Supriya Srivatsa Inspires: హూలా హూప్ క్వీన్
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:01 AM
ఫ్లో ఆర్ట్‌లో భాగమైన హూలా హూప్‌లో రాణిస్తూ, ఆ క్రీడను అటు వృత్తిపరంగా, ఇటు ప్రవృత్తిపరంగా రెండు విధాలా సద్వినియోగం చేసుకుంటోంది బెంగుళూరుకు చెందిన సుప్రియ శ్రీవాత్సవ. మానసిక, శారీరక...
ప్రేరణ
ఫ్లో ఆర్ట్‌లో భాగమైన హూలా హూప్‌లో రాణిస్తూ, ఆ క్రీడను అటు వృత్తిపరంగా, ఇటు ప్రవృత్తిపరంగా రెండు విధాలా సద్వినియోగం చేసుకుంటోంది బెంగుళూరుకు చెందిన సుప్రియ శ్రీవాత్సవ. మానసిక, శారీరక వికాసానికి ఈ క్రీడ తోడ్పడుతుందంటున్న సుప్రియ ఔత్సాహికుల కోసం శిక్షణ కేంద్రాన్ని కూడా నడుపుతోంది. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే...
2015లో హూప్స్ పట్ల నాకు ఆసక్తి యాదృచ్ఛికంగా ఏర్పడింది. అందుకు ఒక రష్యా మహిళకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ సమయంలో నేను గోవాలో ఒక హాస్టల్‌లో ఉన్నాను. అక్కడే బస చేస్తున్న ఒక రష్యన్ మహిళ... భారతీయ మహిళలను చులకనగా మాట్లాడడం మొదలుపెట్టింది. దాంతో మన మహిళల సత్తాను నిరూపించడానికి అక్కడే ఉన్న ఒక హూప్‌ను తీసుకుని నడుముకు తగిలించుకుని గుండ్రంగా తిప్పే ప్రయత్నం చేశాను. నిజానికి హూప్‌ను ఉపయోగించడం నాకదే మొదటిసారి. అయినా ఎంతో అనుభవం ఉన్నట్టు హూప్‌ను గిరగిరా తిప్పేసి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాను. హూప్‌తో అనుబంధం నాకు ఆ సమయంలోనే ఏర్పడింది. అయితే అప్పటికే అమెజాన్‌లో పనిచేస్తున్నాను. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల హూప్‌తో ఆడడానికి ఎక్కువ సమయం దొరికేది కాదు. అయినా వారాంతాల్లో, తీరిక దొరికిన ప్రతిసారీ హూప్‌ను సాధన చేయడం మొదలుపెట్టాను. శ్రావ్యమైన సంగీతం వింటూ, హూప్‌ను నడుముకు తగిలించుకుని గిరగిరా తిప్పుతుంటూ ఉంటే, ఒత్తిడి తొలగి మనసు తేలికవడంతో పాటు శరీర దారుఢ్యం కూడా పెరుగుతున్నట్టు క్రమేపీ గ్రహించాను. అలా ఒక ఏడాదిలోనే హూలా హూప్‌లో పరిణతి సాధించాను.
కుంగుబాటు నుంచి కోలుకుని...
‘విద్య పంచుకుంటే పెరుగుతుంది’ అని నా కుటుంబం నేర్పింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి హూలా హూప్‌తో ఒరిగే ప్రయోజనాలను నలుగురికీ నేర్పించాలనుకున్నాను. అందుకే యూట్యూబ్ ఛానల్ నడపడంతో పాటు ఆన్‌లైన్, ఆఫ్ లైన్ తరగతులు మొదలుపెట్టేశాను. అలాగే వేడుకల్లో హూలా హూప్ విన్యాసాలను ప్రదర్శించి అందరికీ అవగాహన కల్పించడం కొనసాగించాను. నిజానికి మానసిక సమస్యలతో కుంగిపోయిన నాకు ఈ కొత్త అభిరుచి కొత్త జీవితాన్ని అందించింది. నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాలా ఎన్నో రకాల కుంగుబాట్లకు లోనై, నిరాశా నిస్పృహలతో జీవితాలను వెళ్లదీస్తున్నవాళ్లు ఎంతోమంది ఉంటారు. నా జీవితంలో ఊహించని సంఘటనలు జరిగాయి. 21 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ ప్రభావం నన్ను ఆరు నెలల పాటు కుంగదీసింది. అయినా కోలుకొని ఆ తర్వాత మింత్రలో, అమెజాన్‌లో వృత్తి జీవితాన్ని కొనసాగించాను. ఏడేళ్ల పాటు పర్పుల్ ఫిల్టర్ అనే ఫ్రీలాన్స్ ఏజెన్సీని కూడా నడిపాను. ఓ పక్క హూలా హూప్ సాధన చేస్తూనే, వృత్తి జీవితాన్ని కొనసాగించాను. చివరకు 2023 డిసెంబరు నుంచి, ఫ్లో ఆర్ట్‌నే పూర్తి స్థాయి వృత్తి జీవితంగా మార్చుకున్నాను.
వృత్తిగా మలుచుకోవచ్చు
హూప్స్ అనగానే అందరికీ సర్కస్ కళాకారులు గుర్తొస్తారు. దాంతో ఈ కళను చులకనగా చూస్తూ ఉంటారు. కానీ నిజానికి శరీరాకృతి, బరువుకు తగిన హూప్‌ను ఎంచుకుంటే సులభమైన విన్యాసాలు సాధ్యపడతాయి. ఫ్లో ఆర్ట్‌ను వృత్తిగా మలుచుకునేవాళ్లు శరీర భంగిమ, ఆకృతి, బరువుల మీద దృష్టి పెట్టాలి. శరీరం స్పందించే తీరుకు తగ్గట్టు విన్యాసాలను రూపొందించుకోవాలి. హూప్‌ను ఒక గమ్యంగా కాకుండా ఒక ప్రయాణంగా భావించి, తగిన మెలకువలను అనుసరిస్తూ, సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే ఈ కళలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News