Movie Piracy: పైరసీ భూతముంది జాగ్రత్త!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:33 AM
ఒకప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేని సమయంలో కొత్త సినిమాలను వీడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేసేవారు. వీటికి విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆ తర్వాతి కాలంలో సీడీలు వచ్చాయి. వాటికి డిమాండ్ ఉండేది.

‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలయిన ఆరు గంటలలోపులోనే ఈ చిత్రం హెచ్‌డీ ప్రింట్‌ను కొందరు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సప్ లాంటి మాధ్యమాల ద్వారా ఎన్ని లక్షల మంది దీనిని డౌన్‌లోడ్ చేసి ఉంటారో చెప్పటానికి లెక్కలు అందుబాటులో లేవు.. కేవలం ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే కాదు.. ఆ తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘డాకు మహారాజ్’, ‘తండేల్’ లాంటి సినిమాలన్నింటినీ కూడా ఈ పైరసీ భూతం మింగేయటానికి చూసింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఆశించేది మొదటి వారం కలెక్షన్లు. వీటిని ఈ పైరసీ భూతం దారుణంగా దెబ్బతీస్తోంది.
ఒకప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేని సమయంలో కొత్త సినిమాలను వీడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేసేవారు. వీటికి విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆ తర్వాతి కాలంలో సీడీలు వచ్చాయి. వాటికి డిమాండ్ ఉండేది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా పైరసీ సులభమయిపోయింది. ఇంటర్నెట్ ఉంటే చాలు... కొత్త కొత్త సినిమాలను అందించే ‘ఐబొమ్మ’ లాంటి వెబ్‌సైట్లు ఎన్నో పుట్టుకువచ్చాయి. గతంలో క్యాసెట్లు, సీడీలు ఉన్న సమయంలో... పైరసీ చేయాలంటే వాటిని కాపీలు తీయాల్సి వచ్చేది. దీనికి సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఒక్క కాపీని సోషల్ మీడియాలో పెడితే చాలు... నిమిషాల్లో వేల సంఖ్యలో డౌన్‌లోడ్ అయిపోతోంది. ఆ తర్వాత గ్రూపుల ద్వారా లక్షల మందికి చేరిపోతోంది. దీని వల్ల తీవ్రంగా నష్టపోతుంది నిర్మాతలే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
చర్యలేవీ?
పైరసీ వల్ల కలిగే సమస్యలను చిత్ర పరిశ్రమ ముందే పసిగట్టింది. అందుకే పైరసీని అరికట్టడానికి... ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసింది. థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమా నుంచి ఈ సెల్ కొంత ఫీజు వసూలు చేస్తుంది. ఈ ఫీజును ఉపయోగించి సినిమాలు పైరసీ కాకుండా అడ్డుకుంటామనేది సెల్ చెబుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద చిత్రాలు పైరసీ కావటం వల్ల ఈ సెల్ వల్ల పెద్ద ప్రయోజనం లేదనే విషయం స్పష్టమవుతోంది. ‘‘ఈ సెల్ వల్ల ప్రయోజనం ఏమి లేదు. పైరసీని అడ్డుకోవటం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలన్నీ డిజిటల్ రూపంలోనే ఉంటున్నాయి. ఫిల్మింగ్, ఎడిటింగ్ నుంచి ఫైనల్ కాపీ వరకు ఎక్కడైనా లీక్ కావచ్చు.
అంతేకాదు. ప్రస్తుతం సినిమాలు ‘క్యూబ్’ లాంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డిజిటల్ రూపంలో థియేటర్లకు చేరుతున్నాయి. అక్కడ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు నాకు తెలిసి హెచ్‌డీ కాపీ తొలి రోజున ఎప్పుడూ లీక్ కాలేదు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనే ఇది జరిగింది. దీనిపై సైబర్ క్రైం పోలీసులు దర్యాపు చేస్తున్నారని.. కేసు ఒక కొలిక్కి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఎవరు దాన్ని లీక్ చేశారో తెలిసినా వారిపై కేసు పెట్టి నేరం నిరూపించటం అంత సులభం కాదు. అందువల్లే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు...’’ అని పేరు చెప్పటానికి ఇష్టం లేని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
పరిష్కారం లేదా?
ఒక పెద్ద సినిమా విడుదలయిన వెంటనే దాని కాపీని ఏదో ఒక విధంగా సంపాదించి ఆన్‌లైన్‌లో పెట్టడానికి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా ఒక వెబ్‌సైట్‌లోనో, ట్విట్టర్ అకౌంట్‌లోనో పెట్టిన వెంటనే ఆ అకౌంట్స్‌ను డిలీట్ చేయించటానికి నిర్మాతలు కొన్ని ప్రైవేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ఈ సంస్థలు... ఆ వెబ్‌సైట్ల హోస్ట్‌లతో మాట్లాడి... వాటిని తొలగిస్తున్నాయి. అయితే పోలీసుల పరంగా వెంటనే చర్యలు తీసుకోలేక పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పైరసీ సమస్యను గుర్తించింది. పైరసీని అరికట్టే చర్యల్లో భాగంగా... కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్లను నియమించింది. ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) కార్యాలయంలో, ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఏదైనా సినిమా పైరసీకి గురయిందని ఫిర్యాదు చేస్తే- 48 గంటల్లో ఆ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదని, చట్టాల్లో మార్పులు రావాలని అంటున్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్. ‘‘పైరసీపై ఫిర్యాదు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఫైలింగ్ ప్రాసెస్‌లో వెళితే మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పైరసీ విషయంలో పౌర సమాజం స్పందించాలి. దానికి అడ్డుకట్టవేయాలి’’ అంటారాయన. పెద్ద పెద్ద సినిమాలకు భారీగా నష్టం చేకూరుస్తున్న పైరసీని అరికట్టాలంటే... పౌర సమాజంలో కూడా అవగాహన పెరగాలి. దీనికి సినీ పరిశ్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిం చుకొని అమలు చేయాలి. అప్పుడే ‘పైరసీ’ అనే విలన్ ఓడిపోయి కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
పైరసీ కాపీలు ఎక్కువగా వాట్సప్, టెలిగ్రామ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. చట్టరీత్యా పైరసీ సినిమాలను గ్రూపుల్లో పెట్టినా నేరమే! అందువల్ల గ్రూప్ అడ్మిన్‌లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చట్టరీత్యా ఇబ్బంది పడే అవకాశముంది.
సాధారణంగా పైరసీ కాపీలు అందుబాటులో ఉండే సైట్లను విదేశాల నుంచి హోస్ట్ చేస్తున్నారు. అందువల్ల వీటిని తొలగించటం అంత సులభం కాదు.
కొత్త సినిమాటోగ్రఫీ చట్టం కింద... సినిమాలను అనధికారికంగా రికార్డు చేసినా, అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శించినా, ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినా... మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.