Share News

Transgender Entrepreneur: భిక్షాటన నుంచి బాస్‌గా

ABN , Publish Date - Jul 10 , 2025 | 02:33 AM

From Begging to Boss The Inspiring Journey of a Transgender Entrepreneur

Transgender Entrepreneur: భిక్షాటన నుంచి బాస్‌గా

ధీర

అందరు పిల్లల్లా బాల్యాన్ని ఆస్వాదించలేక పోయింది. చిన్న వయసులోనే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించింది. అడుగడుగునా అవమానాలు... చీత్కారాలు... అన్నిటినీ తట్టుకొని నిలబడింది. అయినవారు కాదంటే... ఒకప్పుడు వీధుల్లో బిచ్చమెత్తిన ఆమె... ఇప్పుడు ఆటోలు కొని మరికొందరికి జీవనోపాధి కల్పిస్తోంది. సామాజిక సేవలోనూ భాగమై... ప్రశంసలు అందుకొంటున్న అనీ మంగళూర్‌ కథ ఇది.

‘‘జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేం. ఊహ తెలిసింది మొదలు ఎన్నో అవమానాలు... మరెన్నో చులకన మాటలు. అనుభవం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ సమాజాన్ని ఎదిరించి... నా కాళ్లపై నేను నిలబడేందుకు ప్రేరణనిచ్చింది. కర్ణాటక రాయ్‌చూర్‌ జిల్లా హిరిదిన్ని అనే చిన్న గ్రామంలో మాది ఒక నిరుపేద కుటుంబం. అంతులేని కష్టాలు... తరచూ పస్తులు... ఇవేవీ మాకు కొత్తకాదు. కానీ నా జీవితం భిన్నమైన మలుపు తీసుకుంది. నేను పుట్టగానే ఇంట్లోకి అబ్బాయి నడిచొచ్చాడని అనుకున్నారు మా అమ్మానాన్న. అజిబాబుగా నామకరణం చేశారు. కానీ చిన్న వయసులోనే నేను నలుగురిలో భిన్నంగా కనిపిస్తున్నాని, నా మాట, నడత ప్రత్యేకంగా ఉన్నాయని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి చుట్టుపక్కలవారు, స్నేహితులే కాదు... ఇంట్లోవాళ్లూ నన్ను దూరం పెట్టారు. నాలో ఏ లోపం ఉందో, నన్ను ఎందుకు అందరూ వింతగా చూస్తున్నారో అర్థమయ్యేది కాదు. క్రమంగా నాలో జరుగుతున్న మార్పులు నేనూ గమనించాను. డ్రెస్‌లు అవీ అబ్బాయిలా వేసుకున్నా... లోపల అమ్మాయిలా భావన.


అందరూ ఉన్నా ఒంటరినే...

కొన్నాళ్లకు తెలిసింది... నేను ట్రాన్స్‌జెండర్‌ని అని. ఆ క్షణం నేను అనుభవించిన మనోవేదన మాటల్లో చెప్పలేను. నాలో నేను కుమిలిపోయాను. చీకటి గదిలో కూర్చొని కన్నీళ్లు కార్చాను. ఆ భయంకర వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాను. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరి అయ్యానన్న బాధ ఎన్నో నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను చదువు ఆపలేదు. చదువుకొనే రోజుల్లో నా గురించి చాలామందికి తెలియదు. ఎలాగో నెట్టుకువచ్చాను. 79 శాతం మార్కులతో బీఏ పూర్తి చేశాను. దాంతో మంగళూరు ప్రభుత్వ బీఈడీ కాలేజీలో ఉచిత సీటు వచ్చింది. మా ఊళ్లో ఈ ఘనత సాధించిన అతికొద్దిమందిలో నేనూ ఉన్నాని తెలిసి ఎంతో గర్వపడ్డాను.

ట్రైనింగ్‌ మధ్యలో అలా...

మంచి మార్కులతో టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నది నా కల. ఒక వైపు దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నా... నాలో ఏదో ఒక మూల తెలియని ఆందోళన. ఎక్కడ నా వ్యక్తిగత గోప్యత బయటకు తెలుస్తుందోననే భయం. అదే జరిగితే చదువు మధ్యలో ఆగిపోతుంది. కల చెదిరిపోతుంది. కానీ ఎంత ప్రయత్నించినా సహజసిద్ధంగా జరిగే మార్పులను ఆపలేం కదా. సరిగ్గా బీఈడీ మధ్యలో ఉండగా... నన్ను అంతా ప్రత్యేకంగా, సందేహాస్పదంగా చూడడం మొదలుపెట్టారు. అవహేళనలు, అవమానకర మాటలు... భరించలేకపోయాను. శారీరకంగానే కాదు... మానసికంగా, సామాజికంగా, భావోద్వేగాలపరంగా కుంగిపోయాను. చివరకు ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. ఇన్ని గందరగోళ పరిస్థితుల మధ్య చదువుపై ఏకాగ్రత కుదరలేదు. రాత్రిళ్లు నిద్రలో కూడా నన్ను ఎవరో ప్రశ్నిస్తున్నట్టు, వింతగా చూస్తున్నట్టు, చులకన చేస్తూ ఆట పట్టిస్తున్నట్టు అనిపించేది. అలా పక్కకు వెళ్లగానే వెనకాల నా గురించి గుసగుసలు... తట్టుకోలేక చదువు ఆపేశాను.


ఆ ఒక్క కారణంతో కాదన్నారు...

క్రమంగా నా రూపంలో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తూ వచ్చాయి. అయినవారు, కావల్సినవారు... ఎవరూ నన్ను దగ్గరకు రానివ్వలేదు. అప్పుడే అనుకున్నా... ఈ సమాజానికి భయపడుతూ జీవించకూడదని. నా కాళ్లపై నేను నిలబడాలని. కానీ నేను ఒకటి తలిస్తే విధి నిర్ణయం మరోలా ఉంది. కాలేజీ వదిలేశాక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. కార్యాలయాలు, రెస్టారెంట్ల తలుపు తట్టాను. కనీసం నేను చెప్పేది పూర్తిగా వినకుండానే ‘ఇక్కడ ఖాళీలు ఏవీ లేవు’ అంటూ ముఖం మీద తలుపు వేసేశారు. ఉద్యోగం కోసం వెళ్లడం... వాళ్లు వద్దనడం... అలవాటుగా మారిపోయింది. నా నైపుణ్యం, నా చదువుతో ఎవరూ పట్టించుకోలేదు. ట్రాన్స్‌ మహిళను అనే ఒకే ఒక్క కారణంతో నేను పనికిరానని చెప్పేశారు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. నిర్వేదానికి గురి చేసింది.

నాకు నేనే...

‘ట్రాన్స్‌జెండర్లు అంటే బిచ్చమెత్తుకొని బతకాల్సిందేనా? మాకు ఈ సమాజంలో చోటు లేదా’ అని నాలో నేనే ప్రశ్నించుకున్నాను. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. తిండికి లేక, తల దాచుకోవడానికి కాస్త నీడ లేక కొంత కాలం వీధుల్లో బిచ్చమెత్తాను. ఆటో కోసం చెయ్యి ఎత్తితే... నన్ను ఎగాదిగా చూసి వెళ్లిపోయేవారు. ఒక రోజు రాత్రి నా పరిస్థితి తలుచుకుని ఇంటికి వెళుతున్నంతసేపూ ఏడుస్తూనే ఉన్నా. ఆ క్షణం... ‘ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకు. నీకు నువ్వుగా ఎదగడానికి, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నించు’ అని మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. నిజమే... నా కోసం నేనే నిలబడాలి. అందుకే మరుసటి రోజే వెళ్లి ఆటో డ్రైవింగ్‌ శిక్షణలో చేరాను.


అలా ఓనరునయ్యాను...

కేవలం ఆటో నడిపి జీవనోపాధి పొందాలన్న ఉద్దేశంతో శిక్షణ తీసుకోలేదు. ఎప్పటికైనా సొంత ఆటో సమకూర్చుకోవాలని అనుకున్నాను. అప్పుడే కదా... ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండుదు. కానీ ఆటో ఎలా కొనాలి? నాకు ఏ బ్యాంకూ రుణం ఇవ్వదని తెలుసు. అందుకే ఆటో డ్రైవర్లను సంప్రతించాను. అప్పు తీసుకొని ఈఎంఐలు కట్టలేనివారి వద్ద ఆటోలు కొన్నాను. మిగిలిన ఈఎంఐలు నేను చెల్లించేట్టు ఒప్పందం చేసుకున్నాను. మొదట ఒకటి కొన్నాను. నెలల వ్యవధిలో నాలుగు ఆటోలకు ఓనరునయ్యాను. వాటిని అద్దెకు తిప్పుతున్నాను. ఆ డబ్బుతో నా జీవితం సాఫీగా సాగిపోతోంది. రుణం కూడా పూర్తికావొచ్చింది. ఇప్పుడు నేను ఒకరిపై ఆధారపడకుండా ఎంతో గౌరవంగా జీవిస్తున్నాను. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇంతకు మించిన సంతృప్తి ఏముంటుంది!’’

షరతులకు లోబడి...

ఆటోలు అద్దెకు తీసుకొనేవారికి ఒక షరతు పెడతాను. దానికి ఒప్పుకొంటేనే ఆటోలు ఇస్తాను. అవేంటంటే... గర్భిణులు, వయసు పైబడిన ట్రాన్స్‌జెండర్లు ఆటో ఎక్కితే వారిని ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. ఈ షరతుతో కూడిన స్టిక్కర్లు నా ఆటోలపై కూడా ఉంటాయి. నేను చేసే సాయం చిన్నదే. కానీ ఈ సందేశం మరికొందరికి స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా నాలాంటివారికి భరోసా ఇస్తుందనేది నా నమ్మకం. ఇదేకాకుండా నేను సర్టిఫైడ్‌ జిమ్‌ ట్రైనర్‌ను. మరో విశేషం ఏంటంటే ఇటీవలే ఒక సినిమాలో కూడా నటించాను. వృద్ధ ట్రాన్స్‌జెండర్లకు ఒక వసతి ఏర్పాటు చేయాలనేది నా సంకల్పం. నాలాంటివారు ఎవరూ పొట్ట కూటికి బిచ్చమెత్తడమో, వ్యభిచారమో చేయకూడదు. గౌరవంగా బతకాలి.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 02:33 AM