Share News

Saraswati Devi: సకల విద్యాప్రదాయిని

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:45 AM

సరస్వతీదేవిని ‘జ్ఞానం దేహి స్మృతి దేహి విద్యాం విద్యాధి దేవతే ప్రతిష్ఠా, కవితాం దేహి శక్తిం శిష్య ప్రబోధితాకామ్‌’ అని ‘బ్రహ్మవైవర్త పురాణం’ వర్ణించింది. ‘‘విద్యాధిదేవత అయిన సరస్వతీ దేవి జ్ఞానాన్ని, జ్ఞాపకాన్ని ప్రసాదించే తల్లి. విద్యను, ప్రతిష్టను, కవితాశక్తిని ఆమె అనుగ్రహిస్తుంది.

Saraswati Devi: సకల విద్యాప్రదాయిని

సర్వశక్తిమయి అయిన జగదంబను వాక్కు, బుద్ధి, జ్ఞానాల స్వరూపిణిగా భావన చేస్తే... ఆ రూపమే సరస్వతీదేవి. ఆమెను ఆరాధించే గొప్ప పర్వదినం మాఘ శుద్ధ పంచమి. దీనినే ‘శ్రీ పంచమి’ అని కూడా అంటారు. సరస్వతీదేవిని ‘జ్ఞానం దేహి స్మృతి దేహి విద్యాం విద్యాధి దేవతే ప్రతిష్ఠా, కవితాం దేహి శక్తిం శిష్య ప్రబోధితాకామ్‌’ అని ‘బ్రహ్మవైవర్త పురాణం’ వర్ణించింది. ‘‘విద్యాధిదేవత అయిన సరస్వతీ దేవి జ్ఞానాన్ని, జ్ఞాపకాన్ని ప్రసాదించే తల్లి. విద్యను, ప్రతిష్టను, కవితాశక్తిని ఆమె అనుగ్రహిస్తుంది. శిష్యులను జ్ఞానవంతులుగా చేసే శక్తిని సమకూరుస్తుంది’’ అని భావం.

ప్రాణశక్తి, జ్ఞాన శక్తి...

ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, సాహిత్య సంగీతాది కళా నైపుణ్యాలు సరస్వతీ గుణాలు. పూర్వం గురువులు ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ప్రార్థన చేయించిన తరువాత విద్యార్థులకు బోధన ప్రారంభించేవారు. అక్షరాభ్యాసానికి ముందు సరస్వతిని పూజించి, పలక మీద బలపంతో శివ పంచాక్షరిని రాయించే ఆనవాయితీ ఉంది. బ్రహ్మదేవుడు సరస్వతిని ఆరాధించి, జ్ఞానాన్ని పొంది... సృష్టిని ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. వాణి, భారతి, వీణాపాణి, విద్యావాచస్పతి, వాగ్దేవి, బుద్ధిధాత్రి, ప్రజ్ఞ... ఇలా ఆమెకు సహస్రాధికంగా పేర్లు ఉన్నాయి. లౌకికమైన విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మవిద్యకు అధినేత్రి సరస్వతి. భ్రమ, బుద్ధిమాంద్యం, మతిమరపు, వాక్కులో లోపాలు తదితరాలను సమూలంగా నశింపజేస్తుంది కాబట్టి ‘నిశ్శేష జాడ్యాపహా’ అని సరస్వతీదేవిని వర్ణించారు. వేదాల్లో సరస్వతీ సూక్తాలు ఉన్నాయి. ప్రాణ శక్తిగా, జ్ఞానశక్తిగా పూర్వులు సరస్వతిని ఆరాధించారు. ‘యా బ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిభిః దేవై సదా పూజితా..’ సరస్వతీ దేవిని సర్వ దేవతలూ పూజిస్తారు.


నాటి వ్యాసపురి... నేటి బాసర

పురాణ గ్రంథాల ప్రకారం... వాల్మీకి మహర్షి... సరస్వతిని ఉపాసించి రామాయణ మహా కావ్య రచన చేశాడు. ఆ బాటలోనే వ్యాస మునీంద్రుడు కూడా నడచి వేదవిభజన చేశాడు. పురాణాలను ఆవిష్కరించి, మహా భారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి... భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ఆచార్యుడు అయ్యాడు. సరస్వతీ దేవిని సాక్షాత్కరించుకున్న వ్యాసుడు ఆ తల్లి ఆజ్ఞపై పరమ పావన గోదావరీ తీరంలోని వాసర క్షేత్రంలో ఆమెను సైకత మూర్తిగా ప్రతిష్ఠించాడు. ఆ రోజు మాఘ శుద్ధ పంచమి అనీ ‘దేవీ భాగవతం’ తదితర గ్రంథాలు పేర్కొంటున్నాయి వ్యాసపురిగా ప్రసిద్ధి చెందిన ఆ క్షేత్రం అనంతర కాలంలో ‘బాసర’గా ప్రాచుర్యం పొందింది. సరస్వతీ కృపతోనే అపారమైన తత్త్వ విజ్ఞానాన్ని పొందానని చెప్పిన ఆది శంకరులు శృంగేరిలో శారదామాతను ప్రతిష్ఠించి, ఆరాధించారు. యాజ్ఞవల్క్యుడు గురు శాపం కారణంగా అభ్యసించిన విద్యలన్నిటినీ కోల్పోయాడు. సూర్యుడి సూచనల మేరకు సరస్వతిని ఉపాసించి ఆమె కరుణను పొందాడు. మళ్ళీ విద్వాంసుడయ్యాడు.

మాఘ శుద్ధ పంచమి రోజున జన్మించిన సరస్వతీ దేవి తెలుపు వర్ణంలో వెలుగులీనుతూ ఉంటుంది. ఆమెకు ఇష్టమైన రంగు తెలుపు. తెల్లని పద్మం ఆమె పీఠం. హంస ఆమె వాహనం. తెల్లని పుష్పాలు ఆమెకు ఇష్టం. తెల్ల రంగు వస్త్రాలతో ఆమెను అలంకరించి, పూజించి, తెల్లని పాయసాన్ని నివేదిస్తే అనుగ్రహిస్తుందని పెద్దలు చెప్పారు. పుస్తక ధారిణి అయిన సరస్వతిని పుస్తక రూపంలోనూ పూజించవచ్చు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సరస్వతిని శ్రీపంచమినాడు భక్తితో అర్చిస్తే సర్వ శుభాలు చేకూరుతానేది పెద్దల మాట.

ఆయపిళ్ళ రాజపాప


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 04:47 AM