Home Stay by Renuka Gupta: అచ్చంగా ఇంట్లో ఉన్నట్టే
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:39 AM
హోమ్ స్టే... ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. కానీ ఆరేళ్ల క్రితమే విశాఖ నగరంలో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు రేణుగుప్తా. పర్యాటకులకు వసతి కొరత తీర్చడంతో పాటు...
హోమ్ స్టే... ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. కానీ ఆరేళ్ల క్రితమే విశాఖ నగరంలో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు రేణుగుప్తా. పర్యాటకులకు వసతి కొరత తీర్చడంతో పాటు సొంతింటి అనుభూతిని అందించడమే దీని ఉద్దేశం అంటున్న ఆమె...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నవ్య’తో అనేక విషయాలను ఆమె ప్రత్యేకంగా పంచుకున్నారు.
‘‘మాది ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్. ఆ రాష్ట్రంలో, ఢిల్లీలో నా చదువంతా సాగింది. కొన్నాళ్లపాటు ఢిల్లీలో కొన్ని ఎన్టీవోలలో, ఇతర సంస్థల్లో పనిచేశాను. 1985లో విశాఖకు చెందిన డాక్టర్ జి.వి.రమణతో వివాహం జరిగింది. ఆయన ఎకనామిక్ టైమ్స్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. మేము ఎనిమిదేళ్లపాటు ఢిల్లీలో ఉద్యోగాలు చేశాం. నా అత్తమామలు అప్పటికి చాలా ఏళ్ల కిందటే విశాఖకు వచ్చి స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ విశాఖకు వచ్చి వెళ్లేవాళ్లం. వారికి వయసు పైబడడంతో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. వారిని దగ్గరుండి చూసుకోవాలన్న ఉద్దేశంతో 1993లో విశాఖ వచ్చేశాం. ఇక్కడ కొత్త ఉపాధి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ‘ఆర్డీ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించాం. నేను ప్రస్తుతం ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నా.
ఆలోచన పుట్టింది అలా..
మా ఇల్లు చాలా పెద్దది. అది 60 ఏళ్లకు పూర్వానిది. నా అత్తమామలు చనిపోవడం, మా అమ్మాయికి వివాహమై బెంగళూరు వెళ్లిపోవడంతో... నేను నా భర్త మిగిలాం. దాంతో కాస్త ఒంటరితనంగా అనిపించేది. అందేకాదు. ఇల్లు కూడా శుభ్రంగా ఉన్నట్టు అనిపించేది కాదు. నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. ఈ సమస్యల పరిష్కారం కోసం... ఇంట్లో గదులను ఎవరైనా వినియోగించుకొనేలా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. రమణకు చెబితే సరేనన్నారు. ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘హోమ్ స్టే’. మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం పొందే అవకాశాన్ని కల్పించాం. మొదట్లో తెలిసిన వారికి మాత్రమే ఇచ్చేవాళ్లం. ఆ తరువాత ఆన్‌లైన్‌లో వివరాలు పెట్టాం. పర్యాటకులు వారు ఉండే రోజులను బట్టి, ఎంపిక చేసుకునే గదులను బట్టి, వారి సంఖ్యను బట్టి డబ్బులు చెల్లిస్తారు. వసతితోపాటు భోజన సదుపాయం కూడా కావాలంటే కల్పిస్తాం. మేము వండుకున్నదే వారికి పెడతాం. వారి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా... వారే వంట చేసుకునేందుకు సదుపాయాలు కూడా ఉన్నాయి. చాలామంది మాతోపాటు మేము వండుకున్నవి తినేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు మా కిచెన్‌లోకి వచ్చి, వారి వంటలు వండి, మాకు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, వంట చేసే సమయంలో సాయం చేయడానికి కూడా ముందుకు వస్తూఉంటారు. నేను సౌతిండియన్, నార్త్ ఇండియన్ వంటలన్నీ బాగా చేస్తాను. పర్యాటకులు ఉన్నన్ని రోజులూ ఒక్కోరోజు ఒక్కో ప్రాంతానికి చెందిన వంటలు వండి పెడతాను.
మూడు కేటగిరీల్లో గదులు..
ప్రస్తుతం మా ఇంట్లో మూడు అదనపు గదులను పర్యాటకుల కోసం కేటాయించాం. వీటిలో రెండు ఫ్యామిలీతో కలిసి ఉండేందుకు, ఒకటి బ్యాచిలర్స్, స్నేహితులు ఉండేందుకు అనువుగా ఉంటాయి. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి మెగ్‌నోలియా స్టే, మరొకటి మెగ్‌నోలియా స్టూడియో రూమ్, ఇంకొకటి మెగ్‌నోలియా హోమ్. మెగ్‌నోలియా అనేది నాకు ఇష్టమైన ఒక పువ్వు పేరు. అందుకే గదులకు ఆ పేరు పెట్టాను. మా ఇంటికి వచ్చే పర్యాటకుల్లో 70 నుంచి 80 శాతం ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వారిలో కుటుంబంతో కలిసి వచ్చేవాళ్లు, స్నేహితులతో వచ్చే వాళ్లు ఉంటారు. మరో 20 శాతం మంది విదేశీ పర్యాటకులు. ఎక్కువగా అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు చెందిన టూరిస్టులు వస్తారు. ఒకసారి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించిన వారు... మరోసారి విశాఖ వస్తే మా దగ్గరకే వస్తారు. మరో చోటుకు వెళ్లేందుకు ఇష్టపడరు. మా ఇంటికి వచ్చే వాళ్లను టూరిస్టులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. వారితో మమేకమవుతాం. అన్ని విషయాలను చర్చిస్తాం. చాలామంది ఆ తరువాత కూడా ఫోన్ చేసి, మా బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. వారి ఇళ్లకు ఆహ్వానిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. అమ్మాయి పెళ్లయి వెళ్లాక, ఒంటరిగా ఉన్నామన్న భావన ఇప్పుడు లేదు. మా. కుటుంబ సభ్యులు పెరిగినట్టు అనిపిస్తోంది.
పరిశుభ్ర నగరంగా కితాబు..
మా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్న టూరిస్టుల్లో దాదాపు అందరూ నగర అందాలకు ముగ్దులైన వారే. విశాఖ నగరం పరిశుభ్రంగా ఉండడంతోపాటు మనుషులు ఆత్మీయంగా ఉంటారని వారు చెబుతుంటారు. ఇక్కడి మనుషుల మాట తీరు, వ్యవహరించే విధానం బాగుటుందని ప్రశంసిస్తూ ఉంటారు. తొలిసారి వచ్చిన టూరిస్టులు ఎక్కడెక్కడికి వెళ్లాలో, ఏ ప్రాంతాలను సందర్శించాలో తెలుసుకుంటారు. దేశ, విదేశాలకు చెందిన, భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన, వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులకు అతిథ్యం ఇవ్వడం వల్ల అనేక విషయాలను తెలుసుకొనే అవకాశం మాకు ఏర్పడుతోంది. ఇటువంటి విధానాన్ని నగర వాసులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు వినియోగించుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే, అటువంటి సందర్భాలు అతి తక్కువ మాత్రమే మాకు ఎదురయ్యాయి. మా హోమ్ స్టే సంగతి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కిందటి నెల 27న, ‘పర్యాటక దినోత్సవం’ సందర్భంగా... వర్చువల్ విధానంలో నాతో మాట్లాడారు. హోమ్ స్టే విధానం అమలు తీరు, వస్తున్న ఆదాయం, తదితర విషయాలను తెలుసుకుని నన్ను అభినందించారు. అది నాకు ఎంతో సంతోషం కలిగించింది. ప్రభుత్వం రాష్ట్రమంతటా ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతుండడం మంచి విషయమే. ఇది రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను.’’
బూటు శ్రీనివాసరావు, విశాఖపట్నం
ఫొటోలు: వై.రామకృష్ణ
పరస్పర సహకారం..
మాకు కొద్దిమందితో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటివారికి... వారు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చి పంపించేస్తాం. మా ఇంట్లో ఉన్నన్ని రోజులు వారికి విశాఖలోని అందాలు, పర్యాటక ప్రదేశాలు, వారు వెళ్లాల్సిన ప్రాంతాల గురించి చెబుతూ ఉంటాం. కొందరు పరిశోధనల కోసం, అధ్యయనాల కోసం వస్తారు. వారికి అవసరమైన సహకారాన్ని రమణ అందిస్తారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి నోట్స్ ప్రిపరేషన్, ఇతర సాంకేతిక అంశాల్లో సహాయాన్ని చాలా సందర్భాల్లో రమణ అందించారు. ఒక రకంగా చెప్పాలంటే గైడ్‌గా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మా ఇంట్లో దిగిన వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వస్తే వారు పూర్తిగా కోలుకునేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాం. మా ఆత్మీయతను చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు