bird flu: ఆ రెండూ ఒకటి కావు
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:16 AM
ఓ పక్క బర్డ్ ఫ్లూ కొనసాగుతోంది. మరో పక్క ఫారింగ్జయిటిస్ లాంటి శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు వేధిస్తున్నాయి. ఒకే లక్షణాలను కలిగి ఉండే ఈ రెండు ఆరోగ్య సమస్యల్లో ప్రధాన వ్యత్యాసాలు లేకపోలేదు. ఆ వ్యత్యాసాల ఆధారంగా సమస్యను కచ్చితంగా ఎలా గుర్తించాలో, ఎలా సరిదిద్దుకోవాలో వైద్యులు వివరిస్తున్నారు.
చల్లని చలికాలం నుంచి వేడిగా ఉండే వేసవి కాలంలోకి అడుగుపెడుతున్నాం. అటు చలి, ఇటు వేసవి కాని ఈ మధ్యస్థ కాలంలో, రోజు మొత్తంలో వాతావరణం భిన్నమైన ఉష్ణోగ్రతలకు లోనవుతూ ఉంటుంది. పొద్దున్న చలి ఎక్కువగా, మధ్యాహ్నం వేడి ఎక్కువగా, సాయంత్రానికి మళ్లీ చలి పెరుగుతూ ఇలా శరీరం భిన్నమైన ఉష్ణోగ్రతలకు బహిర్గతమవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు శరీరం అలవాటు పడే క్రమంలో వాతావరణంలోని పలురకాల వైరస్‌ల వల్ల వేర్వేరు ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. వాటిలో ప్రధానమైనది... ‘ఫారింగ్జయిటిస్’. ముక్కు, నోరు, శ్వాస నాళిక వెనక భాగంలో ఉండే ఫారింగ్స్‌కు వాతావరణంలో విజృంభించే చిన్నపాటి వైరస్‌లు సోకుతూ ఉంటాయి. ప్రధానంగా బడికెళ్లే పిల్లలకు సోకే ఈ ఇన్‌ఫెక్షన్ క్రమేపీ కుటుంబానికీ, ఇతరులకూ వ్యాపిస్తూ ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇది తీవ్రంగా పరిగణించవలసిన సమస్య కాకపోయినప్పటికీ, స్వల్పకాలిక మందులతో లక్షణాలను అదుపులోకి తెచ్చుకోవాలి. అంతిమంగా జ్వరం వరకూ సమస్య ముదిరిపోకుండా ఉండడం కోసం ముందు నుంచే జాగ్రత్త పడాలి. ప్రధానంగా అలర్జీ ప్రతిస్పందన, వైరస్ విజృంభణ మూలంగా ఫారింగ్జయిటిస్ వేధిస్తుంది కాబట్టి అలర్జీని తగ్గించే మందులతో, ఉపశమనాన్నిచ్చే గృహ వైద్యాలతో చికిత్స మొదలుపెట్టాలి. అందుకోసం....
యాంటీబయాటిక్స్ వాడకూడదు
రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టాలి
చల్లని పదార్థాలు, ద్రవాలకు దూరంగా ఉండాలి
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి నోరు పుక్కిలించాలి
చల్లని గాలికి బహిర్గతం కాకుండా చూసుకోవాలి
యాంటీ ఎలర్జిక్ మందులు పరిమితంగా వాడుకోవాలి
వీలైనంత తక్కువ మోదాదులో పారాసిటమాల్ వాడుకోవాలి
బర్డ్ ఫ్లూలో కూడా ఇవే లక్షణాలు
జ్వరం, ఎగువ శ్వాసకోస ఇన్‌ఫెక్షన్, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, వాంతులు బర్డ్ ఫ్లూ ప్రధాన లక్షణాలు. అయితే ఇవి ఫారింగ్జయిటిస్‌ను పోలినట్టే కనిపించినా, బర్డ్ ఫ్లూలో జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీటితోనే ఈ వ్యాధి మొదలవుతుంది. ఫారింగ్జయిటిస్‌లో, ముక్కు దిబ్బెడ, గొంతునొప్పితో మొదలై అంతిమంగా జ్వరం కనిపిస్తుంది. కానీ బర్డ్ ఫ్లూ ఏకంగా జ్వరంతో మొదటి రోజే ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు వేధిస్తాయి. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు మినహా బర్డ్‌ఫ్లూ తీవ్రమైన పరిణామాలకు దారి తీయదు. అయితే బర్డ్ ఫ్లూ సోకినప్పుడు, లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి వైద్యులు మాత్రమే తగిన యాంటీబయాటిక్స్ సూచించగలుగుతారు. దగ్గు, జలుబులను తగ్గించుకోవడం కోసం వేడి నీటి ఆవిరి, గోరువెచ్చని నీటితో నోరు పుక్కిలించడం లాంటి చిట్కాలు పాటించవచ్చు.
ఫారింగ్జయిటిస్‌ను, ఎటువంటి వైద్య చికిత్స అవసరం లేకుండా, రోగనిరోధకశక్తి సహాయంతో ఐదు రోజుల్లోనే అదుపులోకి తెచ్చుకోవచ్చు. కానీ బర్డ్ ఫ్లూకు వైద్య చికిత్స అవసరమవుతుంది. అయినప్పటికీ లక్షణాల తీవ్రతను బట్టి వైద్యులను సంప్రతించడం అవసరం.
డాక్టర్ సుధీర్ రెడ్డి, ఈన్‌టి సర్జన్,
త్రీ సెన్సెస్,
హబ్సిగూడ, హైదరాబాద్.
లక్షణాలు ఇవే!
ముక్కు దిబ్బెడ
తుమ్ములు
గొంతు నొప్పి
దగ్గు, జలుబు
జ్వరం
మింగడం ఇబ్బంది
దగ్గినప్పుడు తెమడ
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..