Share News

Forest Queen Assam: అడవి రాణి

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:44 AM

ప్రకృతిని కాపాడుకోకపోతే మానవాళికి భవిష్యత్తు లేదన్న నాన్న మాట మున్ముని పాయెంగ్‌కు మంత్రమయింది.తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ... ప్రజల్ని కూడగట్టింది. ఆమె, ఆమె బృందం రెండేళ్ళలో పది లక్షల మొక్కలు నాటి...

Forest Queen Assam: అడవి రాణి

ప్రకృతిని కాపాడుకోకపోతే మానవాళికి భవిష్యత్తు లేదన్న నాన్న మాట మున్ముని పాయెంగ్‌కు మంత్రమయింది.తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ... ప్రజల్ని కూడగట్టింది. ఆమె, ఆమె బృందం రెండేళ్ళలో పది లక్షల మొక్కలు నాటి... ఆకుపచ్చ విప్లవాన్ని సృష్టించారు. ‘‘మేము నాటే ప్రతి మొక్కా భవిష్యత్తుకు హామీ ఇస్తుంది. మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అంటోంది అసోంకు చెందిన పాతికేళ్ళ ‘ఫారెస్ట్‌ క్వీన్‌’ మున్ముని.

చిన్నప్పుడు నాన్న భుజాల మీద కూర్చొని, అడవిలో తిరుగుతూ, ఆయన మొక్కలు నాటుతూ ఉంటే, తను కూడా ఓ చెయ్యి వేస్తానని మారాం చేయడం... మున్ముని పాయెంగ్‌కు ఇష్టమైన జ్ఞాపకం. హఠాత్తుగా వరదలు ముంచుకొచ్చి భూమి కోతకు గురై... విలయంలో చిక్కుకున్న జనం నిస్సహాయత... ప్రతి వర్షాకాలంలో ఆమె కళ్ళెదుట నిలిచిన వాస్తవం. ఆ జ్ఞాపకంతో, ఈ వాస్తవంతో మున్ముని జీవితం పెనవేసుకుపోయింది.

ఆయనను చూసే నేర్చుకున్నా...

మున్ముని స్వస్థలం అసోం రాష్ట్రంలో... బ్రహ్మపుత్ర నదిలో ఉన్న అతి పెద్ద దీవి... మాజులీ. ప్రకృతి వైపరీత్యాల మధ్య జనం బిక్కుబిక్కుమంటూ గడిపే ఆ దీవికి ఒక కొత్త రూపు తెచ్చిన వ్యక్తి జాదవ్‌ మొలోయ్‌ పాయెంగ్‌. తమ దీవిని కాపాడుకోవాలనే తపనతో... రోజుకు ఒక మొక్క నాటే దీక్షను ఆయన తన పదహారేళ్ళ వయసులో చేపట్టారు. ఆయన కృషితో... ముప్పైయ్యేళ్ళలో... బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బల్లో... 1,360 ఎకరాల అడవి ఏర్పడింది. ఆ అడవిని జనం ‘మొలోయ్‌ కథోనీ’ అని ఆయన పేరిటే పిలుచుకుంటారు. ‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా అంతర్జాతీయంగానూ ప్రసిద్ధుడైన జాదవ్‌ 2015లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. ‘‘నాకు అడుగడుగునా నాన్నే స్ఫూర్తి. మంచి మనిషిగా బతకాలి. కష్టపడి పని చెయ్యాలి. ఇతరులకు సాయపడాలి. ప్రకృతి సంపద పెరుగుదలకు దోహదం చేయాలి... ఇవి నాన్న నాకు చెప్పిన పాఠాలు. చిన్న స్థాయిలో ప్రారంభించినా అకుంఠిత దీక్షతో కొనసాగిస్తే... అసాధ్యాలు సుసాధ్యాలవుతాయనేది ఆయనను చూసే నేర్చుకున్నాను’’ అని చెబుతోంది మున్ముని. ‘‘నాన్న నాటిన అడవి ఇప్పుడు బెంగాల్‌ టైగర్స్‌, ఖడ్గమృగాలు, లేళ్లు, కుందేళ్ళు, కోతులు, రకరకాల పక్షులు, వైవిధ్యభరితమైన చెట్లతో కళకళలాడుతోంది. ప్రతి సంవత్సరం వందకి పైగా ఏనుగులు వచ్చి, ఆరు నెలలపాటు అందులో విడిది చేస్తాయి. ఒకప్పుడు బీడులా ఉండే ఆ ప్రాంతం ఇలా మారడానికి నాన్న ముందుచూపు, పట్టుదల కారణం. వాటినే నేను వారసత్వంగా స్వీకరించాను’’ అంటోంది మున్ముని.


మొలోయ్‌ కథోనీ 2.0

తండ్రి పేరిట నడుస్తున్న ‘ఫారె్‌స్టమ్యాన్‌ ఫౌండేషన్‌’లో కార్యకర్తగా చేరిన ఆమె ప్రస్తుతం ఆ సంస్థకు కార్యదర్శిగా వ్యవహరిస్తోంది. అలాగే ‘సెజు ధరణి’ (ఆకుపచ్చని భూమి) అనే సంస్థను మరికొందరితో కలిసి స్థాపించింది. మాజులీ, జోర్హాట్‌ జిల్లాల్లోని సుమారు అరవై గ్రామాల ప్రజలకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించింది. వారిని బృందంగా ఏర్పాటు చేసి... 2022లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండేళ్ళ వ్యవధిలో ఆమె, ఆమె బృందం పది లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ యజ్ఞం ఇంకా కొనసాగుతోంది. ‘‘కోటి మొక్కలు నాటడం ప్రస్తుతం మా లక్ష్యం’’ అంటున్న మున్మునిని అందరూ ‘ఫారెస్ట్‌ క్వీన్‌’ అని ఆప్యాయంగా పిలుస్తారు. గ్రామస్తులు, పర్యావరణ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో... ‘సబ్‌స్టాన్షియల్‌ గ్రీన్‌ ఇనీషియేటివ్‌ అండ్‌ క్లైమెట్‌ జస్టిస్‌’ సంస్థ సహకారంతో ‘మొలోయ్‌ కథోనీ 2.0’ ప్రాజెక్ట్‌ను ఇటీవలే ఆమె ప్రారంభించింది.

ఆ బాధ్యత తీసుకోవాలి...

‘‘బ్రహ్మపుత్ర తీరం, దీవులు పచ్చదనంతో కళకళలాడాలనేది మా నాన్న కల. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఉధృతమైన వరదలకు ఈ ప్రాంతంలోని దీవులు మునిగిపోవడం, అపారమైన పశు నష్టం, ఆస్తి నష్టం, పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతూ ఉండేది. అడవులు కొరవడడంతో గ్రామాల్లోకి ఏనుగులు మందలుగా వచ్చి విధ్వంసం సృష్టించేవి. దాన్ని నివారించడానికి చెట్ల పెంపకమే మార్గమనే ఆలోచనతో... చాలా చిన్న వయసులోనే మా నాన్న తన తన కృషిని ప్రారంభించారు. ఎడారిలా ఉండే ప్రాంతానికి పచ్చదనాన్ని తీసుకొచ్చారు. ‘‘మొక్కలు నాటడం, వాటిని పెంచడం అంటే మనల్ని కాపాడి, పోషిస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే’’ అని ఆయన మాకు ఎప్పుడూ చెబుతారు. ఆయన స్ఫూర్తితో... మా ప్రాంతానికే ప్రత్యేకమైన దేశీయమైన మొక్కలనే నాటుతున్నాం. అంతేకాదు... నాటిన ప్రతి మొక్కా పెరిగి పెద్దదయ్యేదాకా... బాధ్యత తీసుకుంటున్నాం. చెట్లు మనకు పండ్లు, కాయలు, పూలతో పాటు ఆక్సిజన్‌ అందిస్తాయి. వాటి బాధ్యత మనం తీసుకోకపోతే... భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది’’ అంటున్న మున్ముని... అసోం రాష్ట్రమంతటా పర్యటించి... ఆదివాసీ బృందాల నుంచి పాఠశాల పిల్లల వరకూ... వివిధ వర్గాల వారికి పర్యావరణ పరిరక్షణ గురించి, చెట్ల పెంపకం ఆవశ్యకత గురించి వివరిస్తోంది. కమ్యూనిటీ వర్క్‌షాపులు, అడవుల్లో ఎడ్యుకేషన్‌ వాక్స్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 04:44 AM