Share News

Ekta Kapoor Inspiring Journey: సీరియల్‌ క్వీన్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 02:56 AM

పదిహేడేళ్లకే కెరీర్‌ ప్రారంభమైంది. బుల్లితెర మీదుగా ప్రయాణిస్తూ... వెండితెరపై అలరిస్తూ... భారత వినోద పరిశ్రమలో తిరుగులేని ఒక బ్రాండ్‌గా ఎదిగింది. యాభై ఏళ్ల జీవిత గమనం...

Ekta Kapoor Inspiring Journey: సీరియల్‌ క్వీన్‌

సెలబ్‌ టాక్‌

పదిహేడేళ్లకే కెరీర్‌ ప్రారంభమైంది. బుల్లితెర మీదుగా ప్రయాణిస్తూ... వెండితెరపై అలరిస్తూ... భారత వినోద పరిశ్రమలో తిరుగులేని ఒక బ్రాండ్‌గా ఎదిగింది. యాభై ఏళ్ల జీవిత గమనం... ముప్ఫై ఏళ్లుగా పరిశ్రమతోనే కలిసి ప్రయాణం. ‘బాలాజీ టెలీఫిలిమ్స్‌ లిమిటెడ్‌’ అధినేత... ధారావాహికలకు వినూత్న హంగులు అద్దిన పారిశ్రామికవేత్త... ఏక్తా కపూర్‌ జైత్రయాత్ర ఇది.

‘మహిళలకు ఓదార్పు బహుమతులు (కన్సొలేషన్‌ ప్రైజెస్‌) అక్కర్లేదు. కావల్సింది సమాన వేదిక, సమాన స్థాయి, సమాన అవకాశాలు. అవి అందిన రోజు వారి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు’... ఇది ఏక్తా కపూర్‌ మాట. సగటు సినీ వారసులకు భిన్నం ఆమె. నిన్నటి తరం హీరో జితేంద్ర, శోభా కపూర్‌ కుమార్తెగా వెండితెరపై ఒదిగిపోవాలని ఆమె కలలు కనలేదు. ఒకరిపై ఆధారపడకుండా... స్వశక్తితో ఎదగాలని పరితపించారు.

‘‘వెనక్కి తిరిగి చూసుకొంటే... కొంత అల్లకల్లోలం, కొన్ని కొత్త మలుపులు, మరికొన్ని అద్భుత సందర్భాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణం ఇది. కెరీర్‌ను నిర్మించుకొనే క్రమంలో ఈ మూడు దశాబ్దాల్లో... విభిన్న దశల్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. అన్నిటినీ తట్టుకొని నిలబడటమే నా విజయ రహస్యం అని భావిస్తున్నా’’ అంటున్న ఏక్తా డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తన కెరీర్‌కు పునాదులు వేసుకున్నారు. నిర్మాత, దర్శకుడు కైలాష్‌ సురేంద్రనాథ్‌ వద్ద ఇంటర్న్‌షిప్‌ చేశారు. 1994లో ‘బాలాజీ టెలీఫిలిమ్స్‌’ నెలకొల్పాక తండ్రి నుంచి ఆర్థిక సాయం తీసుకొని నిర్మాతగా మారి, హిందీ ధారావాహికలు తీశారు. మొదటి ఆరు పైలెట్‌ ప్రాజెక్ట్‌లు విజయవంతం కాలేదు. వాటిని ప్రసారం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయారు. అయితే మరుసటి ఏడాది చేపట్టిన ‘మానో యా న మానో’ సీరియల్‌, ‘ధున్‌ ధమాకే’ మ్యూజిక్‌ షోలు దూరదర్శన్‌, ఇతర చానల్‌లో ప్రసరమయ్యాయి. అదే సంవత్సరం వచ్చిన ‘హమ్‌ పాంచ్‌’తో తొలిసారి విజయం రుచి చూశారు ఏక్తా. విద్యాబాలన్‌ తదితరులు అందులో నటించారు. 1995లో మొదలైన ఆ సీరియల్‌ నాలుగేళ్లు కొనసాగింది. ఇక అక్కడి నుంచి వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోయారు ఆమె. ఎంతగా అంటే... ఒకానొక సమయంలో దేశంలోని చానల్స్‌లో ప్రసారమయ్యే 50 షోస్‌లో 38 ‘బాలాజీ టెలీఫిలిమ్స్‌’ నిర్మించినవే.


6-navya.jpg

ఒడుదొడుకులు దాటి...

సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, అంతుపట్టని వ్యూహాలతో అడుగులు వేయడం ఏక్తా నైజం. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. కానీ ఆ దూకుడే తరువాత వరుస పరాజయాలకు కూడా కారణమైంది. షూటింగ్‌లో అవసరానికి మించి ఖర్చు, ఆఖరి నిమిషంలో కంటెంట్‌లో కట్‌లతో బడ్జెట్‌ అమాంతం పెరిగిపోయేది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలో విఫలమవడం, ఏకపక్ష నిర్ణయాలవల్ల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆమె తీరుతో బడా టీవీ చానల్స్‌తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినా ఏక్తా డీలా పడిపోలేదు.

‘కె’ సెంటిమెంటు...

కెరీర్‌లో ఎదురుదెబ్బల ఫలితం కావచ్చు... ఉన్నట్టుండి ఏక్తా ఆధ్యాత్మికత వైపు మళ్లారు. ‘కె’ అనే అక్షరం ఆమెకు సెంటిమెంట్‌గా మారింది. ‘క్యోం కీ సాస్‌...’ హిట్‌ తరువాత ఆ సెంటిమెంటు మరింత బలపడింది. ‘కహానీ ఘర్‌ ఘర్‌ కీ, కభీ సౌతన్‌ కభీ సహేలీ, కోహి అప్‌నా సా, కసౌతీ జిందగీ కే’... ఇలా ‘కె’ అక్షరంతో మొదలయ్యే పేర్లతో వరుస ధారావాహికలు వచ్చాయి. 2001లో ‘బెస్ట్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కూడా ఆమెకు దక్కింది. ‘బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌’ పేరిట సినీ నిర్మాణం కూడా మొదలుపెట్టారు. 2008లో ‘బాలాజీ టెలిఫిలిమ్స్‌’ నిర్మించిన ఎనిమిది హిందీ షోస్‌ వివిధ చానల్స్‌లో ప్రసారమయ్యాయి. ఇతర తెలుగు, తమిళం తదితర భాషల్లో కూడా డబ్బింగ్‌ అయ్యాయి. అయితే తరువాతి కాలంలో అనూహ్యంగా సంస్థ రూ.14 కోట్లు నష్టపోయింది. ఓ బడా చానల్‌తో ఒప్పందం రద్దయింది. అదేసమయంలో టీవీ పరిశ్రమ సమ్మెతో పరిస్థితి మరింత దిగజారింది. అప్పటివరకు ఆమె పడిన శ్రమ వృథా అయింది.


అమ్మేయాలంటూ సలహాలు...

‘బాలాజీ టెలీఫిలిమ్స్‌ లిమిటెడ్‌’గా ఎదిగిన కంపెనీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లిపోవడంతో ఏక్తాపై రకరకాల వ్యాఖ్యలు. స్టాక్‌ ఎనలిస్టులు అయితే సంస్థను అమ్మేయమని ఉచిత సలహాలు ఇచ్చారు. అంతటి గందరగోళ పరిస్థితుల్లో కూడా తడబడలేదు ఆమె. దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగారు. లోపాలను సరిదిద్దుకొంటూ మళ్లీ సంస్థ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. మరోవైపు బాలీవుడ్‌లోనూ ‘ది డర్టీ పిక్చర్‌, వీర్‌ ది వెడ్డింగ్‌, లైలా మజ్నూ, క్రూ’ తదితర హిట్‌ సినిమాలతో తనదైన ముద్ర వేశారు. 2017లో అంటే భారత్‌లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ ప్రారంభమైన ఏడాదికి ‘ఆల్ట్‌ బాలాజీ’ పేరుతో వీడియో ఆన్‌ డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌ నెలకొల్పారు ఏక్తా.

ఇది మంచి లాభాలు ఆర్జించి పెట్టింది. అయితే కంటెంట్‌ అభ్యంతరకరంగా ఉందంటూ పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏక్తా, ఆమె తల్లి శోభ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మాతృ సంస్థను విజయ పథంలో నడిపిస్తున్నారు. వినోద రంగంలో ఆమె చేసిన సేవలకు గానూ 2020లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు.

బిడ్డకు తల్లి... కానీ...

ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు సంస్థను తీసుకువెళ్లిన ఏక్తా వ్యక్తిగత జీవితం కూడా అనూహ్యంగానే ఉంటుంది. వైవాహిక బంఽధంపై ఆసక్తి లేని ఆమె 2019లో సరోగసీ ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చారు. అప్పుడే కాదు, సంస్థను నడిపే క్రమంలో, తన ఆహార్యం, ఆకారం విషయంలోనూ ఎన్నో విమర్శలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. ‘‘నా రూపంపైనే కాదు, నేను ధరించే వస్త్రాల గురించి, ఆఖరికి నా కేశాల గురించి కూడా వెటకారంగా, చులకనగా మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి వినీ వినీ నా చర్మం మొద్దుబారిపోయింది. కానీ వీళ్లందరికీ నేను సాధించిన అపురూప విజయాలు కనిపించవు’’ అంటారు ఏక్తా.

ఇవి కూడా చదవండి..

ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

Updated Date - Sep 07 , 2025 | 02:56 AM