Share News

Lessons from Guru Gita: వారే గురువులు

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:26 AM

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ... ‘లోకంలో ప్రత్యక్ష దేవతలు నలుగురు. వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి’ అంటోంది భారతీయ సంస్కృతి. ‘‘తొలి గురువైన వేదమాత, తల్లి మన జన్మభూమి...

Lessons from Guru Gita: వారే గురువులు

విశేషం

10న గురుపౌర్ణమి

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ... ‘లోకంలో ప్రత్యక్ష దేవతలు నలుగురు. వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి’ అంటోంది భారతీయ సంస్కృతి. ‘‘తొలి గురువైన వేదమాత, తల్లి మన జన్మభూమి, తండ్రి వేదప్రతిపాద్యుడైన భగవంతుడు, దైవానికి ప్రతీకలైన మిగిలినవారు... ఈ నలుగురే ప్రత్యక్ష దైవాలు’’ అనే వివరణ కూడా ఉంది. గురువులను భగవంతుడిగా భావించి, ఆరాధించడం భారతీయుల సంస్కృతి, సంప్రదాయం, సభ్యత. అందుకే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని ‘గురుపౌర్ణమి’గా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా శిష్యులు తమ గురువులను, గురు పరంపరను ఆరాధించడం అనాదిగా వస్తున్నదే.

గురువు ఎవరు? అతని మహిమ ఎలాంటిది? గురువు వద్ద ఎలా మసలుకోవాలి? ఎలా తరించాలి?... ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పే గ్రంథం ‘గురుగీత’. ఇది ‘స్కాంద పురాణం’లో... మూడు అధ్యాయాలలో, 351 శ్లోకాలలో... పార్వతీ పరమేశ్వరుల మధ్య సంవాద రూపంలో ఉంటుంది. ‘సనత్కుమార సంహిత’గా పేర్కొనే ఈ గ్రంథం... ‘‘గురువు అనుగ్రహానికి దూరమైన దేనికీ ఈ ప్రపంచంలో మనుగడ లేదు’’ అని స్పష్టంగా చెప్పింది.


మార్గాన్ని చూపేది, గమ్యానికి చేర్చేది...

కఠోపనిషత్తులో ‘ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్యవరాన్‌ నిబోధత’ అనే ఒక విశిష్టమైన సూక్తి ఉంది. అంటే ‘‘లేవండి, మేలుకొనండి, మీ కర్తవ్య నిష్ఠతో గమ్యం చేరుకోండి’’ అని భావం. తెల్లవారుతోంది. రామాయణ గాథలో... రోజంతా గురువు విశ్వామిత్రుడి వెంట నడిచి, అలసిపోయిన రామ లక్ష్మణులు ఒళ్ళు మరచి నిద్రపోయారు. అది గమనించి శ్రీరాముణ్ణి ఉద్దేశించి ‘‘కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే’’ అంటూ విశ్వామిత్రుడు మేలుకొలిపాడు. ఈ రెండు... ముఖ్యంగా కఠోపనిషత్‌ లోని సూక్తి స్వామి వివేకానందుడికి ఎంతో ఇష్టం. సమాజాన్ని జాగృతపరచాలి. చైతన్యవంతం చేయాలి. ముందుకు నడిపించాలి. వివేకానందుడి అభీష్టం అదే. మరి అందుకు దోహదకారులైన బోధలు చేసేది, మార్గాన్ని చూపించేది, గమ్యానికి చేర్చేది ఎవరు? ‘‘గురువు కన్నా వేరెవ్వరూ లేరు’’ అన్నాయి వేదాలు. అందుకే వారిని ఆచార్యులుగా ఆరాధిస్తున్నాం. ఆర్ష సంస్కృతిని ఆపోశన పట్టినవారు, దాన్ని ఆచరించి, తరించి, ఇతరులను తరింపజేసేవారు, తాను పరమాత్మను లక్ష్యంగా చేసుకొని, సాధన చేసి, దర్శించి, ఇతరులకు బోధించేవారు.. వారే గురువులు.


విష్ణుస్వరూపుడు వేద వ్యాసుడు

పూర్వం ఎన్నో యుగాల నుంచి ఎందరో ఋషులు తమ తపఃఫలంగా సంపాదించిన జ్ఞానాన్ని క్రోడీకరించి, ఆ అనంతమైన రాశిని నాలుగు వేదాలుగా విభజించి, దాన్ని మనకు అందించినవాడు వ్యాసుడు. అందుకే ‘వ్యాసాయ విష్ణురూపాయ’ అని ఆయనకు నమస్కరిస్తున్నాం. వ్యాసుడు చెప్పినదాన్నే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు తమ శిష్యపరంపరకు అందించారు. వ్యాసుని పుట్టినరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అదే ‘వ్యాస పౌర్ణమి’గా, ‘గురు పౌర్ణమి’గా ప్రసిద్ధికెక్కింది. వేద, పురాణ, ఉపపురాణ, బ్రహ్మసూత్రాల ద్వారా... మానవాళికి జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలను వ్యాసుడు ఉపదేశించాడు. ఆయనను, ఆ పరంపరలోని సద్గురువులను స్మరించుకోవడం మన విధి. గురు పరంపరకు ఎంతో విశిష్టత ఉంది. సద్గురువు ఒక పరంపరకు చెందినవాడై ఉండాలి. ఆయన అధ్యయనం చేసి, అనుష్ఠించి, తన అనుభవంలోకి తెచ్చుకొని, దాన్ని శిష్యులకు బోధించాలి. ‘‘గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అవ్యక్త పరబ్రహ్మం. నారాయణుడైనా, సదాశివుడైనా అతడే. ‘నీ గురువు ఎవరు?’ అని ప్రశ్నించుకుంటూ పోతే ‘పరబ్రహ్మ’ అనే సమాధానం వస్తుంది’’ అని శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పిన సమాధానం ‘గురుగీత’ తొలి అధ్యాయంలో ఉంది. ‘‘నేను చెప్పేది విను అని శిష్యుడితో సద్గురువు అనడు. ‘‘నేను నేర్చుకున్నది నీకు చెబుతున్నాను’’ అంటాడు. ఎందుకంటే గురువు కూడా నిత్య విద్యార్థే. మనలోని అజ్ఞానాన్ని (గు) తొలగించి, జ్ఞాన విజ్ఞానాలను (రు) అందించేవాడే గురువు. ఈ మాటను అవగాహన చేసుకొని, గురువు అనే మాటకు అర్థాన్ని గ్రహించడమే జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం. అదే పార్వతీపరమేశ్వర సంవాదమైన ‘గురుగీత’ సారాంశం కూడా.

ఆయపిళ్ళ రాజపాప

ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:26 AM