Share News

పులిస్తేనే ప్రయోజనం

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:35 AM

అయితే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌ మోతాదులను పెంచుకుని, మధుమేహంతో పోరాడాలనుకుంటే, వాటిని పులియబెట్టుకుని తినాలని ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు...

పులిస్తేనే ప్రయోజనం

అధ్యయనం

మీరు చిక్కుడు గింజలు, పప్పుధాన్యాలను ఇష్టపడతారా?

అయితే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌ మోతాదులను పెంచుకుని, మధుమేహంతో పోరాడాలనుకుంటే, వాటిని పులియబెట్టుకుని తినాలని ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

చిక్కుడు గింజలు, పప్పుధాన్యాలను పులియబెట్టి వాడుకోవడం వల్ల, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌ మోతాదులు, మధుమేహ వ్యతిరేక లక్షణాలు, నీటిలో కరిగే మాంసకృత్తుల మోతాదులు పెరుగుతాయని అమెరికా, ఇల్లినాయిస్‌ యూనివర్శిటీ ఆహార శాస్త్రవేత్తలు అంటున్నారు. వీళ్లు అధ్యయనంలో భాగంగా, మినుములు, అలసందలు, పచ్చి బఠాణీలు, ఎర్ర కందులను లాక్టిప్లాంటిబాసిల్లస్‌ ప్లాంటారమ్‌ అనే బ్యాక్టీరియా సహాయంతో పులియబెట్టినప్పుడు, వాటిలో యాంటీ ఆక్సిడెంట్‌ చర్య 83 శాతం మేరకు పెరగడం, టైప్‌2 మధుమేహ మార్కర్లను క్రమబద్ధీకరించే సామర్థ్యం 70 శాతానికి పెరగడాన్ని గమనించారు. అలాగే పులియబెట్టే ప్రక్రియ వల్ల, ఆయా పదార్థాల్లోని నీళ్లలో కలిసే ప్రొటీన్‌ పరిమాణం కూడా పెరిగినట్టు వాళ్లు తెలుసుకున్నారు. ఈ చిక్కుడు జాతి గింజల్లో 18 నుంచి 25 శాతం మేరకు అత్యంత నాణ్యమైన ప్రొటీన్‌ ఉంటుంది కాబట్టి ఇడ్లీ, దోసెల పిండ్ల మాదిరిగా వీటిని నానబెట్టి, పిండి రుబ్బి, పులియబెట్టి వండుకుని తినడం లేదా ఇతర పదార్థాలతో కలిపి తినడం అలవాటు చేసుకోవాలని వారు అంటున్నారు. ప్రపంచ ఆహార అభద్రత, సహజ వనరుల కొరత, వాతావరణ మార్పులతో ప్రజానీకం సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో వృక్షాధారిత ఆహారాల సుస్థిరతను అన్వేషించవలసిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:35 AM