Gen Z habits: బెడ్ రాటింగ్ గురించి విన్నారా
ABN , Publish Date - May 20 , 2025 | 04:27 AM
‘బెడ్ రాటింగ్’ పేరుతో ఫోన్, టివి usageను విశ్రాంతిగా భావిస్తున్న నేటి తరం, దీని వల్ల శారీరక-మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరిక సమయాన్ని ప్రకృతి ఆస్వాదన, వ్యాయామం, పుస్తకాలు వంటి సానుకూల కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
గంటల తరబడి ఏ పనీ చేయకుండా, కదలకుండా విశ్రాంతిలో గడపడం లేదా ఫోన్, టివి చూస్తూ కాలక్షేపం చేయడమే ‘బెడ్ రాటింగ్’. నేటి తరం ఈ ధోరణిని ‘సెల్ఫ్ కేర్’గా పరిగణిస్తున్నప్పటికీ, దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, అలసట, అనాసక్తి... ఇవన్నీ కలిసి పడక పైనుంచి కదలనివ్వవు. తీరిక దొరికన వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని అదే పనిగా స్ర్కోలింగ్ చేయడం లేదా నచ్చిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను గంటల తరబడి కొనసాగించడం లాంటివి చేస్తోంది జెన్ జడ్ తరం. కొందర్లో ఈ అలవాటు ఉదయం నిద్ర లేచిన వెంటనే, లేదా రాత్రి నిద్రకు ముందు కొనసాగుతూ ఉంటుంది. దీన్ని కాలక్షేపంగా, సేద తీరడంగా వాళ్లు బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. అడపాదడపా ఫోన్లు, టివిలతో సేద తీరడంలో తప్పు లేదు. కానీ తీరిక దొరికిన ప్రతిసారీ ఇదే పని చేస్తుంటే జీవగడియారం అస్తవ్యస్థమై, సెరటోనిన్ హార్మోన్ మోతాదులు తగ్గిపోయి, గాబా, డోపమైన్ న్యూరోట్రాన్స్‌మీటర్లు అదుపు తప్పుతాయనీ, ఫలితంగా ఆందోళన, ప్రేరణ లోపం, మానసిక కుంగుబాటుకు గురవుతారనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా దీర్ఘసమయాల పాటు అచేనతంగా ఉండిపోవడం వల్ల, శరీర కదలికలు లోపించి, మనసును తేలిక పరిచే, హుషారుగా ఉంచే హ్యాపీ హార్మోన్ల స్రావాలు తగ్గిపోయి, నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళనలు వేధించే అవకాశం ఉంటుంది. కాబట్టి తీరిక దొరికిన కొద్దిపాటి సవయాన్ని మానసిక ప్రశాంతతను చేకూర్చే పనులకు కేటాయించడం అవసరం. కిటికీలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం, ఆరుబయట విహరించడం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, ఆప్తులతో సరదా సమయాలు గడపడం, స్నేహితులతో గడపడం లాంటి పనుల కోసం తీరిక సమయాలను కేటాయించడం అలవాటు చేసుకోవాలి.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి