Share News

పోలీస్‌ అంటే భయం కాదు ధైర్యం

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:44 AM

ఖాకీ డ్రెస్‌ వేసుకోవాలి... పోలీస్‌ ఉద్యోగం చేయాలి... ఈ కల నెరవేర్చుకోవడానికి... అందివచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఎందరు నిరుత్సాహపరిచినా, ఎగతాళి చేసినా లెక్క చెయ్యకుండా...

పోలీస్‌ అంటే భయం కాదు ధైర్యం

ఖాకీ డ్రెస్‌ వేసుకోవాలి... పోలీస్‌ ఉద్యోగం చేయాలి... ఈ కల నెరవేర్చుకోవడానికి... అందివచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు.

ఎందరు నిరుత్సాహపరిచినా, ఎగతాళి చేసినా లెక్క చెయ్యకుండా... పట్టుదలతో శ్రమించి తన లక్ష్యం నెరవేర్చుకున్నారు.

ఇప్పుడు ప్రజలతో మమేకమై వారి మన్ననలతో పాటు సీఎం నుంచి, ఉన్నతాధికారుల నుంచి అభినందలను అందుకుంటున్నారు.

పోలీస్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ఆశయమంటున్న హనుమకొండ జిల్లా వంగర ఎస్‌ఐ గొల్లపల్లి దివ్య ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

‘‘మాది కరీంనగర్‌ జిల్లా కేశవపట్నానికి చెందిన వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు సమ్మయ్య, దేవేంద్రలకు నేను, చెల్లి... ఇద్దరు పిల్లలం. ‘‘ఇద్దరూ అమ్మాయిలేనా? కొడుకులు లేరా?’’ అని ఇరుగుపొరుగువారు అనేవారు. ‘‘కూతుళ్లయినా, కొడుకులైనా వీళ్లే’’ అని అమ్మానాన్నా ధైర్యంగా చెప్పేవారు. మమ్మల్ని చదివించడానికి వాళ్లు ఎంత కష్టపడుతున్నారో ప్రత్యక్షంగా చూశాను. ప్రతి పరీక్షలో టాప్‌-10లో ఉండాలనే లక్ష్యంతో చదివాను. పదో తరగతి పరీక్షల్లో మా స్కూల్‌ టాపర్‌గా నిలిచాను. స్టేట్‌ లెవల్‌ కూడా టాప్‌ 10లో ఉన్నాను. బాసర ఐఐఐటీలో నాకు మొదటి కౌన్సెలింగ్‌లోనే సీటు వచ్చింది. అక్కడ బీటెక్‌ పూర్తి చేసి, ఉద్యోగ వేటలో పడ్డాను.


ఆ ఫొటో చూసి...

వీఆర్‌వో ఉద్యోగాలకు 2021-22లో నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేశాను. పరీక్ష రాశాను. మరోవైపు బ్యాంక్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాను. ఆ సమయంలో... కరెంట్‌ అఫైర్స్‌ కోసం వార్తా పత్రికలు చదువుతున్నప్పుడు... ఒక ఫొటో నన్ను ఆకర్షించింది. కరీంనగర్‌ ప్రాంతంలోనే... హేమలత అనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జీపు దగ్గర నిలబడి, ప్రజలతో ఏదో చర్చిస్తున్నట్టున్న ఫొటో అది. ‘నేనెందుకు పోలీస్‌ కాకూడదూ?’ అనే ఆలోచన నాలో ఉద్భవించిన క్షణం అది. అప్పటి నుంచి పోలీస్‌ వృత్తి నా డ్రీమ్‌ జాబ్‌గా మారిపోయింది. నా ఉద్దేశాన్ని నాన్నకు చెప్పినప్పుడు... ‘‘ఎందుకమ్మా పోలీస్‌ నౌకరీ? ఇంజనీరింగ్‌ చేశావు కదా... ఏదైనా ఉద్యోగం దొరకదా?’’ అన్నారు. ఈ సంగతి తెలిసి మా ఊర్లో చాలామంది ఎగతాళి చేశారు. ‘‘ఆడపిల్లవు... నీకెందుకు పోలీస్‌ ఉద్యోగం? ఏదో ఒక చిన్నపాటి నౌకరీ చూసుకొని... మీ అమ్మానాన్నలకు ఆసరాగా ఉండొచ్చు కదా?’’ అని సలహా ఇచ్చారు. దాంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యాను. ఇంతలో ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఏదైతే అది అవుతుందని దరఖాస్తు చేశారు. ‘‘ఆ ఉరుకుడు, దునుకుడు నీ వల్ల అయితదా... నువ్వసలే కొంచెం లావుగా ఉన్నావు’’ అన్నారు నా స్నేహితుల్లో చాలామంది. ఎవరి మాటలూ పట్టించుకోలేదు. పట్టుదలగా ప్రిపేర్‌ అయ్యాను. ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఫిజికల్‌ టెస్ట్‌లో కూడా విజయం సాధించాను.


00-navya.jpg

నా కోరిక... వారి ప్రోత్సాహం

ఆ తరువాత... మెయిన్స్‌ పరీక్షకు సిద్ధమవుతూ ఉండగా.. వీఆర్‌వో పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాజన్న-సిరిసిల్ల జిల్లాలో నాకు ఉద్యోగం వచ్చింది. అందులో చేరిపోవాలనీ, దీన్ని వదులుకున్నాక... ఎస్‌ఐ మెయిన్స్‌లో క్వాలిఫై కాకపోతే... రెండిటికీ చెడినట్టు అవుతుందనీ ఎందరో చెప్పారు. ‘‘అసలే మీది బీద కుటుంబం. ఆలోచించుకో’’ అన్నారు. అయితే... ఖాకీ డ్రెస్‌ ధరించాలన్న నా బలమైన కోరికకు... మా అమ్మానాన్నల ప్రోత్సాహం తోడై, నాలో ఉత్సాహాన్ని నింపింది. ‘‘మా గురించి ఆలోచించకు బిడ్డా... నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో’’ అని వారు చెప్పడంతో... ఎస్‌ఐ ఉద్యోగం వైపే ధైర్యంగా మొగ్గుచూపాను. మెయిన్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలిని అయ్యాను. ఎస్‌ఐ శిక్షణ తరువాత... వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఉద్యోగం వచ్చింది. మొదట మడికొండ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. తరువాత ఇటీవలే వంగరకు ఎస్‌హెచ్‌ఓగా బదిలీ అయ్యాను. వంగర... మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు గారి స్వగ్రామం. ఇక్కడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చాలా తక్కువ గ్రామాలు ఉన్నాయి. ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ వివాదాల కేసులే వస్తూ ఉంటాయి. కాగా... ఈ మధ్య ఒక యువకుడు గంజాయి తాగుతూ దొరికిపోయాడు. హైదరాబాద్‌ నుంచి అతని స్నేహితుడు గంజాయి పంపినట్టు విచారణలో తేలింది. దీని గురించి మా పై అధికారులకు సమాచారం ఇచ్చాం. యువత బాధ్యతగా ఉండాలి. గంజాయి, డ్రగ్స్‌కు బానిసలై, సైబర్‌ మోసాలకు పాల్పడి, తమ జీవితాలను నాశనం చేసుకోకూడదు.

తడుక రాజనారాయణ

ఫొటోలు: వీరగోని హరీష్‌


ఆ భయం పోగొట్టడానికి...

పోలీసు వాహనాన్ని చూస్తేనే ప్రజలకు భయం. ఏదైనా సమాచారం అడిగినా... చెప్పడం లేదు. వారి ఇంటి పక్కన నేరస్తుడు ఉన్నా... చెప్పే పరిస్థితి లేదు. పోలీసు వాహనాల్లో వెళ్లడం వల్ల ప్రజలకు దగ్గర కాలేకపోతున్నామని గ్రహించాం. అందుకే సైకిళ్లు కొనుగోలు చేశాం. రోజూ ఉదయం సైకిళ్లపై గ్రామాలకు వెళ్తున్నాం. దాంతో ప్రజలు మమ్మల్ని ఆసక్తిగా చూడడంతో పాటు మాతో మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. ఊరి సమస్యలను వారితో చర్చిస్తున్నాం. ఊరికి ఎవరైనా కొత్తగా వచ్చినా, అనుమానాస్పదంగా కనిపించినా మాతో చెబుతున్నారు. మాదక ద్రవ్యాలు వాడుతున్నవారి వివరాలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. కాగా.... వివిధ సమస్యలతో పాటు పిల్లలు పట్టించుకోవడం లేదని వృద్ధులు చేసే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మొత్తంగా మాకు వచ్చిన ఈ ఆలోచన ప్రజలకు ప్రయోజనకరంగా ఉండడం, నేరాలను అరికట్టేందుకు... ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉపయోగపడడం ఆనందంగా ఉంది.

ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో... ‘వారెవ్వా... వంగర పోలీస్‌’ అనే కథనం రావడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, మా డీజీపీ అభినందనలు తెలపడం జీవితంలో మరచిపోలేను. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ధన్యవాదాలు. అదే స్థూర్తితో పేదలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తాను.’’

ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 05:44 AM