Share News

Ego in Yoga: ఇగో మంచీ చెడూ

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:20 AM

‘ఇగో’ అనే పదానికి తెలుగులో ‘అహం’, ‘అహంకారం’, ‘గర్వం’ అనే అర్థాలు కనిపిస్తాయి. చాలామంది ఇగో అనే భావన ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ‘ఇగో’ ఒక వ్యక్తి అస్థిత్వాన్ని...

Ego in Yoga: ఇగో మంచీ చెడూ

యోగా

‘ఇగో’ అనే పదానికి తెలుగులో ‘అహం’, ‘అహంకారం’, ‘గర్వం’ అనే అర్థాలు కనిపిస్తాయి. చాలామంది ఇగో అనే భావన ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ‘ఇగో’ ఒక వ్యక్తి అస్థిత్వాన్ని నిలబెట్టే ఒక పరికరం. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు- ఈ ‘ఇగో’ మనిషిని గొప్పవాడినీ చేయగలదు. అతనిని పతనం అంచునా నిలబెట్టగలదు. ‘ఇగో’ అనే పదానికి మూడు అర్థాలు చెప్పుకున్నాం కదా... ఈ మూడు సమానార్థకాలు కావు. ‘అహం’ అంటే నేను. ఒక వ్యక్తి ఆత్మదర్శనానికి ఇది ప్రవేశద్వారంలాంటిది. ‘అహంకారం’ అంటే- ‘నేను మాత్రమే’ అనే భావన. దీనివల్ల కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఇది చెడుకు కూడా కారణమవుతుంది. ఇక మూడోది ‘గర్వం’. ఇది ఒక వ్యక్తి పతనానికి రాజమార్గం. ఇది ఒక వ్యక్తి ఆలోచనా ధోరణిని, వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు. అతని వ్యక్తిగతమైన, వృత్తిపరమైన, సామాజికపరమైన సంబంధాలను తుంచేస్తుంది. దీనివల్ల అనేక ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, దంపతుల మధ్య వచ్చే విభేదాలు, ఆఫీసుల్లో గొడవలు- వీటన్నింటికీ ఇదే కారణం. ఇది వ్యక్తుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది.

పొంచి ఉన్న ప్రమాదం...

బాగా తెలివితేటలు ఉన్నవారందరినీ ఒక వేదికపైకి చేర్చి వారందరితోనూ పనిచేయించాలని అనుకోవడం సులభమే! దీనివల్ల కొన్ని కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. గొప్ప ఆలోచనలు పెల్లుబుకుతాయి. కానీ ఇవన్నీ జరగాలంటే ఆ సమూహంలో ఉన్న వ్యక్తులు తమ తమ ఇగోలను వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇతరుల ఆలోచనలను, అభిప్రాయాలను స్వాగతించగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కూడా ‘ఇగో’ ఒక పెద్ద అడ్డంకి అనే చెప్పాలి. మనకు తెలియని, మనకన్నా గొప్ప శక్తిని చేరుకొనే పరిణామక్రమంలో వారు- ‘నేను’ అనే భావనను వదిలేయాల్సి ఉంటుంది. ఆ భావన వదిలేయకపోతే ఆ గొప్ప శక్తిలో మమేకం కాలేరు. మానవ లక్షణాలను వదిలేసి దైవ లక్షణాలను పొందే పరిణామక్రమంలో ఇగో అడ్డంపడుతుందని, దానిని వదిలేయగలిగినప్పుడే... పరమాత్మలో ఆత్మ విలీనం అయి- ఏకత్వ భావన సాధ్యమవుతుందని ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యాన’ సంప్రదాయం చెబుతుంది.

ఆ స్థితికి చేరుకున్నప్పుడు భౌతిక ప్రపంచంలో మన చుట్టూ జరిగే రకరకాల కార్యకలాపాలను సానుకూల ధోరణితో చూడగలుగుతాం.


ధ్యానమే మార్గం

నేను ఒక కార్డియాలజి్‌స్టను కాబట్టి నా దగ్గరకు అనేక మంది రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. చికిత్స చేసినప్పుడు వారికి ఆరోగ్యం బాగుపడుతుంది. మళ్లీ సంతోషంగా జీవించగలుగుతూ ఉంటారు. ‘నా వల్లే వారికి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి.. నేను గొప్పవాణ్ణి’ అనే భావన పెరిగిపోతే అది అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. అన్ని వృత్తుల్లో ఉన్నవారికీ ఇది వర్తిస్తుంది. ‘ఇగో’ పెరగడం వల్ల కొత్త ఆలోచనలకు స్వాగతించలేం. కొత్త ఆలోచనలను స్వాగతించకపోతే కొత్త సిద్ధాంతాలు.. ఆవిష్కరణలు అర్ధం కావు. కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచన రాకుండా ఇగో అడ్డం పడుతూ ఉంటుంది. తెలిసో తెలియకుండానో ఆ మార్గంలో ప్రయాణించడం మొదలుపెడితే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ‘ఇగో’ను దూరంగా పెడితేనే మనం వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో రాణించగలుగుతాం. ఈ స్థితికి చేరుకోవాలంటే ‘ధ్యానం’ ఒకటే మార్గం.

డాక్టర్‌ శరత్‌రెడ్డి కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ 9440087532

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 05:20 AM