Women Are Driving Grassroots: సేవా స్ఫూర్తి స్పృహార్తి
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:15 AM
వైద్యురాలిగా స్థిరపడాలని కన్న కలలు ఆమెను కాస్మోటాలజీ వైపు నడిపించాయి. ఎందరికో ఉచితంగా శిక్షణ ఇచ్చినా ఏదో వెలితి... అదే తనను సామాజిక సేవ వైపు నడిపించిందంటారు...
వైద్యురాలిగా స్థిరపడాలని కన్న కలలు ఆమెను కాస్మోటాలజీ వైపు నడిపించాయి. ఎందరికో ఉచితంగా శిక్షణ ఇచ్చినా ఏదో వెలితి... అదే తనను సామాజిక సేవ వైపు నడిపించిందంటారు వీరంకి భారతీదేవి. ‘స్పృహార్తి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘నా పుట్టినిల్లు హైదరాబాద్. మెట్టినిల్లు విజయవాడ. నాన్న ఈడే విష్ణువర్థనరావు సొంత ఊరు గుడివాడ. ఆయన ఎల్‌ఐసీలో బ్రాంచ్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేవారు. ఉద్యోగ రీత్యా మా కుటుంబం సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడింది. అమ్మ కోకిలాదేవి పరోపకారిణి బాలిక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. వారి నలుగురు పిల్లల్లో నేను మూడో సంతానం. నా పాఠశాల విద్యంతా సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో పూర్తయింది. కస్తూర్బా గాంధీ కాలేజీలో ఇంటర్ చదివాను. కీస్ డిగ్రీ కాలేజీలో బీఏ సైకాలజీ పూర్తి చేశాను. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా వివాహమైంది. నా భర్త వీరంకి రాజశేఖరరావు... పటమటలో ఒక ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతున్నారు.
శ్రీమంతంతో శ్రీకారం
వైద్యురాలిగా స్థిరపడాడలనేది నా కల. అయితే ఇంటర్మీడియట్‌లో అనారోగ్యం కారణంగా అది సాధ్యం కాలేదు. నాకు పాఠశాల నుంచే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవాలని ఉండేది. నా ఆసక్తిని గమనించిన అమ్మ సంబంధిత కోర్సులకు పంపేది. పెళ్లయిన తర్వాత బెంగళూరులో కాస్మోటాలాజీలో డిప్లమో చేశాను. ఆ తరువాత ఎందరికో శిక్షణ అందించాను. కానీ ఏదో వెలితిగా అనిపించేది. సమాజానికి ఏదైనా చేయాలనే తపన పెరిగింది. కాగా... విజయవాడలో టెర్రస్ గార్డెన్ ప్రియుల గ్రూప్ ఒకటుంది. అందులో నేనొక సభ్యురాల్ని. ఈ గ్రూపులోనే తిరుమలశెట్టి మాధురి అనే ఐటీ ప్రొఫెషనల్ పరిచయమ్యారు. మేమిద్దరం స్నేహంగా ఉండేవాళ్లం. ఒక రోజు మాకు పరిచయం ఉన్న వారు వచ్చి ‘‘విజయవాడలోని ఒక పేద గర్భిణికి సీమంతం చేయించుకోవాలని కోరిక. కానీ ఆ ఆమె తల్లిదండ్రులకు ఆ స్తోమత లేదు. మీరు సాయపడతారా?’’ అని అడిగారు. నేను, మాధురి.. మాకు పరిచయం ఉన్న మరికొందరి సాయంతో ఆ గర్భిణికి శ్రీమంతం చేశాం. ఆ క్షణం ఆమె కళ్లలో ఆనందబాష్పాలు మా అందరినీ కదిలించాయి. ఆమె తల్లిదండ్రులు తర్వాత మాకు ఫోన్ చేసి చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకు సామాజిక సేవలోకి దిగితే బాగుంటుందని మా అందరికీ అనిపించింది. ముందుగా ఐదుగురితో ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం.

గుప్పెడు బియ్యం...
మా సేవా కార్యక్రమాలను మా ఇళ్ల నుంచే మొదలుపెట్టాలని భావించాం. దీనికి ‘గుప్పెడు బియ్యం’ అని నామకరణం చేశాం. మాకు పరిచయం ఉన్న స్కూళ్లకు మా పిల్లలు చదువుతున్న స్కూళ్లకు వెళ్లి యాజమాన్యాలను సంప్రతించాం. ఆ స్కూళ్లలో ఒక ప్లాస్టిక్ డబ్బాను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ప్రతినెలా ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకొచ్చి ఆ డబ్బాలో వేయాలని చెప్పాం. డబ్బా నిండగానే మేము ఆ బియ్యాన్ని తీసుకునేవాళ్లం. వాటితో టమాటా రైస్, పులిహోర, బిసిబెలా బాత్, కిచిడీ, సాంబార్ అన్నం తయారు చేయించేవాళ్లం. దాన్ని విద్యార్థులతోనే పేదలకు పంపిణీ చేయించేవాళ్లం. ఇది కొనసాగుతూ ఉండగా... మా సేవా కార్యక్రమాలకు ఒక వేదిక ఉండాలని సంకల్పించాం. ఆ సంకల్పం నుంచే ‘స్పృహార్తి చారిటబుల్ ట్రస్ట్’ ఆవిర్భవించింది. స్పృహతో చేసే సేవ పరిపూర్ణంగా ఉండాలని ఆలోచించి ఈ పేరు పెట్టాం. ఇప్పుడు మా ట్రస్ట్‌లో మొత్తం 50 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇప్పటికీ ‘గుప్పెడు బియ్యం’ ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. మేము ఎవరి నుంచీ విరాళాలు సేకరించడం లేదు. ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మా సభ్యులంతా కలిసి చర్చించుకుంటాం. దానికి అయ్యే ఖర్చును మేమే భరిస్తాం. ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రభుత్వాసుపత్రిలో జన్మించిన... పేద కుటుంబాల శిశువులకు బేబీ కిట్లు అందజేస్తున్నాం. ఆ కిట్‌లో ఒక నెలకు సరిపడా సరుకులు ఉంటాయి.
‘ఆత్మీయం’గా...
మేము ‘ఆత్మీయులు’ పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. ట్రస్ట్‌లోని సభ్యులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలో పోస్టు చేస్తారు. దానిపై చర్చించుకుని ముందుకు సాగుతాం. బడికి, ఇంటికి, ట్యూషన్‌కు మధ్య దూరం కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు అందజేశాం. దీని కోసం ‘సంప్రదాయ వస్త్రధారణ’ పేరుతో ‘కళాశాల విద్యార్థులకు ఫ్యాషన్ షో నిర్వహించి, దానికి టికెట్ నిర్ణయించాం. వచ్చిన డబ్బుతో సైకిళ్లు కొనుగోలు చేసి పంపిణీ చేశాం. మూగ, చెవుడు, అంధత్వం ఉన్న వారిని ఆదుకోవడానికి దివ్యాంగులతో సంగీత విభావరి ఏర్పాటు చేశాం. తద్వారా పోగయిన మొత్తంతో వారికి అవసరమైన పరికరాలు తయారు చేయించి ఇచ్చాం. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడను వరదలు ముంచేసినప్పుడు... జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీని మా ట్రస్ట్ దత్తత తీసుకుంది. అక్కడ ఉన్న నిర్వాసితులకు అల్పాహారాన్ని, భోజన వసతిని ‘స్పృహార్తి’ కల్పించింది.
గుడాల శ్రీనివాస
ఫొటోలు: పి.రాజేష్
ఇవి కూడా చదవండి..
సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం