Healthy Aging Tips: మలి వయసులో
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:09 AM
పైబడే వయసుతో జీవితం బరువైపోకుండా ఉండాలంలే వయసురీత్యా వేధించే అస్వస్థతలను, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగాలి! అప్పుడే వృద్ధాప్యం భారం కాకుండా...
వృద్ధాప్యం
పైబడే వయసుతో జీవితం బరువైపోకుండా ఉండాలంలే వయసురీత్యా వేధించే అస్వస్థతలను, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగాలి! అప్పుడే వృద్ధాప్యం భారం కాకుండా ఉంటుంది. అజీర్తికి అడ్డుకట్ట పెరిగే వయసుతోపాటు అరుగుదల క్షీణిస్తుంది. కాబట్టి తేలికగా అరిగే పదార్థాలు తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! 60 ఏళ్లు దాటినవాళ్లలో జీర్ణరసాలు తగినంత తయారు కావు. దాంతో ఆకలి కూడా తగ్గుతుంది. అలాగని సమతులాహారం తీసుకోకుండా ఉండిపోతే శరీర జీవక్రియలకు సరిపడా శక్తి అందదు. కాబట్టి ప్రొటీన్లు తక్కువగా, పిండిపదార్థాలు మధ్యస్తంగా, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. తాజా పండ్లు, మజ్జిగ ప్రతిరోజూ తీసుకోవాలి. భోజనవేళలు క్రమంతప్పక పాటించాలి. రాత్రి భోజనం ఏడు గంటలలోపే ముగిస్తే అజీర్తి సమస్య తలెత్తదు. అలాగే రాత్రి భోజనం తేలికగా అరిగేదై ఉండాలి. నూనెలు, మసాలాలు లేని సాత్వికాహారం తినాలి. తీపి, కారం తగ్గించాలి. ఉడకబెట్టిన కూరగాయలతో రాత్రి భోజనం ముగిస్తే ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు లాంటి అజీర్తి సమస్యలు వేధించవు.
నిద్ర కంటి నిండా...
పెరిగే వయసుతో నిద్ర తరిగిపోవడం సహజమే! అయితే ఆ కొన్ని గంటలైనా కంటి నిండా నిద్ర పడితే ఫర్వాలేదు. కానీ కొందరికి నిద్రే పట్టకుండా పోతుంది. ఇలాంటివాళ్లు అందుకు అడ్డుపడుతున్న అంశాలను లోతుగా విశ్లేషించాలి. అనారోగ్యం కారణంగా నిద్ర కరవవుతుంటే ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నా వాటిని పడగ్గది బయటే వదలేయడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు గంట ముందు వరకూ పుస్తకం చదవడం, శ్రావ్యమైన సంగీతం వినడం చేయాలి. పడగ్గదిలో టీవీ, సెల్‌ఫోన్ తీసేయాలి. మనవలు, మనవరాళ్లతో కబుర్లు చెప్పడం, నచ్చిన పనులు చేయడం వల్ల మనసు తేలికై నిద్ర పడుతుంది. బాత్రూమ్ పడగ్గదిలోనే ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. అలాగే పడగ్గది కూడా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. లైట్, ఫ్యాన్ స్విచ్‌లు మంచానికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
కీళ్ల నొప్పులు లేకుండా...
కీళ్ల నొప్పులు లేకుండా వృద్ధాప్యాన్ని దాటలేం! అయితే అవి ఏ రకం కీళ్ల నొప్పులో తెలుసుకుని అందుకు తగిన వైద్య సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్ద వయసులో ఈ నొప్పులు సహజమే అని ఊరుకోకుండా అవసరమైన మందులు వాడడం వల్ల నొప్పులు నియంత్రణలో ఉండి, జీనవ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. కొందరికి ఆర్థ్రయిటిస్, మరికొందరికి ఆస్టియో ఆర్థ్రయిటిస్... ఇలా రకరకాల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులను అదుపుచేసే మందులు వాడక తప్పదు. అయితే ఆ మందుల వల్ల మూత్రపిండాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. వాడుతున్న మందులు ఎంత సురక్షితమో వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఈ నొప్పినివారణ మాత్రలతోపాటు క్యాల్షియం సప్లిమెంట్లు కూడా వాడాలి. సోఫాలో కూర్చోవడం, పీట మీద కూర్చుని పూజ చేయడం, మోకాళ్లను వంచే పనులు చేయడం మానేయాలి. అలాగే నడక వల్ల కీళ్ల మధ్య బిరుసుతనం తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడవడం అలవాటు చేసుకోవాలి.
జ్ఞాపకశక్తి బలంగా....
పెద్ద వయసులో మతిమరుపు మామూలే అనుకోకూడదు. అందుకు కేంద్రమైన మెదడును చురుగ్గా ఉంచగలిగితే మతిమరుపును దూరం పెట్టవచ్చు. మరీ ముఖ్యంగా మెదడు కణాలు క్షీణించే అల్జీమర్స్ వ్యాధికి గురికాకుండా ఉండాలన్నా, మెదడును చురుగ్గా ఉంచే పనులు చేయాలి. ఇందుకోసం పజిల్స్ పూరించడం, నోటి లెక్కలు వేయడం లాంటివి చేస్తూ ఉండాలి. చేతిలో ఖాళీ సమయం బోలెడంత ఉంటుంది కాబట్టి అభిరుచులను సాధన చేయాలి. బొమ్మలు వేయడం, కథలు రాయడం, తోటపని చేయడం లాంటి పనులు చేయవచ్చు. వాల్‌నట్స్ మెదడు కణాలను బలోపేతం చేస్తాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే పండ్లు, నట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. పిల్లలతో కలిసి సరదాగా బ్రెయిన్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. దగ్గరి వ్యక్తుల పేర్లు, తరచుగా తిరిగే దారులు మర్చిపోతున్నట్టు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. ఈ లక్షణాలు అల్జీమర్స్ కావచ్చు. ఈ వ్యాధికి ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత మేలు!
వ్యాయామం అవసరమే!
ఓపిక లేదనే సాకుతో వ్యాయామం చేయడం మానకూడదు. ఈ వయసులో చమటలు కక్కేలా వ్యాయామం చేయనవసరం లేదు. కీళ్లు, కండరాలు కదిలేలా 30 నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామాలు చేసినా ఫలితం ఉంటుంది. ఇందుకోసం నడక ఎంచుకోవచ్చు. అయితే కాళ్లకు మెత్తని షూ వేసుకోవాలి. చెప్పులతో నడక శ్రేయస్కరం కాదు. నడిచే చోటు కూడా ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా ఉండేలా చూసుకోవాలి. రద్దీ తక్కువగా ఉండి వాహనాలు లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తోడుగా ఎవరినైనా వెంటబెట్టుకుని వెళ్లడం మరింత క్షేమకరం! వ్యాయామానికి గంట ముందు, గంట తర్వాత ఎలాంటి ఘనపదార్థాలూ తీసుకోకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. శీతల పానీయాలు తీసుకోకూడదు.
స్వీయ రక్షణ ముఖ్యం!
పెద్ద వయసులో ఎముకలు విరిగితే అతుక్కోవడం కొంత కష్టం. పైగా ఈ వయసులో ఆస్టియోపొరోసిస్ కారణంగా ఎముకలు గుల్లబారి తేలికగా విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో, బయటా నడకకు గ్రిప్ ఉండే చెప్పులే వాడాలి. మరీ ముఖ్యంగా బాత్రూమ్‌లో జారకుండా ఉండే టైల్స్ వేయించుకోవాలి. రాత్రివేళ మంచం పక్కనే టార్చిలైటు ఉంచుకోవాలి. మెట్లకు రైలింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం