సమాధానాలు చెప్పలేకపోతున్నారా
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:01 AM
పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రాయలేక మార్కులు పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా...
కొంతమంది పిల్లలు గంటలతరబడి చదువుతూనే ఉంటారు. కానీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రాయలేక మార్కులు పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా... తల్లిదండ్రులు ఎలా చదివించాలో తెలుసుకుందాం...
పిల్లలు ఎంతసేపు చదువుతున్నారు అనే అంశం మీద కాకుండా ఎలా చదువుతున్నారనే దాని మీద ఎక్కువగా దృష్టి సారించాలి. గంటసేపు కూర్చుని పాఠమంతా ఒకేసారి చదివితే పిల్లలకు గుర్తుండకపోవచ్చు. పాఠాన్ని రెండు లేదా మూడు భాగాలుగా విభజించి రోజుకు ఒక భాగాన్ని మాత్రమే చదివించాలి. అది కూడా పావు గంట లేదా అరగంట దాటకుండా చూడాలి. ఇలా పాఠం చదవడం పూర్తయిన తరవాత మరోసారి రివిజన్ చేయించాలి. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు చదవడం వల్ల పిల్లలకు పాఠాలు చక్కగా గుర్తుంటాయి.
పాఠం చదువుతున్నప్పుడు ముఖ్యాంశాల కింద పెన్సిల్‌తో లైన్ గీయడం పిల్లలకు అలవాటు చేయాలి. పాఠం చదవడం పూర్తయ్యాక వాటిని నోట్‌బుక్‌లో రాయించాలి. వారానికి ఒకసారి వీటిని పిల్లల చేత చదివించాలి. వీలైనప్పుడల్లా నోట్స్ చూడకుండా పేపర్ మీద వాటిని రాయిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ... పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
పిల్లలు సాధారణంగా లెక్కలంటే భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాటికి సంబంధించిన సూత్రాలు, నియమాలను ముందుగానే నోట్‌బుక్‌లో రాయించాలి. పిల్లలకు అవి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. రోజూ ఉదయాన్నే వీటిని రివిజన్ చేయించాలి. అభ్యాసంలో ఇచ్చిన లెక్కలను దగ్గరుండి చేయించాలి.
పరీక్షలప్పుడు ఒక పాఠం లేదా అధ్యాయం పూర్తయ్యాకే మరోదాన్ని మొదలుపెట్టాలనే విధానాన్ని పాటించవద్దు. పిల్లలు ఒక పాఠాన్ని కొంత వరకు చదివిన తరవాత అరగంటసేపు ఆగి మరో పాఠాన్ని మొదలుపెట్టమని చెప్పాలి. తరవాత పావుగంటసేపు ఆగి మొదటి పాఠాన్ని పూర్తిచేయించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల గ్రహణ శక్తి పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి