మనసుంటే మార్గం ఉంటుంది
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:43 AM
మనసుంటే మార్గం ఉంటుంది భారత అణుశక్తి రంగంలో ఆమెది చెరగని ముద్ర. మెటీరియల్ సైంటి్‌స్టగా... రసాయన సెన్సర్లు, నానో స్ట్రక్చర్డ్ పదార్థాలపై పరిశోధన, అభివృద్ధిలో విశేష కృషి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం...
సంకల్పం
భారత అణుశక్తి రంగంలో ఆమెది చెరగని ముద్ర. మెటీరియల్ సైంటి్‌స్టగా... రసాయన సెన్సర్లు, నానో స్ట్రక్చర్డ్ పదార్థాలపై పరిశోధన, అభివృద్ధిలో విశేష కృషి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించిన రెండు శాతం ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరు. డాక్టర్ మనోరమ వర్ధిరెడ్డి సుంకర... మూడున్నర దశాబ్దాలుగా అసమాన సేవలు అందిస్తున్న ఆమెను... భారత ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మక ‘రాజా రామన్న చైర్ (ఆర్‌ఆర్‌సీ) అవార్డు’కు ఎంపిక చేసింది. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేందుకు ఇది తనకు అవకాశం కల్పించిందని అంటున్న డాక్టర్ మనోరమను ‘నవ్య’ పలకరించింది.
‘‘భారత అణుశక్తి (అటామిక్ ఎనర్జీ) రంగంలో ప్రముఖ శాస్త్రవేత్త రాజారామన్న కృషి వెల కట్టలేనిది. ఆయన సేవలకు గుర్తుగా ‘రాజారామన్న చైర్ అవార్డు’ ప్రకటిస్తారు. దేశంలో అత్యుత్తమ సేవలు అందించిన శాస్త్రవేత్తలకు ఈ అవార్డు ఇస్తారు. పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్తలు, ఆచార్యుల నైపుణ్యాన్ని అణుశక్తి ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడానికి ఉద్దేశించినది. సంబంధిత ఆర్ అండ్ డీ (రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్) విభాగంలో పని చేయాలి. వాస్తవానికి ఇది ఒక ఫెలోషిప్. రెండేళ్ల కిందటి వరకు ‘రాజారామన్న ఫెలోషి్‌ప’గా పరిగణించేవారు. తరువాత పేరు మార్చారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఫెలోషిప్ దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. మెటీరియల్ సైంటిస్ట్ (పదార్థ శాస్త్రవేత్త)గా నాకు ఒక మధుర జ్ఞాపకం. రసాయన (కెమికల్) సెన్సర్ల మీద పరిశోధనలు చేశాను. అటామిక్ ఎనర్జీలో ఇది చాలా కీలకం. నా ఈ ప్రయాణం మూడున్నర దశాబ్దాల కిందట మొదలైంది.
మాస్టర్స్... పీహెచ్‌డీ...
మా అమ్మానాన్నలది కడప అయినా... నా విద్యాభ్యాసం అంతా పుణేలో సాగింది. అక్కడి ఫెర్గ్యూసన్ కాలేజీలో బీఎస్సీ చదివాను. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ, ఎంఫిల్ పట్టా పొందాను. అదే వర్సిటీలో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాను. నాకు స్ఫూర్తి మా అమ్మ అశ్వత్థమ్మ. నాకు 18 ఏళ్లప్పుడు చనిపోయింది. ఎప్పుడూ చెబుతూ ఉండేది... ‘నీ కాళ్లపై నువ్వు నిలబడాలి. ఒకరిపై ఆధారపడకూడదు’ అని. మా నాన్న వెంకటవీరారెడ్డి కూడా నా భుజం తట్టారు. అలాగే నా పీహెచ్‌డీ సూపర్‌వైజర్ సుధా బొరాస్కర్, ఐఐసీటీలో మెంటార్ జనార్దన్‌రావు నన్ను ఎంతో ప్రోత్సహించారు.
పెళ్లి తరువాత...
డాక్టరేట్ అందుకున్నాక ఫిజిక్స్‌లో ‘కామన్వెల్త్ ఫెలోషిప్’ లభించింది. యూకే ‘అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీస్’ దీన్ని అందిస్తుంది. పెళ్లి తరువాత హైదరాబాద్ వచ్చాను. మావారు సుంకర నరేంద్రనాథ్‌రెడ్డి హైకోర్టు లాయరు. తొలుత 1991లో తార్నాకలోని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో రీసెర్చ్ అసోసియేట్‌గా చేరాను. 1998లో ఐఐసీటీ ఉద్యోగి అయ్యాను. నానో మెటీరియల్స్ లేబొరెటరీలో పని చేశాను. అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ సైంటి్‌స్టగా పదవీ విరమణ పొందాను. మెటీరియల్ సైంటి్‌స్టగా రసాయన సెన్సర్లకు సంబంధించి ఎంతో పని చేశాను. సెన్సర్ అంటే ఒక డివైజ్ లాగా. ఉదాహరణకు ధర్మామీటర్‌లో టెంపరేచర్ కొలిచేది... అలాగే డ్రంకన్ డ్రైవ్‌లో ఉపయోగించే ఆల్కహాల్ సెన్సర్లు లాంటివి. ముఖ్యంగా నేను విషపూరితమైన, ప్రమాదకరమైన గ్యాస్‌లను గుర్తించేవాటిని, పర్వత ప్రాంతాల్లో ఆక్సిజన్ అందనప్పుడు ఉపయోగించే కార్బన్‌మోనాక్సైడ్ తదితర రసాయన సెన్సర్లు అభివృద్ధి చేశాను.

అమోనియా సెన్సర్లపై...
‘రాజారామన్న చైర్ అవార్డు’లో భాగంగా నేను ఐఐసీటీలోనే పని చేయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఆ సంస్థతో నాది ముప్ఫై ఏళ్లకు పైగా అనుబంధం. నా ప్రయోగాలు, పరిశోధనలకు అవసరమైన ల్యాబ్ ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమోనియాను పసిగట్టే మెటీరియల్స్ అభివృద్ధి చేస్తున్నాను. ముఖ్యంగా ఫర్టిలైజర్స్‌లో పని చేసేవారు, వాటిని ఉపయోగించేవారు దీని బారిన పడతారు. అయితే అది ఫర్టిలైజర్స్‌కే పరిమితం కాకుండా గాలిలో కలుస్తోంది. వాతావరణంలో అమోనియా అనేది ప్రమాదకరం. మానవ శరీరంలో కొద్ది శాతం చేరినా మూత్రపిండాల సమస్యకు దారి తీస్తుంది. దీన్ని గుర్తించాలంటే బయోసెన్సర్లు కావాలి. ఇప్పటికైతే నేను గాలిలో కలిసే అమ్మోనియాను పసిగట్టే సెన్సర్ల రూపకల్పనలో ఉన్నాను. భవిష్యత్తులో బయోసెన్సర్లపై దృష్టి పెడతాను.
నానో మెటీరియల్స్...
నేను సాధించిన విజయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నానో స్ట్రక్చర్డ్ మెటీరియల్స్ (సూక్ష్మ నిర్మాణ పదార్థాలు). చీఫ్ సైంటి్‌స్టగా ఐఐసీటీలో మెటీరియల్ సైన్స్‌కు ప్రత్యేక లేబొరెటరీ ఏర్పాటు చేయగలిగాను. మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగాను. నా తరువాత కూడా సెన్సర్లు, బ్యాటరీలు, మెటీరియల్స్ తయారీ, అభివృద్ధి ఇక్కడ జరుగుతోంది. ఉద్యోగం చేరినప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఇంట్లో లేను. పీహెచ్‌డీ అవ్వగానే ఒకదాని తరువాత ఒకటి ఫెలోషిప్స్, ఆ తరువాత ఉద్యోగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాను. ఒక మహిళగా ఇది నాకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. జనజీవనానికి ఉపయోగపడే మరిన్ని మెటీరియల్స్ తయారు చేయాలని కోరుకొంటున్నా.’’
ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో...
నా ఈ ప్రయాణంలో కామన్వెల్త్ లాంటి ప్రతిష్ఠాత్మక ఫెలోషి్‌పలతో పాటు పలు అవార్డులు కూడా లభించాయి. బయోడీజిల్ ప్రాజెక్ట్‌కు ‘ఆస్ట్రేలియా లీడర్‌షిప్ అవార్డు’, గ్యాస్ సెన్సర్ల అభివృద్ధి, పరిశోధనకు గానూ ఎన్‌ఎ్‌సపీటీఎ్‌స ‘ఆర్ అండ్ డీ’ అవార్డు, సీఎ్‌సఐఆర్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఉత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డుతో పాటు ఏపీ, తెలంగాణల నుంచి కూడా గౌరవ పురస్కారాలు ఎన్నో అందుకున్నాను. అంతేకాదు... స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఏటా ప్రకటించి ప్రపంచంలోని 2 శాతం అత్యుత్తమ మెటీరియల్ శాస్త్రవేత్తల జాబితాలో నాకు చోటు దక్కింది. 2020 నుంచి ఇప్పటివరకు వరుసగా నా పేరు ఆ జాబితాలో ఉంటోంది. తొలుత ఇది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. తరువాత ఎంతో గర్వంగా అనిపించింది. ఈ రంగంలో నేను చేసిన కృషి, ప్రభావం, సాధించిన విజయాల ఆధారంగా జాబితాలో నా పేరు చేరిందని భావిస్తున్నాను.’’
హనుమా
దీనికి అంతం లేదు...
కాలంతోపాటు అవసరాలకు తగిన డివైజ్‌లు తయారు చేసుకొంటూ వెళ్లాలి. దీనికి అంతం అనేది ఉండదు. అయితే ఒక మహిళగా ‘ఆర్ అండ్ డీ’లో పని చేయడం అంత సులువు కాదు. అలాగని కష్టసాధ్యమైనదీ కాదు. నేటితరం అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే... మీకు ఏది నచ్చితే అది చేయండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. చందమామను అందుకోవాలనో... ఇంకేదో బ్రహ్మాండం సాధించాలనో అనుకోకండి. పర్యావరణం, కాలుష్యం... ఇలా మీ చుట్టూ ఉన్నవాటి గురించి ఆలోచించండి. వాటి నుంచి ఉద్భవించే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేయండి. అదే మిమ్మల్ని శిఖరం వైపు నడిపిస్తుంది. అలాగే మన ఎదుగుదలలో కుటుంబమూ ముఖ్యమే... అమ్మనాన్న, భర్త, పిల్లలు, అత్తమామలు... అందరూ. నాకు అమ్మాయి, అబ్బాయి. మా పిల్లల్ని 45వ రోజు నుంచీ డేకేర్ సెంటర్‌లోనే పెట్టాను. ఎందుకంటే అప్పుడు నా లక్ష్యం మంచి ఉద్యోగం. దాని కోసం కసిగా ప్రయత్నించాను. ఆ సమయంలో మా అత్తమామలు, భర్త మద్దతునిచ్చారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మనసు ఉంటే మార్గం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి