Share News

ఆ మహిళలు.. పాముల్ని చిటికెలో పట్టేస్తారు..

ABN , Publish Date - Jul 20 , 2025 | 07:31 AM

పామును చూడగానే ఒక్కసారిగా హడలిపోతారెవరైనా. ఇంట్లోనో, ఆఫీసులోనో, పెరట్లోనో పాము కనిపిస్తే... వెంటనే వాటిని పట్టే వాళ్లకి ఫోను చేస్తారు. ‘స్నేక్‌ క్యాచర్స్‌’గా మగవాళ్లే ఉంటారన్నది నిన్నటి మాట. ఏమాత్రం బెదరకుండా, అత్యంత ఒడుపుగా పాములను పట్టేస్తున్న సాహస వనితలు దేశవ్యాప్తంగా చాలామందే ఉన్నారు.

ఆ మహిళలు.. పాముల్ని చిటికెలో పట్టేస్తారు..

పామును చూడగానే ఒక్కసారిగా హడలిపోతారెవరైనా. ఇంట్లోనో, ఆఫీసులోనో, పెరట్లోనో పాము కనిపిస్తే... వెంటనే వాటిని పట్టే వాళ్లకి ఫోను చేస్తారు. ‘స్నేక్‌ క్యాచర్స్‌’గా మగవాళ్లే ఉంటారన్నది నిన్నటి మాట. ఏమాత్రం బెదరకుండా, అత్యంత ఒడుపుగా పాములను పట్టేస్తున్న సాహస వనితలు దేశవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. సోషల్‌ మీడియాలో వారి వీరోచిత వీడియోలు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు... వందలాది విష సర్పాలు వారి ధైర్యం ముందు మోకరిల్లుతున్నాయి.

అటవీ అధికారిణి ‘పవర్‌’

తిరువనంతపురానికి చెందిన రోషిణి జి.ఎస్‌. పేరు ఈమధ్య దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. 18 అడుగుల కింగ్‌ కోబ్రాని పట్టుకుంటున్న ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలో ‘బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌’ రోషిణి. అక్కడి పరుథిపల్లి అడవికి సంబంధించిన ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృంద సభ్యురాలు. జనావాసాల్లోకి వెళ్లిన పాములను పట్టుకుని అడువుల్లోకి వదిలిపెడుతుంటారు. అవి ఎంత ప్రాణాంతకమైనా, భీకరంగా బుస కొడుతున్నా రోహిణి అదరదు, బెదరదు. వన్యప్రాణులపై ప్రేమతోనే ఆమె అటవీ శాఖలో చేరారు. వృత్తిలో భాగంగా గత అయిదేళ్లలో 500కి పైగా పాముల్ని పట్టుకున్నారు. పచ్చదనానికి మారుపేరైౖన కేరళలో వానాకాలంలో ఇళ్లల్లోకి పాములు రావడం మామూలే. మరే రాష్ట్రంలో లేనంతగా ఒక్క కేరళలోనే పాములు పట్టడంలో 148 మంది మహిళలు అధికారిక ధృవపత్రాలను పొంది ఉండడం విశేషం.


book1.jpg

తొలి మహిళా ‘సర్ప మిత్ర’

భారతదేశ తొలి మహిళా ‘సర్ప మిత్ర’గా పేరు తెచ్చుకున్నారు వనితా జగ్‌దియో బొరేడ్‌. 50 వేల సర్పాలను రక్షించి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కారు. మహారాష్ట్రకు చెందిన వనిత తన పన్నెండో ఏట నుంచే పాముల్ని పట్టడం మొదలెట్టారు. ఎన్నోసార్లు పాము కాటుకు గురయ్యారు కూడా. అయినా తన సాధనను విడిచిపెట్టలేదు. ‘సొయ్‌రే వంచారే మల్టీపర్పస్‌ ఫౌండేషన్‌’ను స్థాపించి వన్యప్రాణులను రక్షించడంతో పాటు... పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వనితను ‘నారీ శక్తి’ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. సమాజంలో సర్పాల పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చేందుకు ఆమె కృషిచేస్తున్నారు. ‘మన దేశంలో కేవలం పది శాతం పాములు మాత్రమే విషపూరితమైనవి, ప్రతీ ఆస్పతిలోనూ పాముకాటుకు మందు ఉచితంగా ఇస్తార’ని వనిత ప్రచారం చేస్తున్నారు.


book1.2.jpg

8 వేల పాముల్ని పట్టింది..

తమిళనాడులోని పాముల సంరక్షకులలో వేదప్రియ గణేశన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ రాష్ట్రంలో గిరిజనేతర కమ్యూనిటీకి చెందిన ఏకైక స్నేక్‌ క్యాచర్‌ వేదప్రియ. చెన్నై, కోయంబత్తూర్‌, పొల్లాచి, మదురై తదితర ప్రాంతాల్లో ఎనిమిది వేలకు పైగా పాముల్ని రక్షించి, అటవీశాఖ అధికారులకు అందజేసింది. పశ్చిమ కనుమల వన్యప్రాణుల సంరక్షక ట్రస్టులో ఆమె సభ్యురాలు. పాములు, వన్యప్రాణుల గురించి అవగాహన కలిగించేందుకు కొన్ని వేల కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. స్కూళ్లు, కాలేజీలలో ప్రసంగించారు. ‘పాములు ఆత్మరక్షణ కోసమే కాటు వేస్తాయ’ని చెబుతారామె. తనని తాను ‘గార్డియన్‌ ఆఫ్‌ ది వైల్డ్‌’ గా పేర్కొంటారు. అన్ని జీవులకూ సమాన హక్కులు ఉంటాయనేది ఆమె ఫిలాసఫీ.


పాములకు స్నేహితులు...

పాముల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో హైదరాబాద్‌లో పేరొందిన ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ’ (ఎఫ్‌ఓఎస్‌ఎస్‌) ఒకటి. ఈ సంస్థను 1995లో రాజ్‌కుమార్‌ కనూరి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖతో కలిసి ఈ సొసైటీ సభ్యులు పనిచేస్తుంటారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఏటా వేల పాములను వీళ్లు రక్షిస్తుంటారు. సంస్థలోని వాలంటీర్లు పాముల సంరక్షణలో ఇరవై నాలుగు గంటలూ సిద్ధంగా ఉంటారు. ఇందులో మహిళా వాలంటీర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.


book1.4.jpg

స్నేక్‌ గర్ల్‌

కోవిడ్‌ సమయంలో అత్యధిక పాములను పట్టి ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’ల్లోకి ఎక్కిన ధీర వనిత అజితా పాండే. చత్తీస్‌గఢ్‌కి చెందిన అజిత నర్స్‌గా బిలాస్‌పూర్‌లో పనిచేస్తున్నారు. ఆమె ప్రవృత్తి మాత్రం పాములను రక్షించడం. అజితా తన పద్దెనిమిదో ఏట పాముల్ని ఆడించే వ్యక్తిని చూసింది. అప్పటి నుంచి పాముల గురించి విస్తృతంగా చదవడం ప్రారంభించింది. పాముల్ని రక్షించే పద్ధతుల్ని తెలుసుకుంది. ఇప్పటిదాకా కొన్ని వేల పాములను రక్షించిన ఘనత ఆమెది. ‘స్నేక్‌ గర్ల్‌’గా పేరుతెచ్చుకున్న అజిత రెండుసార్లు పాముకాటుకు గురైంది. అయినా వెనకడుగు వేయలేదు. తన రెస్క్యూ ఆపరేషన్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, ‘పర్యావరణ సమతుల్యతకు పాముల అవసరం ఎంతో ఉంద’నే అవగాహన కల్పిస్తోంది.


రిక్త హస్తాలతో...

‘సేవ్‌ స్నేక్స్‌, సేవ్‌ నేచర్‌, సేవ్‌ లై్‌ఫ్‌’ అన్నది శ్వేతా సుతార్‌ జీవిత సూత్రం. ఆమె తనని తాను ‘వైల్డ్‌లైఫ్‌ రెస్క్యూయర్‌’గా పేర్కొంటుంది. ఎలాంటి పరికరాలు లేకుండా, ఒట్టి చేతులతో పాములను పట్టుకుంటూ ధీశాలిగా పేరుతెచ్చుకున్న శ్వేతది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌. ఆమె సోషల్‌మీడియాలో తన సాహస వీడియోలను పోస్ట్‌ చేస్తూ పాపులర్‌ అవుతోంది. అతి భయంకరమైన ‘కింగ్‌ కోబ్రా’లను కూడా వట్టి చేతులతో పడుతోన్న శ్వేత ధైర్యానికి హ్యాట్సాఫ్‌.


అలవోకగా...

శివానీ చిట్టి తనని తాను ‘స్నేక్‌సేవర్‌ - శివాని’గా పరిచయం చేసుకుంటుంది. ‘జీవితంలో తొలి ప్రాధాన్యం పాములకు మాత్రమే’ అని ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ తెలియజేస్తుంది. ఆమెకు 2 లక్షల 80 వేల ఫాలోవర్సు ఉన్నారు. కర్ణాటకలోని బెల్గామ్‌ శివాని స్వస్థలం. ఎంతో అలవోకగా, సమయస్ఫూర్తితో పాముల్ని పడుతుంది శివాని. ఆ ఘన కార్యాల వీడియోలన్నింటినీ సోషల్‌ మీడియాలో పెడుతూ వీడియో క్రియేటర్‌గా మారింది. చిన్నాపెద్దా రకరకాల పాములను పడుతూన్నవే అన్ని వీడీయోల్లో. అంటే శివాని జీవితంలో పాముల్ని సంరక్షించడమే ముఖ్యమైనది. ‘అన్ని సర్పాలు విషతుల్యమైనవి కావని, వాటిని చంపడం వల్ల మానవ జీవనానికే నష్టం చేకూరుతుంద’ని శివానీ అంటోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌లో సమూల మార్పులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 07:31 AM