Share News

Health Tips: ఇన్‌ఫ్లమేషన్‌కు అడ్డుకట్ట ఇలా...

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:33 AM

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను అనుసరించడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి జాగ్రత్తలతో, ఆరోగ్య, ఆహార నియమాలతో ఇన్‌ఫ్లమేషన్‌ను అదుపులో పెట్టుకోవచ్చో ప్రముఖ సెలెబ్రిటీ డైటీషియన్‌, రుజుత దివేకర్‌, సామాజిక మాధ్యమం ద్వారా ఇలా వివరిస్తున్నారు.

Health Tips: ఇన్‌ఫ్లమేషన్‌కు అడ్డుకట్ట ఇలా...

ఆరోగ్య రంగంలో తాజాగా ‘ఇన్‌ఫ్లమేషన్‌’ ప్రధాన అంశంగా మారిపోయింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఎంతో మంది, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను అనుసరించడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి జాగ్రత్తలతో, ఆరోగ్య, ఆహార నియమాలతో ఇన్‌ఫ్లమేషన్‌ను అదుపులో పెట్టుకోవచ్చో ప్రముఖ సెలెబ్రిటీ డైటీషియన్‌, రుజుత దివేకర్‌, సామాజిక మాధ్యమం ద్వారా ఇలా వివరిస్తున్నారు.

‘నిజానికి ఇన్‌ఫ్లమేషన్‌ ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో నష్టపరచదు. వ్యాధుల నుంచి కోలుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ కచ్చితంగా ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. కాబట్టి సహజసిద్ధ శరీర ప్రతిస్పందన అయిన ఇన్‌ఫ్లమేషన్‌ను ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలో తెలుసుకోవడం అవసరం. శరీరానికి దెబ్బ తగిలినప్పుడు, ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు, లేదా ప్రమాదకరమైన ప్రేరకాలకు లోనైనప్పుడు శరీరం సహజసిద్ధ రక్షణ వ్యవస్థను ప్రేరేపించడంలో భాగంగా ఇన్‌ఫ్లమేషన్‌ చోటు చేసుకుంటుంది. శరీరం, దెబ్బతిన్న కణజాలాలను మరమ్మతు చేసుకోవడం కోసం, ఇన్‌ఫెక్షన్లతో పోరాడడం కోసం ఇన్‌ఫ్లమేషన్‌ అవసరం. అయితే అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, ఎక్కువ సమయాల పాటు విశ్రాంతిలో గడిపే అలవాట్లు, నిద్రలేమి లాంటి కారణాల వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తీవ్రమవుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వంటింటి చిట్కాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించగలుగుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు.

ఆ క్రమంలో పసుపు నీళ్లు, డిటాక్స్‌ రసాలు తాగడం, పచ్చి కూరగాయలు తినడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే శరీర ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌కు ఏకైక చిట్కా లాంటిదంటూ ఏదీ ఉండదు. సమతులమైన, సుస్థిరమైన ప్రయత్నాలతోనే ఈ సమస్యను అదుపులోకి తెచ్చుకోగలుగుతాం!

ఆహారం మాయాజాలం కాదు

సూపర్‌ఫుడ్స్‌ అని చెప్పుకునే ఆహార పోకడలు ఇన్‌ఫ్లమేషన్‌ను సమూలంగా నయం చేయలేవు. ఫలానా ద్రవ, ఘన పదార్థంతో చిటికెలో ఇన్‌ఫ్లమేషన్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చు అనుకుంటే అది అపోహ మాత్రమే! నిజానికి కొన్ని పదార్థాలకు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం ఉన్నప్పటికీ, పరిపూర్ణ ఆహార నియమాల్లో భాగంగా వాటిని మన భోజనంలో జోడించుకోగలిగినప్పుడే వాటి ఫలాన్ని పొందగలుగుతాం! అలా కాకుండా పచ్చికూరగాయలు లేదా పండ్లు, కూరగాయల స్మూదీలనే ప్రధాన భోజనంగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ పూర్తిగా తగ్గిపోదు. బదులుగా పొట్టుతీయని, పాలిష్‌ పట్టని పదార్థాలతో సమతులమైన ఆహారం తీసుకోవాలి.


వ్యాయామం సరిపడా...

ఇన్‌ఫ్లమేషన్‌ క్రమబద్ధీకరణకు వ్యాయామం తోడ్పడుతుంది. అయితే అవసరానికి మించి లేదా అవసరమైనదానికంటే తక్కువ వ్యాయామంతో ఇన్‌ఫ్లమేషన్‌ తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ సమయం పాటు కదలకుండా ఉండిపోయేవారిలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరగడంతో పాటు, శరీరం శక్తిని ఖర్చు చేసుకోలేని మెటబాలిక్‌ సమస్యలు కూడా పెరుగుతాయి. అలాగే వ్యాయామం చేయడంతో పాటు శరీరానికి వ్యాయామం నుంచి కోలుకునే సమయాన్ని కూడా ఇవ్వాలి. లేదంటే శరీరం ఒత్తిడికి లోనై, ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగిపోతుంది. కాబట్టి బరువులతో కూడిన స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, యోగా, నడకలతో వ్యాయామ ప్రయోజనాలను పొందాలి.

నిద్ర కంటి నిండుగా..

ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. శరీరం కోలుకునే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. నిద్రలేమి, ఒత్తిడి మోతాదులను పెంచి, దాంతో ఇన్‌ఫ్లమేషన్‌ తీవ్రమై, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిద్రవేళలకు ఒక క్రమం పాటిస్తూ, నిద్రకు ముందు ఫోన్లు, టివిల వాడకాన్ని తగ్గించాలి.


యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారం

ఇన్‌ఫ్లమేషన్‌కు విరుగుడు ఆహారంతో ప్రయోజనం ఉంటుంది. అయితే ఆ ఆహారం ప్రభావం... మెటబాలిజం (శరీరం శక్తిని ఖర్చుచేసుకునే వేగం), ఆహారపుటలవాట్లు, ఆహార మోతాదుల మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలన్నీ సమపాళ్లలో దక్కాలంటే భోజన ప్రణాళికను తయారుచేసుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, కంటి నిండా నిద్రపోతూ, మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకున్నంత కాలం ఇన్‌ఫ్లమేషన్‌ మన దరి చేరకుండా ఉంటుంది.

ఒత్తిడి వద్దు

ఆధునిక జీవనశైలులతో ఒత్తిడి మోతాదులు ఎక్కువైనప్పుడు కూడా ఇన్‌ఫ్లమేషన్‌ వేధిస్తుంది. కాబట్టి ఇతరుల గుర్తింపు, మెప్పు కోసం పరితపించడం మానేసి, స్వీయ సంరక్షణ, మానసిక శ్రేయస్సు మీద దృష్టి పెట్టాలి. ధ్యానం, ప్రాణాయామం, నచ్చిన అభిరుచులకు సమయాన్ని కేటాయించడం లాంటివాటితో ఒత్తిళ్లను సహజ సిద్ధంగా తగ్గించుకోవాలి.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 04:33 AM