దోశలు అంటుకోకుండా రావాలంటే...
ABN , Publish Date - Jan 16 , 2025 | 07:05 AM
ఒక్కోసారి దోశలు వేసినపుడు అవి పెనానికి అతుక్కుపోతుంటాయి. వాటిని పెనం నుంచి తీయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాగని నాన్‌స్టిక్ పాన్‌లను ఉపయోగించడం..... ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దోశలు పెనానికి అంటుకోకుండా మంచి రంగులో క్రిస్పీగా రావాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!

- ముందుగా పెనాన్ని జిడ్డు లేకుండా నున్నగా శుభ్రం చేసుకోవాలి. తరవాత స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేయాలి. పెనం మీద నీళ్లు చల్లితే చిటపటమంటూ వెంటనే ఆవిరైపోవాలి. అప్పుడే దోశ వేయడానికి పెనం అనుకూలంగా ఉంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయను మధ్యకు కోసి దానితో పెనమంతా రుద్దాలి. తరవాత ఒక గంటెతో దోశ పిండిని పెనం మధ్యలో వేసి గుండ్రంగా వేగంగా రుద్దుతూ పెనమంతా పరచాలి. ఈ దోశ మీద కొన్ని నూనె చుక్కలు వేయాలి. మంట మధ్య స్థాయిలో ఉండేలా చూసుకుంటే ఒక నిమిషంలో చుట్టూ ఎర్రగా కాలి దోశ సులభంగా పెనం నుంచి విడివడుతుంది.
- ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు తీసుకుని మూడు చెంచాల నూనె వేసి బాగా కలపండి. చిన్న గుడ్డ ముక్కను గుండ్రంగా మడిచి ఈ మిశ్రమంలో ముంచి దానితో వేడిగా ఉన్న పెనం మీద రుద్దాలి. తరవాత దోశ వేస్తే పెనానికి అంటుకోకుండా ఉంటుంది.
- పెనం వేడెక్కిన తరవాత దానిమీద అర చెంచా నూనె వేయాలి. ఒక బంగాళదుంపను తీసుకుని మధ్యకు కోసి ఒక భాగం మీద చాకుతో గాట్లు పెట్టి దానితో పెనమంతా నూనె అంటుకునేలా రుద్దాలి. తరవాత దోశ వేస్తే చక్కగా వేగి పెనం నుంచి సులువుగా వచ్చేస్తుంది.
- పెనాన్ని ఉపయోగించడానికి ముందు దాని మీద కొంచెం ఉప్పు వేసి ఐస్ ముక్కతో బాగా రుద్దాలి. దీనివల్ల పెనం పూర్తిగా శుభ్రమై పిండి అంటుకోకుండా దోశలు చక్కగా వస్తాయి.
- దోశల పిండిలో చిటికెడు పంచదార కలిపితే దోశలు ఎరుపు రంగులో వేగి పెనానికి అంటుకోవు. దోశల పిండి కోసం పప్పు, బియ్యం నానబెట్టేటపుడే అందులో ఒక చెంచా మెంతులు కలపడం వల్ల కూడా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.