Dussehra Significance: మనలోని రావణులను సంహరిద్దాం
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:14 AM
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విజయదశమి లేదా దసరా పర్వదినం అత్యంత ప్రముఖమైనది. ‘దశ’ అంటే పది. ‘హరా’ అంటే సంహరించడం. అంటే పది తలల రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు సంహరించడం....
హరేకృష్ణ
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విజయదశమి లేదా దసరా పర్వదినం అత్యంత ప్రముఖమైనది. ‘దశ’ అంటే పది. ‘హరా’ అంటే సంహరించడం. అంటే పది తలల రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు సంహరించడం. దుష్ట శక్తులపై దైవ శక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అంతేకాదు, ద్వాపరయుగంలో పన్నెండేళ్ళ వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేసి, విరాటరాజు కొలువులోకి వెళ్ళేముందు... పాండవులు తమ ఆయుధాలను శమీ వృక్షం (జమ్మి చెట్టు)పై దాచిపెట్టారు. గోవులను అపహరించిన కౌరవులపై యుద్ధానికి మళ్ళీ ఆ అస్త్రాలను చేతపట్టి విజయం సాధించారు. ఆ విధంగా పాండవులు తమ ఆయుధాలను తిరిగి పొందిన రోజు... దసరాకు ముందురోజే కావడంతో... వివిధ వృత్తులవారు తమ వృత్తులకు తోడ్పడుతున్న పనిముట్లను, గృహస్తులు తమ ఇళ్ళలోని సామగ్రిని గుర్తించి, సమీక్షించుకోనే రోజుగా... ఆయుధపూజగా సంప్రదాయంలో అంతర్భాగం అయింది.
శ్రీరాముని సందేశం
దుర్మార్గులను శాస్త్రం ఆరు రకాలుగా పేర్కొంది. వారు: విషం పెట్టేవాడు, ఇంటికి నిప్పు పెట్టేవాడు, మారణాయుధాలతో దాడి చేసేవాడు, ఇతరుల ధనాన్ని దోచేవాడు, ఇతరుల స్థలాన్ని ఆక్రమించేవాడు, పరుల భార్యను చెరపట్టేవాడు. అలాంటి దుర్మార్గులను శీఘ్రమే తగిన విధంగా శిక్షించడం కూడా రాజు విధులలో భాగం అని శాస్త్రం వివరించింది. కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, ప్రభువుగానే కాదు... మామూలు మనిషిగా తోటివారి పట్ల ఉండాల్సిన మానవీయత, ఉన్నత సంస్కారం కలిగినవాడే శ్రీరాముడు. అందుకే నేటికీ మనందరం మళ్ళీ అటువంటి రామరాజ్యం కోసం తహతహలాడుతూ ఉంటాం. సీతాదేవిని అహహరించిన రావణుడు... శ్రీరాముని పట్ల దుర్గార్గాన్ని ప్రదర్శించిన కారణంవల్లనే... ప్రపంచ చరిత్రలో అసమానమైన విధంగా అతడికి గుణపాఠం చెప్పవలసి వచ్చింది. రావణుడు సైతం తపోసంపన్నుడు, పరమశివుడికి భక్తుడు అయినప్పటికీ... తన శక్తులను సద్వినియోగపరచుకోలేకపోయాడు. మానవ జీవిత లక్ష్య సాధనకు ధర్మాధర్మాల విచక్షణ, వాటి అవలంబించడం ఎంత ముఖ్యమైనవో రావణ సంహారం ద్వారా లోకానికి సందేశమిచ్చారు శ్రీరామచంద్ర ప్రభువు.
మనమేం చేయాలి?
ప్రస్తుత కాలంలో సమాజం కేవలం రావణుడి దిష్టిబొమ్మ దహనం చేయడంతో సరిపెట్టకుండా... మన మనస్సులోని కామ, క్రోధ, మోహ, లోభాలనే అంతర్గత రావణులను సంహరించడానికి ప్రయత్నించాలి. విజయదశమి జ్ఞాన సంపాదనకు మంచి రోజు. ఈ పండుగ నేపథ్యంలో గొప్ప మార్పును పొందడానికి శ్రీకారం చుట్టాలి. భగవద్గీత బోధించిన విధంగా, ప్రామాణిక గురుశిష్య పరంపరద్వారా... ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిత్యం అభ్యసించడం అనే కొత్త అలవాటును యువతరం ప్రారంభించాలి. మనస్సులోని కల్మషాల కారణంగానే మనస్సు శత్రువు అవుతుంది. పరిశుద్ధమైనప్పుడు మనస్సే ఒక మంచి మిత్రుడు కూడా. కపటం, కల్మషాల నుంచి మనస్సు విముక్తి పొందడానికి కలియుగంలో నిర్దేశించినదే ‘హరేకృష్ణ’ మహామంత్రం. కల్మష భూయిష్టమైన ఈ యుగానికి శాస్త్రం నిర్దేశించిన ‘హరినామం’ అనే దివ్యౌషధాన్ని ప్రతి ఒక్కరూ సేవించేలా రూపకల్పన చేసిన మహావదాన్యులు శ్రీ చైతన్య మహాప్రభువులు. ఆనాడు లోకంలో అనర్థాలను సృష్టించిన రావణాదులను రామబాణం దహించివేయగా, నేడు మనలో అనర్థాలను సృష్టించే కామ, క్రోధ, లోభాదులను రామనామమే దహించివేయగలదు.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..