Doctor to Politician Success Story: అరుదైన అవకాశం అందివచ్చింది
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:57 AM
ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ (ఐవీఎల్‌పీ)... గతంలో ఇందిరాగాంధీ, వాజ్‌పేయి తదితర మహానేతలు... దేశవిదేశీ మహానాయకులు అనుభవాలు పంచుకున్న వేదిక. అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో ఉద్భవిస్తున్న యువ నాయకత్వం....
నవనాయిక
ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ (ఐవీఎల్‌పీ)... గతంలో ఇందిరాగాంధీ, వాజ్‌పేయి తదితర మహానేతలు... దేశవిదేశీ మహానాయకులు అనుభవాలు పంచుకున్న వేదిక. అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో ఉద్భవిస్తున్న యువ నాయకత్వం... అమెరికన్ల మధ్య శాశ్వత సంబంధాలు పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించే కార్యక్రమం ఇది. తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకున్నారు... ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ బి.వినూషారెడ్డి. ఈ సందర్భంగా ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు.
‘గత ఏడాది... ఏప్రిల్ 11... అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది... నన్ను కలవాలని. ‘వాళ్లు నా కోసం ఎందుకు వస్తారులే’ అనుకుని... కలవాలంటే కర్నూలుకు రమ్మని చెప్పాను. నాలుగు రోజుల తరువాత నిజంగానే వాళ్లు మా ఊరు వచ్చారు. ఆ సమయంలో రోగులకు వైద్యం అందిస్తున్నా. వైద్యురాలిగా, రాజకీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా నేను చేస్తున్న సేవలు, నేపథ్యం గురించి వివరాలు అడిగారు. భవిష్యత్తు నాయకత్వంపై అభిప్రాయం అడిగారు. ఐవీఎల్‌పీకి ప్రతినిధులను ఎంపిక చేస్తున్నామని, అందులో భాగంగానే నా ఇంటర్వ్యూ తీసుకున్నామని అమెరికన్ ఎంబసీవారు చెప్పారు. ‘ఆ అవకాశం నా దాకా రాదులే’ అనుకుని, దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది మార్చిలో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది... నన్ను ఎంపిక చేసినట్టు చెప్పారు. అందులో ఇరవై దేశాల ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ‘భారత్ నుంచి ఇంకెవరు వస్తున్నారు’ అని అడిగితే... ‘మిమ్మల్ని ఒక్కరినే ఎంపిక చేశాం’ అన్నారు. ఆ క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. నా జీవితంలో మరిచిపోలేని సందర్భం అది.
ఆ అనుభవాలే అవకాశం తెచ్చాయి...
రెండేళ్ల కిందట దక్షిణాఫ్రికాలో ‘బ్రిక్స్ పొలిటికల్ సమ్మిట్’ జరిగింది. భారత్ ప్రతినిధులుగా ఏపీ నుంచి నేను, తమిళనాడు నుంచి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, యూపీ నుంచి పుష్కర్ మిశ్రా, గుజరాత్ నుంచి సత్యన్ కులబ్కర్ హాజరయ్యాం. ఏడు రోజులు జరిగిన ఆ సదస్సులో వివిధ రంగాలకు చెందిన 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో భారత్- దక్షిణాఫ్రికా దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సంబంధాలపై నేను మాట్లాడాను. బ్రిక్స్ తీర్మానాలు చేయడం, చర్చల్లో పాల్గొనడం మధురానుభూతులు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రాంతీయ, జాతీయ చానల్స్ చర్చావేదికల్లో భాగస్వామి అయ్యాను. అలాగే... ‘ఇండియా బిఫోర్... ఆఫ్టర్ 2014- వై భారత్ నీడ్స్ బీజేపీ’ అనే ఆంగ్ల పుస్తకం రాశాను. ఈ అనుభవాలే నేను ఐవీఎల్‌పీకి ఎంపిక కావడానికి దోహదపడ్డాయని భావిస్తున్నాను.
గర్వంగా ఉంది...
ఐవీఎల్‌పీకి 1940లో అమెరికా శ్రీకారం చుట్టింది. ఈ ఎనిమిదిన్నర దశాబ్దాల్లో 2.3 లక్షల మంది అంతర్జాతీయ యువ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై, ఆ తరువాత దేశాధ్యక్షులుగా, ప్రభుత్వాధినేతలుగా ఎదిగినవారు, నోబెల్ బహుమతి పొందినవారు ఐదు వందల మందికి పైగా ఉన్నారు. వేల సంఖ్యలో చట్ట సభలకు ఎంపికయ్యారు. పారిశ్రామిక, విద్యావేత్తలుగా స్థిరపడ్డారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మురార్జీ దేశాయ్, వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నాయకులుగా ఎదుగుతున్న సమయంలో ఐవీఎల్‌పీలో పాల్గొన్నవారే. దాని ద్వారా ఎంతటి పటిష్టమైన నాయకత్వం తయారువుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి నేను ఎంపిక కావడం గర్వంగా ఉంది. ఎలాంటి దరఖాస్తు ప్రక్రియా లేకుండా... అమెరికా రాయబార కార్యాలయాలు నామినేట్ చేయడం అంటే సాధారణ విషయం కాదనేది నా అభిప్రాయం.

ఇదీ నేపథ్యం...
మా స్వస్థలం కర్నూలు. నాన్న బి.జయరామిరెడ్డి రోడ్లు భవనాలు శాఖలో ఎస్‌ఈగా రిటైర్ అయ్యారు. అమ్మ రాణి గృహిణి. నేను, మావారు చల్లా వాసురెడ్డి ఇద్దరం డాక్టర్లమే. మాకు ఇద్దరు పిల్లలు... హర్షిల్, సాన్వి. నాకు ఉమ్మడి ఏపీ ఎంసెట్‌లో 83వ ర్యాంక్ వచ్చింది. ‘కర్నూలు మెడికల్ కాలేజీ’ (కేఎంసీ)లో ఎంబీబీఎస్ చదివాను. 16 గోల్డ్ మెడల్స్ సాధించాను. తరువాత బెంగళూరు ‘రామయ్య మెడికల్ కాలేజీ’లో జనరల్ మెడిసిన్ పూర్తి చేశాను. మావారు కూడా డాక్టర్ కావడంతో... ఇద్దరం కలిసి కర్నూలులోనే ‘వీఆర్ హాస్పిటల్’ నెలకొల్పాం.
అలా రాజకీయాల వైపు...
చదువుకొనే రోజుల్లో రాజకీయాలపై అస్సలు ఆసక్తి ఉండేదికాదు. అప్పట్లో రోజుకో కుంభకోణం వెలుగు చూడడమే అందుకు కారణం. 2011లో తొలిసారిగా అమెరికా వెళ్లాను. అక్కడి అభివృద్ధి చూసి మన దేశంలో ఇలాంటి ప్రగతి సాధ్యమేనా? ఈ రాజకీయ నాయకులవల్ల మార్పు వస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తేవి. ఆ సమయంలో మెడికల్ సీట్ల కుంభకోణం వెలుగు చూడడంతో రాజకీయాలంటేనే విరక్తి వచ్చింది. అయితే ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు, పాలనలో తెస్తున్న సంస్కరణలు, మహిళల సామాజిక భద్రత వంటివి నన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయి. అలా 2019లో బీజేపీలో చేరాను. రాష్ట్ర కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా పాలసీ రీసెర్చ్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను.’’
గోరంట్ల కొండప్ప, కర్నూలు
ఫొటోలు: ఎస్‌ఎండీ రఫీ
అదే నా లక్ష్యం...
ఈ నెల 9 నుంచి 30 వరకు ఐవీఎల్‌పీ జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చంతా అమెరికా ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో భాగంగా 20 దేశాల ప్రతినిధులతో కలిసి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలి. వాషింగ్టన్ డీసీ, ఫెడరల్ వ్యవస్థ పనితీరుపై సమీక్షలు, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశాలు ఉంటాయి. ఆ దేశ న్యాయ వ్యవస్థ, విశ్వవిద్యాలయాల పని తీరుపై అధ్యయనం చేయాలి. ఇలా ఎన్నో కార్యక్రమాలు. భవిష్యత్తులో చట్ట సభలో అడుగుపెట్టి, భావితరాల్లో స్ఫూర్తి నింపే నాయకురాలిగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అందుకు పునాదులు వేయడంలో ఐవీఎల్‌పీ ఒక మంచి వేదికగా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.
విద్య, వైద్యం...
సామాజిక బాధ్యతగా నావంతు కర్తవ్యం నిర్వరిస్తున్నాను నేను, మావారు కలిసి పేదల బస్తీల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. మందులు పంపిణీ చేస్తున్నాం. అనాథ పిల్లలకు పుస్తకాలు, దుస్తులు ఇస్తున్నాం. అవసరమైనవారికి ఆర్థిక సాయం చేస్తున్నాం. అలాగే ఏటా శివరాత్రి ఉత్సవాల్లో శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలి నడకను వెళ్లే భక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News