Journey of Chef Shipra Khanna: పప్పన్నం నుంచి పారిస్ వరకు
ABN , Publish Date - Dec 29 , 2025 | 06:50 AM
సాధారణంగా ఎవరికైనా 30 ఏళ్లు వచ్చాక జీవితం మీద ఒక స్పష్టత వస్తుంది. కెరీర్, బంధాలు, బాధ్యతల గురించి అప్పుడు ఆలోచించడం మొదలుపెడతారు. కానీ ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ షిప్రా ఖన్నా కథ వేరు...
సాధారణంగా ఎవరికైనా 30 ఏళ్లు వచ్చాక జీవితం మీద ఒక స్పష్టత వస్తుంది. కెరీర్, బంధాలు, బాధ్యతల గురించి అప్పుడు ఆలోచించడం మొదలుపెడతారు. కానీ ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ షిప్రా ఖన్నా కథ వేరు. 30 ఏళ్లు రాకముందే ఆమె ఒక నిప్పుల కొలిమిని దాటి వచ్చారు. గృహహింసను ఎదిరించి విడాకులు తీసుకుని, తన ఇద్దరు పిల్లల కోసం న్యాయపోరాటం చేస్తూనే 29 ఏళ్ల వయసులో ‘మాస్టర్ షెఫ్ ఇండియా-2’ విజేతగా నిలిచి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు.
షిప్రా ఖన్నాకు వంట అనేది కేవలం వృత్తి కాదు, అదొక భావోద్వేగం. ఆమె వంటగదిలోకి అడుగుపెట్టడానికి కారణం తన కూతురు. తన బిడ్డకు ఆరోగ్యాన్నిచ్చే, బయట దొరకని ప్రత్యేక వంటకాలను ఇంట్లోనే తయారుచేయడం మొదలుపెట్టారు షిప్రా. ‘‘నా బిడ్డ ఆకలి తీర్చడానికి నేను చేసిన ప్రయత్నమే ఈ రోజు నన్ను ఒక షెఫ్‌గా నిలబెట్టింది. నాకు తెలిసింది, నేను ప్రేమించేది వంటను మాత్రమేనని అప్పుడే అర్థమైంది’’ అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఆమెలోని అసలు షెఫ్ తొమ్మిదేళ్ల వయసులోనే మేల్కొన్నారు. ఒకరోజు ఫ్రిజ్‌లో ఉన్న వాటితో ఏదో ప్రయోగం చేశారు. అది చూసి తండ్రి మెచ్చుకోవడమే ఆమె ప్రయాణానికి తొలి అడుగు.
సవాళ్ల పొయ్యి మీద విజయాల విందు
మాస్టర్ షెఫ్ గెలిచిన తర్వాత షిప్రా జీవితం పూలబాట కాలేదు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ప్రొఫెషనల్ కిచెన్స్‌లో ఒక మహిళగా నిలదొక్కుకోవడం ఆమెకు సవాలుగా మారింది. ‘‘అహ్మదాబాద్‌లో నా మొదటి రెస్టారెంట్ తెరిచినప్పుడు ఒక సీనియర్ షెఫ్ నేను చెప్పే సూచనలను తీసుకోలేకపోయారు. తనకు 20 ఏళ్ల అనుభవం ఉందని పదేపదే గుర్తు చేసేవారు. ఒక మహిళగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇతరుల కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది’’ అని షిప్రా తన పోరాటాన్ని వివరించారు.
స్ఫూర్తి ప్రదాత
హింసను అనుభవించి బయటపడిన షిప్రా మాటలు ప్రతి మహిళకు ధైర్యం ఇస్తాయి. ‘‘ఎవరి క్రూరత్వానికో బలి కావడానికి మనం పుట్టలేదు. చాలు.. ఇక చాలు! అని ఎప్పుడైతే మీరు గట్టిగా అనుకుంటారో అక్కడే మీ ఆత్మగౌరవం మొదలవుతుంది. కట్టుకున్న బంధం నుంచి బయటకు రావడం ఓటమి కాదు, అది ఒక తెగువ. మీ విలువ తెలిసిన రోజు ప్రపంచం మీ పాదాక్రాంతమవుతుంది’’ అని ఆమె ఇచ్చే సందేశం మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది.
తాతయ్య గోరుముద్దలే ఇష్టం
ప్రపంచ ప్రఖ్యాత వంటకాలు చేసినా, విదేశాల్లో రెస్టారెంట్లు నడుపుతున్నా (వచ్చే ఏడాది యూకేలో ‘ది వైట్ టైగర్’ను ప్రారంభించబోతున్నారు) షిప్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? అమ్మమ్మ చేసిన పప్పు-అన్నం, దానిపై కాస్తంత నెయ్యి. ‘‘చిన్నప్పుడు మా తాతయ్య తన చేతులతో తినిపించేవారు. ఆయన చనిపోయాక ఆ రుచి నాకు ఎక్కడా దొరకలేదు’’ అంటూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు.
జీవితమే ఒక రెసిపీ
తొమ్మిదేళ్ల వయసులో చేసిన మొదటి ప్రయోగం నుంచి పారిస్‌లో ప్రతిష్ఠాత్మక ‘లే కార్డన్ బ్లూ’లో పాఠాలు చెప్పే స్థాయి వరకు షిప్రా ప్రయాణం ఒక అద్భుతం. ఆమె రాసిన 9 వంటల పుస్తకాలు ప్రపంచస్థాయి అవార్డులను గెలుచుకున్నాయి. ‘‘ఏదీ రాత్రికి రాత్రే జరగలేదు. దీనివెనుక ఎంతో కష్టం, సహనం ఉన్నాయి’’ అంటారు షెప్రా.
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..