Fake Anti Rabies Vaccine Alert: నకిలీ టీకా తీసుకుంటే...
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:19 AM
2023 నవంబరు నుంచి మన దేశంలో పంపిణీలో ఉన్న యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అభయ్‌రాబ్ నకిలీదని ఆస్ట్రేలియా వైద్యాధికారులు తాజాగా ఒక హెచ్చరికను జారీ చేయడంతో, అప్పటి నుంచి...
యాంటీ రేబీస్
2023 నవంబరు నుంచి మన దేశంలో పంపిణీలో ఉన్న యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అభయ్‌రాబ్ నకిలీదని ఆస్ట్రేలియా వైద్యాధికారులు తాజాగా ఒక హెచ్చరికను జారీ చేయడంతో, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మళ్లీ కొత్తగా మరొక వ్యాక్సిన్ తీసుకోవాలా, వద్దా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం!
పిచ్చి కుక్క కరిచినప్పుడు రేబీస్ వ్యాధి బయల్పడడానికి సాధారణంగా ఒకటి నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారం రోజుల్లోపే లక్షణాలు కనిపించవచ్చు. కొందర్లో అందుకు సంవత్సరం రోజులు పట్టవచ్చు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మళ్లీ తీసుకోకూడదనే నియమం లేదు కాబట్టి 2023 నవంబరు తర్వాత అభయ్‌రాబ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కుక్క కరిచినా, కరవకపోయినా తప్పనిసరిగా తాజా యాంటీరేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
టీకాల కోర్సులు, డోసులు వేర్వేరు
కుక్క కరవక ముందు, కరిచిన తర్వాత అనే దానితో సంబంధం లేకుండా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. అయితే కుక్క కరవక ముందు, తర్వాత తీసుకునే టీకా డోసులు మారతాయి. అలాగే మొదటిసారి కుక్క కరిచినప్పటి డోసులు, రెండోసారి కరిచినప్పుడు తీసుకునే డోసులు కూడా మారతాయి. టీకా తీసుకున్న వాళ్లు కూడా మూడు నెలల్లోపు కోర్సు పూర్తయ్యేలోగా కుక్క కరిస్తే, ఇతరత్రా ఇంజెక్షన్లేవీ తీసుకోవలసిన అవసరం లేదు. కుక్క కరిచిన ప్రదేశాన్ని 15 నిమిషాలసేపు సబ్బు నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ టీకా తీసుకుని మూడు నెలలు దాటితే, మరొక రెండు డోసుల టీకా తీసుకోవాలి. అయితే జీవితంలో యాంటీరేబీస్ టీకా తీసుకోని వారికి పిచ్చి కుక్క కరిస్తే, టీకాతో పాటు యాంటీబాడీ ఇంజెక్షన్ కరిచిన చోట ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టీకా తీసుకుని, కుక్క కరిచిన తర్వాత ఒక రౌండ్ టీకాలు తీసుకున్న తర్వాత మళ్లీ రెండోసారి కుక్క కరిస్తే, రెండు డోసుల టీకా తీసుకుంటే సరిపోతుంది. వీళ్లు యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోకూడదు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
టీకా పిరుదులకు ఇవ్వడం వల్ల సమర్థంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి యాంటీరేబీస్ టీకా భుజానికీ, తొడకు మాత్రమే ఇవ్వాలి. అలాగే...
ఫ టీకా తీసుకున్న మూడు నెలల్లోపు కుక్క కరిస్తే, గాయాన్ని శుభ్రంగా కడిగితే సరిపోతుంది. మూడు నెలలు దాటితే, రెండు డోసుల టీకా తీసుకోవాలి
ఫ టీకా తీసుకోని వాళ్లు కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, యాంటీరేబీస్ టీకాతో పాటు, కరిచిన చోట యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోవాలి
ఫ టీకాతో పాటు యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకున్న మూడు నెలల్లోపు మళ్లీ కుక్క కరిస్తే గాయాన్ని శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. మూడు నెలలు దాటితే టీకా తీసుకోవాలి
డాక్టర్ శివరంజని సంతోష్,
సీనియర్ కన్సల్టెంట్, పీడియాట్రిక్స్,
మాగ్నా సెంటర్స్, హైదరాబాద్
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..