Archana Thyagarajan Indian Freediver: ఆకాశం అంచుల నుంచి లోతైన నీళ్లలోకి
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:21 AM
భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్‌గా సేవలందించిన చెన్నైకి చెందిన అర్చన త్యాగరాజన్, ఫ్రీడైవింగ్‌లో సైతం సత్తా చాటుతూ దేశ కీర్తిని రెపరెపలాడిస్తోంది. యాదృచ్ఛికంగా...
స్ఫూర్తి
భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్‌గా సేవలందించిన చెన్నైకి చెందిన అర్చన త్యాగరాజన్, ఫ్రీడైవింగ్‌లో సైతం సత్తా చాటుతూ దేశ కీర్తిని రెపరెపలాడిస్తోంది. యాదృచ్ఛికంగా అడుగుపెట్టిన క్రీడ, తన జీవితాన్ని మలుపు తిప్పిన తీరు గురించి అర్చన ఇలా వివరిస్తోంది...
‘‘38 మీటర్లకు మించి డైవ్ చేయడం అసాధ్యమనీ, అంతకుమించి డైవ్ చేస్తే, లోతైన నీళ్లలోని ఒత్తిడికి ఊపిరితిత్తులు నొక్కుకుపోయి ప్రాణాలు పోతాయని భావించేవారు. కానీ 1952లో రైమాండో బుచర్ అనే ఒక ఇటాలియన్ డైవర్, 39 మీటర్ల లోతుకు డైవ్ చేసి సురక్షితంగా పైకొచ్చి, మునుపటి సిద్ధాంతం తప్పని రుజువు చేశాడు. అప్పటి నుంచి ఫ్రీడైవర్లు డైవ్ చేసే లోతును అంతకంతకూ పెంచుతూ పోయారు. అందుకోసం కొందరు తాళ్లను ఉపయోగిస్తే, ఇంకొందరు ఫిన్స్, బరువులను ఉపయోగించారు. అయితే లోతైన నీటిలో ముప్పు తప్పక పొంచి ఉంటుంది. సముద్రజలాలు గాలి కంటే 840 రెట్లు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. దాంతో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. లోతుకు చేరుకునేకొద్దీ, ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతుంది. అయినా ఫ్రీడైవర్లు వెనుకంజ వేయరు. నా విషయంలో చెప్పాలంటే, లోతైన నీటిలోని ప్రశాంతత, నిశ్చలత్వాలే ఈ క్రీడ పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించాయని చెప్పాలి. మనం, మన శరీరం తప్ప అక్కడ మరొక ఆలోచనకు తావుండదు.’’ అంటూ డైవింగ్ గురించీ, తన డైవింగ్ అనుభవం గురించీ వివరిస్తోంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మాజీ స్క్వాడ్రన్ లీడర్, అర్చన.
యాదృచ్ఛికంగా అడుగుపెట్టి...
అర్చన ఫ్రీడైవింగ్ యాధృచ్చికంగా మొదలైంది. భార్యాభర్తలిద్దరూ వైమానిక దళానికి చెందినవారే! ఇద్దరూ ఒకేసారి భారతీయ వైమానిక దళం నుంచి పదవీ విరమణ పొందడంతో ఏడాదిపాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకుని ఇండోనేషియా వెళ్లిపోయారు. అక్కడ అర్చన స్నేహితులు ఆమెను ఫ్రీడైవింగ్‌కు పరిచయం చేశారు. ‘ఆ సమయంలో నేను స్కూబా కోర్సులో చేరదామనుకున్నా. కానీ ఈతలో నాకున్న పూర్వ అనుభవం ఫ్రీడైవింగ్‌కు ఉపయోగపడుతుందని అనడంతో, వెంటనే ఒప్పుకున్నాను’ అంటూ వివరించింది అర్చన. 2024లో బిగినర్స్ కోర్సుకు హాజరైన తర్వాత, అర్చన శిక్షకుడు, స్థానిక పోటీలో పాల్గొనవలసిందిగా ఆమెను ప్రోత్సహించాడు. ఆ క్రీడకు కొత్త అయినప్పటికీ అర్చన, తొలి ప్రయత్నంలోనే ఏకంగా మూడు జాతీయ రికార్డులను నెలకొల్పింది. ‘‘అందుకు నెల రోజుల పాటు పాల్గొన్న యోగా కార్యక్రమానికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. శ్వాసపరంగా యోగా నాకెంతో బాగా సహాయపడింది. ఫ్రీడైవింగ్‌లో శ్వాసను నిలిపి ఉంచడమే కీలకం. యోగా, ప్రాణాయామం, ఈత.. ఈ మూడూ జాతీయ రికార్డులను నెలకొల్పడంలో సహాయపడ్డాయని చెప్పాలి. అలాగే సైన్యం నేర్పించిన క్రమశిక్షణ, శ్వాస నియంత్రణ, శరీర దారుఢ్యం కూడా ఈ గెలుపునకు కలిసొచ్చాయి. ప్రతి వృత్తిలో సవాళ్లుంటాయి. సైన్యంలో ఉండే సవాళ్లు భిన్నమైనవి. కానీ ఫ్రీడైవింగ్‌లో సవాళ్లు కూడా మరో స్థాయిలో ఉంటాయి. ఈ క్రీడ 80ు మానసికమైనది. 20ు భౌతికమైనది’ అంటూ ఫ్రీడైవింగ్ లోతుపాతుల గురించి వివరిస్తోంది అర్చన. గత ఏడాది జపాన్‌లో జరిగిన 34వ ఎఐడిఎ ఫ్రీడైవింగ్ ప్రపంచ పోటీల్లో, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి మహిళగా అర్చన పేరు తెచ్చుకుంది. ఈ పోటీల్లో ఏకంగా నాలుగు కొత్త జాతీయ రికార్డులను నెలకొల్పడం విశేషం.

అవగాహన పెరగాలి
మన దేశంలో ఫ్రీడైవింగ్ పట్ల అవగాహన తక్కువ. కానీ ఈ క్రీడ పట్ల అవగాహన పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. లోతు ఆధారిత ఫ్రీడైవింగ్ సముద్రాల్లోని స్వచ్ఛమైన జలాల్లోనే సాధ్యపడుతుంది. ఇందుకు అండమాన్, లక్షద్వీ్‌పలు అనుకూలమైనవి. అయితే మన దేశంలోని ప్రధాన నగరాల్లో కొలను ఆధారిత ఫీడ్రైవింగ్ సాధ్యపడుతుంది.
కాబట్టి ఇక్కడి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రస్తుతం చెన్నై, బెంగుళూరుతో పాటు థాయిలాండ్, ఫిలిప్పైన్స్‌లో శిక్షణ ఇస్తున్నాను. 2025 ఏప్రిల్‌లో మొట్టమొదటి మహిళా
మోల్ఖానోవ్స్ శిక్షకురాలిగా ఎంపికయ్యాను. ఇదొక ఎక్ట్‌ట్రీమ్ స్పోర్ట్. ఈ క్రీడలో పాల్గొనడానికి కనీస అర్హత 18 ఏళ్లు. ఊపిరి బిగబట్టినప్పుడు శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు పైకి చేరుకోవాలో, మన పరిమితులేమిటో
తెలుసుకుని ఉండాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. శక్తికి మించి శ్రమపడితే, శరీరం మొండికేసి, కుప్పకూలిపోవచ్చు. కాబట్టి ఎంతో అప్రమత్తంగా నడుచుకోవాలి’ అంటున్న అర్చన ప్రస్తుతం మరిన్ని ఫ్రీడైవింగ్ పోటీల కోసం సిద్ధపడుతోంది.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News