Share News

Yellow Bag Foundation Story: మార్పు వైపు ముందడుగు

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:46 AM

ఏ చిన్న వస్తువు కొన్నా దాంతోపాటు క్యారీబ్యాగ్‌ ఇంటికి వస్తుంది. ఒకటి ఒకటి కలిసి టన్నులకొద్దీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పేరుకుపోతోంది. భూమికి భారమై పర్యావరణానికి, సముద్రంలో చేరి జలచరాలకు...

Yellow Bag Foundation Story: మార్పు వైపు ముందడుగు

స్ఫూర్తి

ఏ చిన్న వస్తువు కొన్నా దాంతోపాటు క్యారీబ్యాగ్‌ ఇంటికి వస్తుంది. ఒకటి ఒకటి కలిసి టన్నులకొద్దీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పేరుకుపోతోంది. భూమికి భారమై పర్యావరణానికి, సముద్రంలో చేరి జలచరాలకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో గౌరీ గోపీనాథ్‌ జంటను కలవరపెట్టాయి. ఈ వ్యర్థాలను కొంతైనా తగ్గించాలని సంకల్పించారు. కార్పొరేట్‌ కొలువులు వదిలి... సొంత ఊరి బాట పట్టి... స్వచ్ఛంద సంస్థకు ఊపిరి పోశారు. పర్యావరణ హితంతో పాటు పేద మహిళలకు ఉపాధి మార్గమైన ఈ జంట జర్నీ... గౌరీ మాటల్లోనే...

‘‘నేను జీవిస్తున్న సమాజం... నా చుట్టూ ఉన్న పరిసరాలు... ఎప్పుడూ నన్ను ప్రభావితం చేస్తుంటాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా మనసు స్పందిస్తుంది. బహుశా అందుకేనేమో సామాజిక సేవను ఒక బాధ్యతగా స్వీకరించాను. తమిళనాడులోని మదురై మాది. 2005లో కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ అయ్యాక సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌షి్‌పలో కోర్సు చేశాను. రెండేళ్ల తరువాత నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. బెంగళూరు ‘ఇన్‌ఫినిటీ కంప్యూటర్‌ సొల్యూషన్స్‌’లో రెండున్నరేళ్లు పని చేశాను. 2008లో ఐబీఎంలో చేరాను. ఆరేళ్లు అందులోనే గడిచిపోయింది. అదే సమయంలో కృష్ణన్‌ సుబ్రమణియన్‌తో నా పెళ్లి జరిగింది. ఆయన కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగే. ఇద్దరికీ మంచి జీతాలు. ఏ లోటూ లేకుండా సాగిపోతోంది.


మా బాధ్యతగా...

క్షణం తీరిక లేని మా ప్రయాణంలో ఏదో తెలియని ఇబ్బంది. ఏంటని ఆలోచిస్తే... క్యారీ బ్యాగ్‌లు. ఇంట, బయట, చెత్తకుప్పల్లో... ఎక్కడ చూసినా అవే. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ భూమిలో కరగదు. వీటివల్ల పర్యావరణానికి, జీవజాతికి పెను ముప్పు సంభవిస్తుంది. ఈ కాలుష్యంలో నేనూ భాగస్వామినే. తెలిసీ ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి అడ్టుకట్ట ఎలా వేయాలి? అప్పటికి మా దగ్గర సమాధానం లేదు. కానీ ఎక్కడో అక్కడ తొలి అడుగు పడాలి కదా. ఆ అడుగు మేమే వేయాలని అనుకున్నాను. నా ఆలోచనకు మావారు కూడా మద్దతుగా నిలిచారు. అంతే... ఆ మరుక్షణమే ఇద్దరం మా ఉద్యోగాలకు రాజీనామా చేసి, మదురైకి తిరిగి వచ్చేశాం.

0000Business.jpg

ప్రత్యామ్నాయంగా...

క్యారీబ్యాగ్‌లకు ప్రత్యామ్నాయం... గుడ్డ సంచులని మేం భావించాం. వాటిపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవాళ్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో... ‘ప్రత్యామ్నాయం అంటున్నారు సరే. మరి ఇలాంటి సంచులు ఎక్కడ దొరుకుతాయి’ అని కొందరు మమ్మల్ని ప్రశ్నించారు. దానికి మా వద్ద సమాధానం లేదు. ఊరంతా వెతికాం. ఎక్కడా కనిపించలేదు. చివరకు మేమే వాటిని తయారు చేయాలని నిర్ణయించాం. అలా 2014లో తక్కువ పెట్టుబడితో ‘ఎల్లో బ్యాగ్‌ ఫౌండేషన్‌’ నెలకొల్పాం. దాని ద్వారా క్లోత్‌ బ్యాగ్‌ల తయారీ మొదలుపెట్టాం.

నైపుణ్య శిక్షణ...

మదురైతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా మా పర్యావరణహిత బ్యాగ్‌ల ప్రత్యేకతల గురించి వివరించాం. వాటివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, అందరూ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల వదిలి క్లాత్‌ బ్యాగ్‌లను ఉపయోగించాలని కోరాం. చాలామంది స్పందించారు. క్రమంగా మాకు ఆర్డర్లు పెరిగాయి. అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది.

దాంతో పేద మహిళలకు బ్యాగ్‌లు కుట్టడంలో ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించాం. ఇప్పటివరకు ఐదు వందలమందికి పైగా నైపుణ్య శిక్షణ ఇచ్చాం. టైలరింగ్‌తో పాటు బ్యూటీషియన్‌ కోర్సులు కూడా నేర్పించి, వారిని సాధికారత దిశగా నడిపించగలిగాం. మా సంస్థలో శిక్షణ తీసుకున్నవారిలో చాలామంది సొంతంగా బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ నిర్వహిస్తున్నారు. కొందరు బ్యూటీపార్లల్స్‌ ఏర్పాటు చేశారు.


ఆర్థిక స్వాతంత్య్రం...

పేదరికంలో మగ్గుతున్న మహిళలు, భర్త వేధింపులకు తట్టుకోలేక అత్తింటిని వదిలినవారు ఎంతోమందికి ‘ఎల్లో బ్యాగ్‌’ గౌరవప్రద జీవితాన్ని ఇస్తోంది. ఆర్థిక స్వాతంత్ర్యాని అందిస్తోంది. అంతేకాదు ఏడెమిదేళ్లు అయ్యేసరికి సంస్థ టర్నోవర్‌ కూడా మూడు కోట్లు దాటింది. అన్నిటికీ మించి ఒక్క మదురైలోనే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను గణనీయంగా తగ్గించగలిగాం. నాడు మేం వేసిన ఒక చిన్న అడుగు నేడు ఎన్నో సంస్థలకు, ఎంతోమంది వ్యక్తులకు ఆదర్శమైంది. మంచి మార్పునకు నాంది అయింది. ఒక మహిళగా ఇది నేను సాధించిన విజయం అపురూప విజయం.’’

ఈ వార్తలు కూడా చదవండి..

పూర్వ జన్మ సుకృతం.. అందుకే..

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

Updated Date - Sep 11 , 2025 | 02:46 AM