్పుకోసమో మనం జీవించనవసరం లేని స్థితికి చేరడం, పరిపూర్ణత, స్వతంత్రత సాధించడం... ఇదే ఆధ్యాత్మిక శక్తి, అదే మనలోని అసలైన శక్తి. దాదాపు గత రెడువేల ఏళ్ళకు పైగా మహిళలు తమ ఆధ్యాత్మిక శక్తిని పూర్తిగా ఉపయోగించుకోలేదు. అన్ని మత సంప్రదాయాలు మహిళలను సంకేత రూపంలో తీసుకున్నాయి. ఒకవైపు వారిని పీఠాలపై ఉంచి పూజిస్తారు. మరోవైపు మతపరమైన ఆచారాల నుంచి వారిని మినహాయించారు. కొన్నిచోట్ల ప్రార్థనా స్థలాల్లో ప్రవేశించకుండా నిషేధించారు. మహిళలను ఉన్నతంగా చూసినా, వివక్ష చూపినా... ఎప్పుడూ వారిని పురుషులతో సమానంగా పరిగణించకపోవడం అనేది ప్రధాన సమస్య. ఆధ్యాత్మిక నాయకులుగా, ఆధ్యాత్మిక అన్వేషకులుగా సమానత్వం లేకపోవడానికి మూలాలు సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలలో ఉన్నాయి.
అవి బలహీనతలు కావు...
మహిళలు ఆధ్యాత్మిక నాయకులు కావాలంటే... అటువంటి పాత్ర పోషించే సామర్థ్యం, అవసరమైన లక్షణాలు తమకు ఉన్నాయని వారు స్వయంగా అంగీకరించాలి. అనర్హమైన భావాలు, వైఖరుల నుంచి దూరంగా వెళ్ళడానికి, తనలోనే ఉన్న గొప్పతనాన్ని గుర్తించడానికి వారి చైతన్యంలో మార్పు అవసరం. ప్రేమ, సహనం, కరుణ, అవగాహన, వినయం లాంటివి స్త్రీ లక్షణాలు. అవి ఆధ్యాత్మికమైన పురోగతికి కూడా అవసరం. ఎందుకంటే ఇవి లేకుండా భగవంతుడికి దగ్గర కావడం, స్వీయ సాక్షాత్కారం పొందడం అసాధ్యం. ప్రతి మానవుడిలో ఈ లక్షణాలు ఉంటాయి. కానీ మహిళలు వాటిని సులభంగా పొందగలరు. ఎందుకంటే ప్రేమ, భక్తి భావాలు వారిలో సహజంగానే ఉంటాయి, అవి క్రమశిక్షణతో, వ్యవస్థీకృతంగా ఉంటాయి. వారు నాయకత్వానికి ఉదాహరణగా నిలుస్తారు. సేవ చేయడం, నిస్వార్థంగా ఏదైనా ఇవ్వడం ఎలాగనేది వారికి తెలుసు. సేవ చేయడం, ఇతరుల పట్ల వినయంగా ఉండడం, నమస్కరించడం అనేవి బలహీనతలుగా పరిగణించేవారూ ఉన్నారు. కానీ అవి బలహీనతలు కావు. నిజమైన వినయంతో ఇతరులకు నమస్కరించే సామర్థ్యం... అహంకారాన్ని జయించిన ఆత్మ గొప్పతనానికి సంకేతం. అయితే ధైర్యం, సంకల్పం, స్పష్టమైన ఆలోచన, ఆత్మగౌరవం లాంటి లక్షణాలతో ఈ గుణం సమతుల్యం కావాలి.
ఆత్మగౌరవంతోనే సాధ్యం
ఇతరులకు సేవ చేయడంలో, వేరే బాధ్యతల్లో మునిగిన మహిళలు తమ సొంత ఆధ్యాత్మిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. వారు తమనుతాము తక్కువ చేసుకోవడానికి, వారిలో ఆధ్యాత్మిక శక్తి లేకపోవడానికి కారణాల్లో ఇదొకటి. వారి ఆలోచనా ధోరణిలో, వివేకంలో వచ్చే మార్పు రావాలి. ఆధ్యాత్మిక నాయకత్వాన్ని మహిళలు స్వీకరించడానికి అదే పునాది. ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే... మహిళలు తాము ఆధ్యాత్మిక నాయకులుగా మారకుండా నిరోధించే శారీరకమైన మతపరమైన సామాజికమైన అడ్డంకులను అధిగమించగలరు. ఆత్మగౌరవం అనే లక్షణం సామాజిక, సాంస్కృతిక, శారీరక గుర్తింపునకు అతీతమైన, శాశ్వతమైన స్వీయజ్ఞానం, అనుభవం నుంచి వస్తుంది. ‘ఆత్మ’ అనేది స్వచ్ఛమైనది, శాంతియుతమైనది, దైవికమైన, ఆధ్యాత్మికమైన లక్షణాలతో సంపూర్ణమైనది. మహిళలు తమలో అంతర్గతంగా ఉండే శాశ్వతమైన ఈ మూలాన్ని తాకినప్పుడు... తమకు సామర్థ్యం ఉన్న పాత్రను పోషించే ధైర్యాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక శక్తి అనేది ఆత్మ తాలూకు స్వాభావిక లక్షణాల వ్యక్తీకరణ. దీనికి లింగపరమైన, శారీరకమైన పరిమితులతో సంబంధం లేదు. తాము ఉన్నతులమనో, తక్కువవారిమనో భావించే పరిస్థితులు ఉన్న చోటే ఆధిపత్యమో, అణచివేతో సంభవిస్తాయి. ఆత్మ పట్ల ఎరుక ఉన్నప్పుడు సమానత్వ భావాలు వ్యక్తమవుతాయి. ఈ భావాలు, వైఖరులు సానుకూల ఫలితాలను ఇచ్చే చర్యల ద్వారా వ్యక్తం అవుతాయి. మహిళలు ఆధ్యాత్మిక నాయకత్వ స్థానాలను అందుకోవడానికి చాలా దూరంలో ఉన్నారు. అలాగే మహిళలు మంచి ఆధ్యాత్మిక నాయకులు అవుతారనే భావనతో సమాజం నేటికీ పూర్తిగా ఏకీభవించడంలేదు. ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఈ భావాలను విచ్ఛిన్నం చేసి, ఆదర్శప్రాయమైన నమూనాను రూపొందించేవరకూ సమాజంలో మార్పు కచ్చితంగా రాదు. అలాంటి మార్పుకోసం ‘ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం’ వ్యవస్థాపకుడు బ్రహ్మ బాబా (లేఖ్‌రాజ్ కృపలాని) చేసిన ఆలోచన నుంచి చి ‘బ్రహ్మకుమారీస్’ సంస్థ ఆవిర్భవించింది.
బ్రహ్మకుమారీస్
Also Read:
బియ్యం నీటిని పారేస్తున్నారా.. వాటితో అద్భుత ప్రయోజనాలు..
అబ్బాయిలూ ఈ టిప్స్ పాటిస్తే అమ్మాయిలు ఫిదా ..