Kids Nutrition: పిల్లలు బలంగా
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:05 AM
పిల్లలు బలంగా ఎదగాలంటే బలవర్థకమైన పోషకాహారాలను ఎంచుకుని, వాటికి భోజనంలో స్థానం కల్పించాలి. ప్రత్యేకించి పిల్లలకు తినిపించవలసిన పౌష్ఠికాహారం ఎలా ఉండాలంటే...
రాగులు: క్యాల్షియం, ఇనుము పుష్కలంగా కలిగి ఉండే రాగులు ఎముకలకు బలాన్నిచ్చి, హీమోగ్లోబిన్ మోతాదును పెంచుతాయి. వీటితో జావ, దోస, లడ్లు తయారుచేసి పిల్లలకు అందించవచ్చు.
ఉసిరి: విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగు పరిచి, చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాబట్టి ఉసిరి రసం, చట్నీ, మురబ్బా రూపంలో అందించవచ్చు.
నెయ్యి: ఆరోగ్యకరమైన కొవ్వుల భాండాగారమిది. జీర్ణశక్తిని పెంచి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి అన్నంతో, చపాతీల్లో నెయ్యి జోడిస్తూ ఉండాలి.
పసుపు: పసుపుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. రోగనిరోధకశక్తిని పెంచే పసుపు గాయాలను త్వరగా మాన్పుతుంది. కాబట్టి తరచూ పాలు లేదా సూప్స్‌లో పసుపు కలిపి అందిస్తూ ఉండాలి.
మఖ్‌నా: ప్రొటీన్, క్యాల్షియం సమృద్ధిగా దొరికే మఖనాలు ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. వీటిని తింటే పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు.
ఖర్జూరం: సహజసిద్ధ చక్కెరలను కలిగి ఉండే ఖర్జూరాలు శక్తినిస్తాయి. స్మూదీలు, పండ్ల రసాలు, ఎనర్జీ బాల్స్ రూపంలో ఖర్జూరాలను తినిపిస్తూ ఉండాలి.
బెల్లం: శుద్ధి చేసిన చక్కెరకు ప్రత్యామ్నాయమైన బెల్లంలో ఇనుము ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి పిల్లల కోసం తయారుచేసే తీపి వంటకాల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడుతూ ఉండాలి.
పచ్చి కొబ్బరి: కొబ్బరినీళ్లతో డీహైడ్రేషన్ తొలగిపోతే, కొబ్బరితో ఆరోగ్యకరమైన కొవ్వులు దక్కుతాయి. కాబట్టి కూరలు, స్మూదీలలో పచ్చి కొబ్బరి కోరు కలుపుతూ ఉండాలి. కొబ్బరి చట్నీలు విరివిగా వాడుకోవాలి.
మొలకలు: పెసర మొలకల్లో ప్రొటీన్లు ఎక్వువ. ఇవి తేలికగా అరుగుతాయి కూడా. కాబట్టి సలాడ్స్, వేపుళ్లలో వీటిని కలిపి పిల్లలకు తినిపిస్తూ ఉండాలి.
చిలకడదుంపలు: వీటిలో పీచుకు కొదవ ఉండదు. విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉడకబెట్టి, వేయించి, నిప్పుల్లో కాల్చి పిల్లలకు తినిపించవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..