Empowering Rural Kids: నైపుణ్యం పెంచి... ఆత్మవిశ్వాసం నింపుతూ..
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:17 AM
నాణ్యమైన విద్య, ఆంగ్ల భాషా పరిజ్ఞానం... ఇవి లేకుండా ఆధునిక ప్రపంచంలో నెగ్గుకురావడం ఎంత కష్టమో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు జనావఫా బెహ్బాట్. తను పడిన కష్టాలు కొత్త తరానికి...
నాణ్యమైన విద్య, ఆంగ్ల భాషా పరిజ్ఞానం... ఇవి లేకుండా ఆధునిక ప్రపంచంలో నెగ్గుకురావడం ఎంత కష్టమో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు జనావఫా బెహ్బాట్. తను పడిన కష్టాలు కొత్త తరానికి ఎదురుకాకూడదనే లక్ష్యంతో ఆమె చేపట్టిన ప్రయత్నం... వందలాది గ్రామీణ బాలల్లో నైపుణ్యాన్ని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
‘‘ఇది పాతికేళ్ళ క్రితం సంగతి. షిల్లాంగ్‌లోని ఒక ఆసుపత్రిలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాను. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి నాకు సాధ్యమైనంతమేరకు సమాధానాలు చెబుతున్నాను. ‘‘మీరు బీయే చదివారు. ఇంగ్లీష్ అర్థం కాదు, మాట్లాడలేరు. నన్ను ఉద్యోగం ఎలా ఇవ్వమంటారు?’’ అని అన్నారాయన గట్టిగా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అయితే... ఇంటర్వ్యూకు వచ్చిన అందరికన్నా విద్యాపరమైన అర్హతలు నాకే ఎక్కువగా ఉన్నాయి. నా ఇంగ్లీ్‌షను మెరుగుపరుచుకుంటాననే హామీ తీసుకొని... వార్డ్ అటెండెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. బయటికి వస్తూ అనుకున్నాను... ఎంత కష్టమైనా సరే... ఇంగ్లీ్‌షలో పట్టు సాధించాలని.
సవాల్‌గా తీసుకున్నా...
మేఘాలయ రాష్ట్రంలోని నోంగ్‌ష్కెన్ అనే మారుమూల గ్రామం మాది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే మా ఊరులో విద్యాసదుపాయాలు అంతంతమాత్రం. అక్కడ హైస్కూల్ చదువు పూర్తి చేశాక... షిల్లాంగ్ నగరంలోని ఒక కాలేజీలో చేరాను. అప్పటివరకూ ఇంగ్లీష్ పాఠాలను బట్టీ పట్టి రాయడమే తప్ప కనీస పరిజ్ఞానం కూడా నాకు లేదు. కాలేజీలో బోధన అంతా ఆంగ్లంలోనే ఉండేది. ఎలాగో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. ఆ తరువాత... ఇంటర్వ్యూ సమయంలో నాకు ఎదురైన అనుభవం తరువాత... ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. రీడింగ్ మెటీరియల్ తెప్పించుకొని చదివేదాన్ని. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వినేదాన్ని. తోటి సిబ్బందితో తప్పో ఒప్పో నాకు వచ్చింది మాట్లాడేదాన్ని. దీనికి నేను ఏనాడూ సిగ్గు పడలేదు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, వెక్కిరింపులు... నా వెనకాలే కాదు, నా ముందు కూడా ఎగతాళి చేసేవారు. కానీ అన్నీ భరించాను. నా తపనను ఆసుపత్రి యాజమాన్యం గమనించింది. రెండేళ్ళ తరువాత రిసెప్షని్‌స్టగా ప్రమోట్ చేసింది. అయితే నేను ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నాననే ఆత్మవిశ్వాసం రావడానికి అయిదేళ్ళు పట్టింది.

ఆ తరువాత ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్‌గా చేరాను. నేను పాఠాలు బాగా చెబుతున్నానని, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నానని ప్రిన్సిపాల్ మెచ్చుకొనేవారు. అదే సమయంలో... గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న కొన్ని సంస్థలతో కలిసి పలు ప్రాంతాల్లో తిరిగాను. శిక్షణ తరగతులను నిర్వహించాను. ఒక వ్యక్తి జీవితంలో సరైన విద్య ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు పూర్తిగా అర్థమయింది. ‘హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే ఇలాంటి అవకాశం ఉంటే ఎంతో బాగుండేది కదా! అనిపించేది. మా ఊర్లోనే సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నాను. 2013లో ‘ఫౌండేషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ ఇంక్లూజివ్ డెవల్‌పమెంట్’ అనే పేరుతో ఒక సంస్థను రిజిస్టర్ చేశాను. మా గ్రామంలో, ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఇంగ్లీష్ బోధించి, వారు నగరాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా చూడాలనే ధ్యేయంతో తరగతులు మొదలుపెట్టాను.
వ్యతిరేకత రావడంతో...
ప్రతివారం చివర్లో మా ఊరు వచ్చి... ఎనిమిది నుంచి పదోతరగతి పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేదాన్ని. విద్యార్థుల నుంచి, వారి తల్లితండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. అప్పుడే వివిధ ప్రభుత్వ సంస్థలు యువత కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలిసింది. నేను చేస్తున్న పనుల్ని వివరిస్తే... ఒక కమ్యూనిటీ లైబ్రరీ ఏర్పాటుకు అధికారులు నిధులు మంజూరు చేశారు. నాకు పరిచయం ఉన్న సంస్థల ద్వారా పుస్తకాలు విరాళంగా వచ్చాయి. దాంతో... రీడింగ్ సెషన్స్ కూడా ప్రవేశపెట్టాను. అయితే... స్థానిక పాఠశాలల ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చింది. వారు బోధించే తీరును అవమానిస్తున్నానని ఆరోపించారు. దాంతో నేనే ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాను. కల్లోలంగా ఉండే ప్రాంతాల్లో పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్న ‘ఎస్‌టిపి’ అనే సంస్థ సహకారంతో ‘డ్యూ డ్రాప్ అకాడమీ’ పేరుతో 2019లో ఒక స్కూల్‌ను... 15 మంది పిల్లలతో ప్రారంభించాను. 2020 నాటికి వారి సంఖ్య 80కి చేరింది. మా అమ్మ విరాళంగా ఇచ్చిన స్థలంలో... ‘ఎస్‌టిపి సంస్థ సాయం తో పూర్తి స్థాయి పాఠశాల ఏర్పాటైంది. ప్రస్తుతం 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. నా సోదరి, మరో బంధువు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని... మా బడిలో టీచర్లుగా చేరారు. ముంబయికి చెందిన ఒక ఎన్జీవో ఒక బస్సును సమకూర్చింది. విద్యార్థుల నుంచి నామమాత్రపు రుసుముతో... స్వచ్ఛంద సంస్థల సహకారంతో మా స్కూల్ నడుస్తోంది..
ఆ నమ్మకం ఉంది...
మా స్కూల్ నుంచి నేను ఎలాంటి వేతనం తీసుకోవడం లేదు. ఒక స్వచ్ఛంద సంస్థకు నోడల్ అధికారిగా నాకు వస్తున్న జీతంతోనే గడుపుతున్నాను. వివిధ వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో మా విద్యార్థులు బహుమతులు గెలుచుకుంటున్నారు. వారిలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం చూస్తున్నప్పుడు... నా లక్ష్యం నెరవేరుతోందన్న సంతృప్తి కలుగుతోంది. వారు ఎలాంటి జంకు లేకుండా... భాష, నైపుణ్యాల పరంగా నగర విద్యార్థులను మించి రాణిస్తారనే నమ్మకం నాకుంది.’’
ఈ వార్తలు కూడా చదవండి..
ముగిసిన సీఎంల భేటీ.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు
Read Latest AP News And Telugu News